ETV Bharat / bharat

పరమ్​బీర్ లేఖపై పార్లమెంటులో రగడ

author img

By

Published : Mar 22, 2021, 5:28 PM IST

Ruckus in Lok Sabha over Maha Govt corruption charges
పరమ్​బీర్ లేఖపై పార్లమెంటులో రగడ

మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించిన ముంబయి మాజీ పోలీస్ కమిషనర్​ పరమ్​బీర్ సింగ్ లేఖ వివాదం.. పార్లమెంటుకు చేరింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం గద్దె దిగాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్, భాజపా, స్వతంత్ర ఎంపీ నవనీత్ రవి రాణా మధ్య మాటల యుద్ధం జరిగింది. రాజ్యసభలోనూ ఈ విషయంపై గందరగోళం నెలకొంది. భాజపా సభ్యుల ఆందోళనల నడుమ సభ ఓసారి వాయిదా పడింది.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​ నెలకు రు.100కోట్లు వసూలు చేయాలని అదేశించారని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్​ పరమ్​బీర్​ సింగ్ చేసిన ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ అంశంపై సభలో కాంగ్రెస్ నేత రవ్​నీత్​ సింగ్​, స్వతంత్ర ఎంపీ నవనీత్​ రవి రాణా, భాజపా సభ్యులు పీపీ చౌదరి, పూనం మహాజన్​ మధ్య మాటల యుద్ధం జరిగింది.

పరమ్​బీర్ లేఖపై పార్లమెంటులో రగడ..

లోక్​సభలో జీరో అవర్​ సందర్భంగా శివసేన, ఎన్సీపీ సభ్యుల అందోళనల నడుమే భాజపా నేత మనోజ్ కొటాక్ ఈ అంశాన్ని లేవనెత్తారు. సస్పెన్షన్​కు గురైన సచిన్ వాజేను ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఆదేేశించారని సీఎం ఉద్ధవ్​ ఠాక్రేకు పరమ్​బీర్​ సింగ్​ రాసిన లేఖలో ఉందని తెలిపారు. ప్రభుత్వంలో భాగమైన వారే అక్రమ వసూళ్ల కోసం అధికారులను ఉపయోగించుకుంటున్నారని ఈ లేఖ తేటతెల్లం చేస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా ఈ విషయంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఒక్క మాటైనా మాట్లాడలేదని విమర్శించారు. హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​, మహారాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

ఇది అత్యంత తీవ్రమైన విషయమని మరో భాజపా ఎంపీ రాకేశ్ సింగ్​ అన్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశంతో ముడిపడి ఉందని చెప్పారు. అక్రమ వసూళ్ల వ్యవహారంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి సంబంధాలున్నాయని పరమ్​బీర్​ లేఖ స్పష్టం చేస్తోందన్నారు.

" మహారాష్ట్ర హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలు మరెవరో చేసినవి కాదు. ముంబయి మాజీ పోలీస్​ కమిషనర్​ ఈ ఆరోపణలు చేశారు. 16ఏళ్ల పాటు సస్పెండ్​ అయిన ఏపీఐ ర్యాంకు అధికారిని మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి వెనకేసుకు రావాల్సిన అవసరమేంటి? ఒక ముంబయిలోనే రూ.100కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే.. మహారాష్ట్ర మొత్తం కలిపి ఆ లెక్క ఎంత ఉంటుంది?"

--రాకేశ్ సింగ్, భాజపా ఎంపీ.

తోసిపుచ్చిన శివసేన..

అయితే భాజపా ఆరోపణలను శివసేన తోసిపుచ్చింది. ముంబయిలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని భాజపా 14 నెలలుగా కుట్ర చేస్తోందని ఆరోపించింది. ఈ వ్యవహారం మొత్తం భాజపా కుట్రలో భాగమని శివసేన ఎంపీ వినాయక్ రౌత్​ ఆరోపించారు. లేఖ రాసిన ముంబయి మాజీ పోలీసు కమిషనర్ అత్యంత అవినీతి అధికారి అని ఆరోపించారు.

భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర సంస్థలను వినియోగిస్తున్నారని కాంగ్రెస్​ ఎంపీ రవనీత్ సింగ్ విమర్శించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. మహారాష్ట్రలో మాత్రమే కాదు భాజపా అధికారంలో లేని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

రాజ్యసభ వాయిదా..

రాజ్యసభలోనూ ఈ విషయంపై దుమారం చెలరేగింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే అధికార పక్ష సభ్యులు మహారాష్ట్ర అంశాన్ని లేవనెత్తారు. దీనిపై మాట్లాడవద్దని సభ్యులకు డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ విజ్ఞప్తి చేశారు. అనంతరం పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్​ను ప్రశ్న అడగాలని కాంగ్రెస్​ నేత ఛాయ వర్మకు సూచించారు. ఈ సమయంలోనే ట్రెజరీ బెంచ్ సభ్యులు మళ్లీ ఆందోళనలు చేపట్టారు. గందరగోళం నడుమ ఛాయ వర్మ అడిగిన ప్రశ్న తనకు అర్థం కాలేదని, మహారాష్ట్ర అంశాన్ని లేవనెత్తేందుకు జావడేకర్​ ప్రయత్నించారు. అనంతరం డిప్యూటీ ఛైర్మన్ సభను ఒకసారి వాయిదా వేశారు.

రాజ్యసభలో ప్రశ్నోత్తరాలకు ముందే మహారాష్ట్ర అంశంపై భాజపా సభ్యులు అందోళనకు దిగారు. రాష్ట్రాలకు సంబంధించి విషయాలను లేవనెత్తొద్దని ఛైర్మన్​ వెంకయ్య నాయుడు సభ్యులకు పదేపదే విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: పరమ్​Xదేశ్​ముఖ్​- 'మహా'లో లేఖ దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.