ETV Bharat / bharat

జీవిత ఖైదీలను నిర్దోషులుగా ప్రకటించిన సుప్రీం.. షూ ముద్రలు సరిపోలలేదని..

author img

By

Published : Jul 6, 2023, 12:16 PM IST

Etv sc-acquits-man-sentenced-life-in-murder-case-after-mismatch-of-moulds-of-imprint-of-shoe
Etv Bharatఇద్దరు జీవిత ఖైదీలను నిర్ధోషులుగా ప్రకటించిన సుప్రీం కోర్టు

జీవిత ఖైదు పడ్డ ఇద్దరు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. ఓ మహిళ హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరికి.. సరైన ఆధారాలు లేని కారణంగా ఉపశమనం కల్పించింది. పంజాబ్​ హరియాణా కోర్టు విధించిన శిక్షను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.

ఓ మహిళ హత్య కేసులో జీవిత ఖైదు పడ్డ ఇద్దరు వ్యక్తులను నిర్దోషులుగా ప్రకటించింది సుప్రీం కోర్టు. పంజాబ్​ హరియాణా కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సరైన ఆధారాలు లేని కారణంగా.. నిందితులకు ఉపశమనం కల్పిచింది. బుధవారం ఈ తీర్పు వెల్లడించింది.

ఇదీ జరిగింది..
2002 డిసెంబర్​ 30న భానుమతి అనే మహిళ హత్యకు గురైంది. ఘటనలో ప్రధాన సాక్షిగా బాధితురాలి కుమారుడు అజయ్ ఉన్నాడు. అప్పుడు అతడికి 11 సంవత్సరాలు. రాత్రి సమయంలో కిటికీలో నుంచి ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు.. భానుమతిని కత్తితో పొడిచి చంపేశాడు. అజయ్​పై కూడా దాడి చేశాడు ఆ వ్యక్తి. అనంతరం అదే కిటికీ గుండా దూకి పారిపోయాడు.

తెల్లవారుజాము ఉదయం 5 గంటలకు బాధితురాలి ఇంటి వద్దకు వచ్చిన పాలు విక్రయించే వ్యక్తి.. అజయ్​ ద్వారా ఘటన గురించి తెలుసుకున్నాడు. వెంటనే బాధితురాలి బంధువు రాజిందర్ సింగ్​కు సమాచారం అందించాడు. అదే సమయానికి భానుమతి భర్త సత్యపాల్​ కూడా ఇంటికి వచ్చాడు. సత్యపాల్ స్థానిక గుడిలో మహంత్​గా పనిచేస్తున్నాడు. ఘటన జరిగినప్పుడు అతడు ఇంట్లో లేడు. ఆస్తి వివాదం కారణంగానే మహిళ హత్యకు గురైనట్లు సమాచారం.

ఘటన జరిగిన ఇంటి దగ్గర లభించిన పాదరక్షల గుర్తుల ఆధారంగా ప్రదీప్​, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ జరిపిన పంజాబ్​ హరియాణా కోర్టు.. 2005 జనవరి 31న నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ సుప్రీం కోర్టు పరిశీలనలో మాత్రం బూట్లు/ చెప్పుల అచ్చులు.. నిందితుల కాళ్ల ముద్రణలతో సరిపోలేదు. దీంతో కింది కోర్టు తీర్పును కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం.

పంజాబ్​ హరియాణా కోర్టు తీర్పుపై 2009 జనవరి 12 సుప్రీం కోర్టుకు అప్పీల్​కు వెళ్లాడు ప్రదీప్​. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. సరైన ఆధారాలు లేని కారణంగా ప్రదీప్​ను నిర్దోషిగా ప్రకటించింది. పంజాబ్​ హరియాణా కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. ప్రదీప్​పై ఉన్న ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది.

బుధవారం దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. అజయ్​ సాక్ష్యంపైనే కింది కోర్టు ఎక్కువగా ఆధారపడిందని అభిప్రాయపడింది. "నిందితుడ్ని క్రాస్​ ఎగ్జామినేషన్ చేయగా.. తానే మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడని కింది కోర్టు తెలిపింది. కానీ ఆ స్టేట్​మెంట్​ను కోర్టు రికార్డ్ చేయలేదు. పాలు అమ్మే వ్యక్తి ఈ కేసులో ప్రధాన సాక్షి అయినప్పటికి అతడ్ని కింది కోర్టు విచారించలేదు. అతడు అందుబాటులో ఉన్నా ఎందుకు విచారించలేదో వివరించలేదు. కేవలం అజయ్​ చెప్పిన సాక్షం ఆధారంగా తీర్పు వెలువరించడం సమంజసం కాదు" అని సుప్రీం కోర్టు తెలిపింది. కేసును పూర్తి స్థాయిలో నిశితంగా పరిశీలించామని.. అజయ్​ సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోబోమని పేర్కొంది.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.