ETV Bharat / bharat

ఏక్​నాథ్​ శిందే సీఎం పదవి సేఫ్​- ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు స్పీకర్ నో

author img

By PTI

Published : Jan 10, 2024, 6:24 PM IST

Updated : Jan 10, 2024, 8:51 PM IST

Shiv Sena Mlas Disqualification
Shiv Sena Mlas Disqualification

Shiv Sena MLAs Disqualification : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందేకు పదవీ గండం తప్పింది. శిందేతోపాటు మొత్తం 16 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేందుకు స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిరాకరించారు. శిందే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు.

Shiv Sena MLAs Disqualification : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్​ నిరాకరించారు. శిందే సహా మొత్తం 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. అనర్హత నోటీసులు జారీ చేసిన అనేక నెలల తర్వాత బుధవారం ఈమేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్. ఫలితంగా ఏక్​నాథ్​ శిందేకు పదవీ గండం తప్పింది.

అనర్హత పిటిషన్​పై తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ రాహుల్ నర్వేకర్. ఏక్​నాథ్​ శిందే నేతృత్వంలోని వర్గాన్నే అసలైన శివసేన పార్టీగా గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ రాజ్యాంగానికి సంబంధించిన అనేక నిబంధనలను ఈ సందర్భంగా స్పీకర్ ప్రస్తావించారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అనర్హత పిటిషన్​పై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు శివసేన-ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు.

స్పీకర్ నిర్ణయంపై ఉద్ధవ్​ ఫైర్​
ఏక్‌నాథ్‌ శిందే వర్గమే అసలైన శివసేన అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ తీసుకున్న నిర్ణయంపై ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్‌ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే కుట్రగా పేర్కొన్నారు. స్పీకర్‌ నిర్ణయాన్ని శివసేన (యూబీటీ) వర్గం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు చెప్పారు.

'స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ను కూర్చోబెట్టిన తీరు చూస్తే ఆయన కుమ్మక్కైనట్లు తేలిపోయింది. ఆయన ప్రకటించిన నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పన్నాగమనే సందేహం ఇంతకుముందే వ్యక్తం చేశాను. సుప్రీంకోర్టులో ధిక్కరణ కేసు వేయాలా? లేదా అనేది చూస్తాం. ఒకవేళ మా పార్టీ రాజ్యాంగం చెల్లకపోతే మరి మమ్మల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదు? సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. మహారాష్ట్ర ప్రజలకు, శివసేనకు సుప్రీంకోర్టులో పూర్తి న్యాయం జరుగుతుంది' అని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. మరోవైపు, స్పీకర్‌ నిర్ణయంపై ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని ఎన్సీపీ అగ్రనేత శరద్‌పవార్‌ తెలిపారు. అక్కడ న్యాయం జరుగుతుందని ఉద్ధవ్‌ ఠాక్రే ఆశిస్తున్నారని అన్నారు.

అనర్హతపై చర్చ ఎందుకు?
2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 105 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 సీట్లు అవసరం. అజిత్ పవార్ సహాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పినా 4 రోజులకే కుప్పకూలింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన కలిసి 'మహా వికాస్​ అఘాడీ' పేరుతో కూటమి ఏర్పాటు చేశాయి. ఫలితంగా విపక్ష కూటమిలోని శాసనసభ్యుల సంఖ్య 154కు చేరింది. అప్పటి శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది.

అయితే, ఏక్​నాథ్​ శిందే రూపంలో మహా వికాస్​ అఘాడీకి పెద్ద షాక్ తగిలింది. శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. 30 మంది శాసనసభ్యులతో కలిసి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు ఏక్​నాథ్ శిందే. సీఎం పదవి చేపట్టారు. ఆ తర్వాత శిందే వర్గంలోని శివసేన శాసనసభ్యుల సంఖ్య 40కి పెరిగింది.

శిందే తిరుగుబాటు చేయడంపై శివసేన-ఉద్ధవ్ బాల్​ ఠాక్రే వర్గం న్యాయపోరాటానికి దిగింది. కానీ అప్పుడు 16 మంది శాసనసభ్యులకు మాత్రమే అనర్హత నోటీసులు జారీ చేసింది. ఠాక్రే వర్గం అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ రాహుల్​ నర్వేకర్​కు సుప్రీంకోర్టు 2023 మే 11న సూచించింది. ఆగస్టు 11లోగా ఈ పని పూర్తి చేయాలని గడువు ఇచ్చింది. అయినా స్పీకర్​ తన నిర్ణయాన్ని అనేక నెలలపాటు వాయిదా వేశారు. ఉద్ధవ్​ ఠాక్రే వర్గం కోరినట్లు 16 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తే శిందే ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి వస్తుందని అంతా భావించారు. తర్వాత సీఎం పీఠం ఎవరికి దక్కుతుందో, బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏం చేయబోతుందోనని అందరూ చర్చించుకున్నారు. అయితే అలాంటి పరిస్థితికి ఏమాత్రం ఆస్కారం లేకుండా అనర్హత అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఎట్టకేలకు బుధవారం స్పీకర్ ప్రకటన చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 288. ఇందులో బీజేపీకి 105 సభ్యుల బలం ఉంది. అజిత్​ పవార్​ వెంట 40 మంది ఎన్​సీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. కనీసం మరో 10 మంది స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.

Last Updated :Jan 10, 2024, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.