ETV Bharat / bharat

'రాష్ట్రాల అభిప్రాయాలూ వినండి'.. స్వలింగ వివాహాల కేసులో కేంద్రం రిక్వెస్ట్

author img

By

Published : Apr 19, 2023, 1:14 PM IST

Updated : Apr 19, 2023, 1:29 PM IST

same-sex-marriage-hearing
same-sex-marriage-hearing

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించింది. వారి భాగస్వామ్యం లేకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఈ ప్రక్రియను అసంపూర్తిగా మార్చుతుందని వ్యాఖ్యానించింది.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు సంబంధించిన కేసు విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను భాగం చేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయంలో అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఏప్రిల్ 18న లేఖలు రాసినట్లు ధర్మాసనానికి సమర్పించిన తాజా అఫిడవిట్​లో పేర్కొంది. వివాహ వ్యవస్థకు సంబంధించి చట్టాలు చేసే బాధ్యతల గురించి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రాలను ఇందులో భాగం చేయాలని పేర్కొంది.

"ఈ విషయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలి. వారికి ఈ విషయంలో చట్టాలు చేసే హక్కు ఉంది. దీనిపై తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఆ హక్కులను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిపై చట్టాలు చేశాయి. కాబట్టి వారిని ప్రస్తుత కేసులో భాగం చేయడం చాలా అవసరం. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ఆయా ప్రాంతాలు, వర్గాలలో ఉన్న ఆచారాలు, పద్ధతులు, నిబంధనలను గమనించాలి. వారి అభిప్రాయాలు లేకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా స్వలింగ వివాహాల చట్టబద్ధత ప్రక్రియను అసంపూర్తిగా మారుస్తుంది. సమర్థవంతమైన తీర్పు కోసం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోర్టు ముందు ఉంచడం చాలా ముఖ్యం."
-సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్

పది రోజుల్లోగా ఈ విషయంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం కోరింది.
రెండో రోజు విచారణ
స్వలింగ జంటల వివాహానికి చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. రెండో రోజూ (బుధవారం) వాదనలు ఆలకించింది. జస్టిస్ ఎస్​కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహ రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

ఈ వ్యవహారంపై కోర్టులో గట్టిగా వాదనలు జరుగుతున్నాయి. వైవాహిక గుర్తింపు అనేది పురుషుడు, మహిళకు సంబంధించిన అంశమని, ఒకే జననేంద్రియాలు ఉన్న వారి మధ్య కాదని కేంద్రం.. కోర్టులో వాదించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతపైనే కేంద్రం ప్రశ్నలు సంధిస్తోంది. చట్టసభలు తేల్చాల్సిన ఈ విషయాంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్నే ముందుగా నిర్ణయించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టును కోరారు. అయితే, కేసులో అనుకూల, ప్రతికూల వాదనలన్నీ విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు జననేంద్రియాలకు మాత్రమే పరిమితమైన అంశం కాదని సుప్రీం పేర్కొంది. ప్రత్యేక వివాహ చట్టానికి జననేంద్రియాలే పూర్తి ఆధారం కాదని వివరించింది.

Last Updated :Apr 19, 2023, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.