ETV Bharat / bharat

ట్రక్కును ఢీ కొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

author img

By

Published : Apr 8, 2023, 10:56 AM IST

Updated : Apr 8, 2023, 12:05 PM IST

road-accident-in-uttar-pradesh-6-members-of-a-family-died
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో.. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒడిశాలో, మహారాష్ట్రలోను రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

ఉత్తర్​ప్రదేశ్​లోని బలరాంపుర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు కారు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో.. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీదత్తగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజాజ్ షుగర్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులంతా దేవ్​రియా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఓ భార్య, భర్త వారి నలుగురు పిల్లలు చనిపోయారు. వీరంతా కారులో దేవ్​రియా నుంచి నైనీతాల్​ వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

ఒడిశాలో రోడ్డు ప్రమాదం..
ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాజ్‌పూర్‌ జిల్లా నంగళ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. చండీకోల్‌ నుంచి పారాదీప్ వెళ్తున్న వ్యాను ఢీకొట్టడం వల్ల ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు చెప్పారు. బాధితులను కటక్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మహారాష్ట్రలోనూ రోడ్డు ప్రమాదం..
మహారాష్ట్రలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి.. లోయలో పడింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం పుణె జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బారామతి తాలూకా.. దౌండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలాడ్ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులందరిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కొల్హాపూర్, పంఢర్‌పుర్, మరిన్ని తీర్థయాత్రల పర్యటన కోసం.. ప్రయాణికులు బస్సును అద్దెకు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. చాలా మంది ప్రయాణికులు భవానీ పేట ప్రాంతానికి చెందిన వారని అధికారులు వెల్లడించారు.

చెరువులో స్నానానికి వెళ్లి.. ముగ్గురు చిన్నారులు మృతి..
మధ్యప్రదేశ్​లో విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి వెళ్లి.. ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు, వారి స్నేహితుడు ఉన్నాడు. సింగ్రౌలి జిల్లాలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను, మణిరామ్ కేవత్ కుమారులు.. సునీల్ (9) అజిత్ (7), మహేశ్​ కేవత్​ కుమారుడు.. సందీప్​(9)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం వైధాన్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధికల గ్రామంలో ఘటన జరిగింది. అదే సమయంలో చిన్నారుల తల్లిదండ్రులు పక్కనే ఉన్న పొలాల్లో పనిచేకుంటున్నారు. పిల్లలు ముగ్గురు స్నానం చేద్దామని చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే వారికి ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగిపోయారు.

"జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది. చిన్నారులు తప్పిపోవడంపై వారి తల్లిదండ్రులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చిన్నారులు చెరువులో పడినట్లుగా అనుమానించి గాలింపు చేపట్టారు. అనంతరం నీటి నుంచి వారి మృతదేహాలు వెలికితీశారు." అని పోలీసు అధికారి తెలిపారు. ఘటనపై చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Last Updated :Apr 8, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.