సాయుధ తిరుగుబాటుతో.. బ్రిటిష్‌ గవర్నర్‌ తలకే వెలగట్టి!

author img

By

Published : Nov 6, 2021, 7:41 AM IST

azadi ka amrit story

తన తలకు బ్రిటిష్‌ ప్రభుత్వం వెలకడితే... పోటీగా బ్రిటిష్‌ గవర్నర్‌ తలకే వెలకట్టిన ధీరుడు! ఆదివాసీలను, రైతులను ఏకంచేసి ఆంగ్లేయులను బెదరగొట్టిన తొలితరం సాయుధ వీరుడు. అందుకే పట్టుబడితే అండమాన్‌కు కూడా కాకుండా సుదూరంగా యెమన్‌ దేశానికి తరలించింది బ్రిటిష్‌ సర్కారు. ఆంగ్లేయుల గుండెల్లో అంతగా నిద్రపోయిన గెరిల్లా యుద్ధతంత్రుడు వాసుదేవ్‌ బల్వంత్‌ ఫాడ్కే!

భారత స్వాతంత్య్రోద్యమంలో సామాన్యుల సాయుధ తిరుగుబాటుకు పితామహుడిగా చరిత్రకెక్కారు వాసుదేవ్​ బల్వంత్​ ఫాడ్కే (1845-1883). మహారాష్ట్రలోని షిర్దోన్‌ గ్రామంలో సంప్రదాయ కుటుంబంలో జన్మించిన ఆయన పుణెలోని మిలిటరీ అకౌంట్స్‌ విభాగంలో గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. అక్కడే క్రాంతివీర్‌ లహూజీ వస్తాద్‌ సాల్వే తాలింఖానాలో.. కత్తి యుద్ధం, కర్రసాము, తుపాకీ పేల్చడం వంటి యుద్ధ విద్యలను నేర్చుకునేవారు. దళితుడైన సాల్వే బ్రిటిష్‌ పాలన నుంచి దేశాన్ని విముక్తం చేసే దిశగా ఫాడ్కేను సిద్ధం చేశారు. కేవలం విద్యావంతులపై ఆధారపడకుండా రైతులు, వెనుకబడిన కులాలను స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములను చేయాలని ఆయన సూచించేవారు. ఇంతలో ఫాడ్కే తల్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చూడటానికి స్వగ్రామం వెళ్లాలనుకున్నా బ్రిటిష్‌ అధికారులు సెలవు ఇవ్వలేదు. ఆమె కాలం చేశాక.. తదుపరి సంవత్సరం తల్లి శ్రాద్ధ కర్మలకు వెళ్లడానికీ అధికారులు అంగీకరించలేదు. బ్రిటిష్‌ అధికారుల కసాయితనం ఫాడ్కే గుండెలో ప్రతీకార జ్వాలను రగిలించింది. వలస పాలనపై ఉద్యమం దిశగా యువతను విద్యావంతులను చేయడానికి తాను స్వయంగా పుణేలో ఐక్య వర్ధిని సభను స్థాపించారు.

azadi ka amrit story
వాసుదేవ్‌ బల్వంత్‌ ఫాడ్కే

అంతలో మహారాష్ట్రలో కరవు సంభవించింది. చెరువులు, బావులు, ఏరులు ఎండిపోయి వ్యవసాయం పడకేసింది. వాడలన్నీ వల్లకాళ్లయ్యాయి. ఆకలితో చనిపోయినవారికి అంత్యక్రియలు చేసే పరిస్థితీ లేక కుటుంబాలు మృతదేహాలను ఎక్కడివక్కడ వదిలేసేవి. ఇది చాలదన్నట్లు మశూచి విజృంభించింది. ఇంతటి ఘోర కలిలోనూ బ్రిటిష్‌ వాళ్లు రైతులను పన్ను కట్టమని వేధించేవారు. కడుపు రగిలిన ఫాడ్కే తిరుగుబాటు జెండా ఎగరేశారు. బ్రిటిష్‌ పాలనను కూలదోయడానికి కలసిరావలసిందిగా విద్యావంతులను కోరినా అంతగా స్పందన లేక.. సామాన్యులనే పోరాట యోధులుగా తీర్చిదిద్దుకున్నారు.

ఒకప్పుడు కోటలకు సంరక్షకులుగా ఉండి, బ్రిటిష్‌ వారు వాటిని ధ్వంసం చేయడంతో దేశ దిమ్మరులుగా మారిన రామోశీ వర్గం వారినీ, భిల్లు తెగవారినీ, దళితులను, పేద రైతులను కూడగట్టారు. సాయుధ తిరుగుబాటు ప్రారంభించారు. వడ్డీ వ్యాపారుల ఇళ్లపైన, బ్రిటిష్‌ కోశాగారాలపైన దాడులు చేయసాగారు. దోచిన సొమ్మును పేదలకు పంచేవారు. 1879 నుంచి నాలుగైదేళ్లపాటు పుణె, సతారా ప్రాంతాలలో ఫాడ్కే సాయుధ తిరుగుబాటు సాగింది. పుణేలోని బ్రిటిష్‌ సైనికులపై మెరుపుదాడి చేసి పట్టణాన్ని కొన్ని రోజులపాటు తన అధీనంలోకి తీసుకున్నారు. ఫాడ్కే కుడి భుజమైన రామోశీ నాయకుడు దౌలత్‌ రావ్‌ నాయక్‌ను బ్రిటిష్‌ వారు కాల్చి చంపడం ఆయన పోరాటాన్ని కుంటుపరచింది. దాంతో ఆయన శ్రీశైలానికి వచ్చి కొన్నాళ్లు తలదాచుకున్నారు. హైదరాబాద్‌ సంస్థానంలో దాదాపు 500 మంది రోహిల్లాలు, అరబ్బులను సమీకరించి మళ్లీ సాయుధ తిరుగుబాటు కొనసాగించారు. ఫాడ్కేని పట్టి ఇచ్చినవారికి నగదు బహుమానం ఇస్తామని బ్రిటిష్‌ వారు ప్రకటించారు. దీంతో ముంబయి గవర్నర్‌ను పట్టి ఇస్తే తానే ఎదురు బహుమతిని ఇస్తానని ఫాడ్కే ప్రకటించటం విశేషం.

చివరకు బ్రిటిష్‌ వారు ప్రకటించిన బహుమతికి ఆశపడిన ఒక వ్యక్తి ఫాడ్కే గురించిన సమాచారం అందించాడు. మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులోని దేవాలయంలో హోరాహోరీ పోరాటం తరవాత బ్రిటిష్‌ వాళ్లు ఆయన్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. భారత్‌లో ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయని భయపడి.. ఆయన్ను యెమన్​లోని ఏడెన్‌ జైలుకు తరలించారు. అక్కడి నుంచీ తప్పించుకొన్నారు ఫాడ్కే. కానీ పోలీసులు వెంటనే పట్టుకున్నారు. జైలులోనే సత్యాగ్రహం చేస్తూ 1883 ఫిబ్రవరి 17న ఫాడ్కే కన్నుమూశారు. ఆయన వీర గాథలను బంకించంద్ర ఛటర్జీ 'ఆనంద్‌ మఠ్‌' నవలలో పొందుపరిచారు. ఫాడ్కే గురించి ఎక్కువ రాశారంటూ ఆనంద్‌మఠ్‌ నవలను బ్రిటిష్‌ ప్రభుత్వం ఐదుసార్లు తిరగరాయించిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఘనతను!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.