ETV Bharat / bharat

సీఎం కానుక- కాలేజీలో చేరే ప్రతి అమ్మాయికి రూ.20 వేలు!

author img

By

Published : Aug 23, 2021, 4:15 PM IST

విద్యార్థినుల కోసం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పౌర్ణమి రోజు సోదరుడి అవతారమెత్తిన ఆ రాష్ట్ర సీఎం.. బాలికల ఉన్నత చదువుల కోసం మరో పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా కళాశాలల్లో చేరబోయే విద్యార్థినులకు రూ.20,000 చొప్పున కానుక అందజేయనున్నట్లు వెల్లడించారు.

Ladali Laxmi Scheme
విద్యార్థినులకు సీఎం కానుక-

రక్షాబంధన్(Raksha Bandhan)​ రోజు సోదరులకు సోదరీమణులు రాఖీ కడితే.. కానుక ఇవ్వడం ఆనవాయితీ. దేశానికి పీఎం అయినా.. రాష్ట్రానికి సీఎం అయినా.. ఇందుకు అతీతులు కారు! అందుకే రాష్ట్రంలోని బాలికలు, మహిళలను తన అక్కచెళ్లెల్లగా భావించిన మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. వారికి 'లాడ్లీ లక్ష్మీ స్కీమ్​' కింద మరో కానుక ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలోని కళాశాలల్లో చేరబోయే విద్యార్థినులకు రూ.20 వేలు చొప్పున నగదు అందజేయనున్నారు. బాలికల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు.

"దేశం సాధికారత సాధించాలంటే.. మహిళా సాధికారత అవసరమని విశ్వసిస్తాను. అమ్మాయిలు కళాశాలలో ప్రవేశిస్తే.. రూ.20,000 నగదు అందజేయాలని నిర్ణయించుకున్నాం. బాలికల ఉన్నత విద్యకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఆర్థిక సాయం కూడా అందిస్తామని భరోసా ఇస్తున్నాను" అని శివరాజ్​ సింగ్​ ట్వీట్ చేశారు.

ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట

రాష్ట్ర పోలీసు నియామకంలో 30 శాతం, ఉపాధ్యాయుల నియామకంలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లు సీఎం శివరాజ్​ సింగ్​ పేర్కొన్నారు. మహిళ పేరు మీద ఆస్తి నమోదు చేసినట్లయితే 1 శాతం ఫీజు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం సీట్లు కూడా మహిళలకే కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

మహిళ కోసం ఎన్ని పథకాలో..!

లాడ్లీ లక్ష్మీ పథకం కాకుండా.. రాష్ట్రంలో 'ప్రతిభా కిరణ్​ స్కీమ్​', 'గావ్​ కీ బేటీ స్కీమ్​'లు అమల్లో ఉన్నాయి. అలాగే యూనిఫాంలు, సైకిళ్లు, పుస్తకాలు సహా అన్నీ ఉచితంగా అందిస్తోంది రాష్ట్ర సర్కారు. విదేశీ చదువులకు సైతం ఉపకారవేతనం ఇస్తోంది. మహిళల వివాహం కోసం 'ముఖ్యమంత్రి కుమార్తె వివాహ పథకం' కూడా అమల్లో ఉంది. 'ప్రసూతి సహాయ పథకం' ద్వారా గర్భిణీలు ప్రసవానికి ముందు రూ.4,000, ప్రసవానంతరం రూ.12,000 ఆర్థిక సహాయం పొందవచ్చు.

జిల్లాకో మహిళా పోలీసు స్టేషన్​

బాలికల సంరక్షణ కోసం ప్రతి జిల్లాలో మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు శివరాజ్​ తెలిపారు. అలాగే మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్​ అని ఆయన పేర్కొన్నారు. అలాగే మహిళలను బెదిరించి.. బలవంతంగా వివాహాలు జరిపినట్లయితే మధ్యప్రదేశ్​ ఫ్రీడమ్​ ఆఫ్​ రిలిజియన్​ బిల్లు 2020 కింద కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Rakhi: అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతమే రాఖీ!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.