ETV Bharat / bharat

'బుల్డోజర్లతో కూల్చివేతలను నిషేధించలేం.. అది పూర్తిగా వారి పరిధిలోని అంశం'

author img

By

Published : Jul 13, 2022, 5:56 PM IST

Bulldozer Demolitions Supreme Court: అక్రమంగా నిర్మించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసే ప్రక్రియపై నిషేధం విధించలేమని, అది పూర్తిగా మున్సిపల్‌ అధికారుల పరిధిలోని అంశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే మున్సిపల్‌ అధికారుల హక్కులను హరించడమే అవుతుందని పేర్కొంది. మరోవైపు, 'అగ్నిపథ్' పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జులై15న వాదనలు వింటామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

Bulldozers Supreme Court:
Bulldozers Supreme Court:

Bulldozer Demolitions Supreme Court: అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసే ప్రక్రియ పలు రాష్ట్రాల్లో ఇటీవల ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఒకవేళ అలా చేస్తే మున్సిపల్‌ అధికారుల హక్కులను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని యూపీ ప్రభుత్వం కూల్చివేతలకు పాల్పడుతోందంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా స్పందించింది. యూపీతో పాటు ఇదే ప్రక్రియను అనుసరిస్తోన్న మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల స్పందనను తెలియజేయాలని నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను యోగీ ప్రభుత్వం చేపట్టింది. వీటిని వ్యతిరేకిస్తూ జమియత్ ఉలామా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడుతోందంటూ పిటిషనర్‌ తరపున న్యాయవాదులు దుష్యంత్‌ దవే, సీయూ సింగ్‌లు వాదించారు. మతపరమైన సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ఈ తరహా కూల్చివేతలు జరుగుతున్నాయంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని.. మన సమాజానికీ మంచిది కాదని పేర్కొన్నారు.

ప్రతివాదుల తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వేలు.. అలాంటిదేమీ లేదని, ముఖ్యంగా అల్లర్లకు-కూల్చివేతలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాధారణంగా జరిగే ప్రక్రియేనని, చట్టప్రకారమే వీటిని కొనసాగిస్తున్నామని యూపీ ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది. వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై రాష్ట్రాలకు మధ్యంతర స్టేను ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, జమియత్ ఉలామా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 10న మరోసారి విచారణ జరుపుతామని పేర్కొంది.

ఇదిలాఉంటే, భాజపా మాజీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దారితీశాయి. వాటిపై చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు.. హింసాత్మక ఘటనలో నిందితులుగా ఉన్నవారి నివాసాలను కూల్చివేసే ప్రక్రియను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తోన్న బుల్డోజర్ విధానంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గత నెల విచారణ చేపట్టింది. ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం ధర్మాసనం.. ఈ ప్రక్రియ ప్రతీకారం తీర్చుకునే విధంగా ఉండకూడదని.. అవి చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని వ్యాఖ్యానించింది. కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు మరోసారి నిరాకరించింది.

జులై 15న 'అగ్నిపథ్'​పై విచారణ.. సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జులై 15న వాదనలు వింటామని తెలిపింది. 'అగ్నిపథ్' పథకంతో ఎయిర్​ ఫోర్స్​ ఔత్సాహికుల కెరీర్​ను 20 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలకు కేంద్రం తగ్గించిందని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో ఆరోపించారు. దాంతో పాటు పథకాన్ని రద్దు చేయాలని అనేక మంది పిటిషన్లు దాఖలు చేశారు.

'హిజాబ్​'పై విచారణకు అంగీకారం.. హిజాబ్ నిషేధానికి సంబంధించి క‌ర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కర్ణాటక హైకోర్టు.. మార్చి 15న హిజాబ్‌లు ధరించడం ఇస్లాం ముఖ్యమైన ఆచారం కిందకు రాదని తీర్పునిచ్చింది. దీనిపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. వచ్చే వారం తగిన బెంచ్​తో విచారణ జరిపించడానికి అంగీకరించింది.

'రామసేతు'పై జులై 26న విచారణ.. 'రామసేతు'ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ భాజపా నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జులై 26న వాదనలు వింటామని తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం.. జులై 26న విచారణ జరపాల్సిన జాబితాలోకి సుబ్రమణ్యస్వామిని పిటిషన్​ను చేర్చింది.

ఇవీ చదవండి: భార్యాభర్తల స్మగ్లింగ్ దందా.. ఫ్లైట్​లో 45 గన్స్​తో భారత్​కు.. అధికారులు షాక్

'సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసిన రియా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.