ETV Bharat / bharat

కరోనాపై కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాలకు లేఖలు.. ఏప్రిల్​ 10, 11న మాక్​డ్రిల్స్​

author img

By

Published : Mar 25, 2023, 7:25 PM IST

Rise in Covid cases
Rise in Covid cases

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మరోవైపు ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించింది.

దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్‌లలో కేసులు పెరుగుతున్నాయని.. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య, కొవిడ్‌ మరణాలు తక్కువే ఉన్నాయని పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని చెప్పింది కేంద్రం. పరిస్థితులను అన్ని రాష్ట్రాలు క్షుణ్నంగా పరిశీలించి.. ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించింది. జనం గుంపులుగా ఉండే పరిస్థితులను నియంత్రించాలని.. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, రోగులు తప్పక మాస్క్ ధరించాలని హితవు పలికింది. కొవిడ్‌ పరీక్షలు పెంచి, లక్షణాలపై తప్పకుండా నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది.

మరోవైపు ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల సంసిద్ధతను సమీక్షించేందుకు నిర్ణయించింది. అందుకోసం ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్ నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం ఐసీఎంఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేశాయి. వైద్య సామాగ్రి, ఆక్సిజన్, ఔషధాల లభ్యతను అంచనా వేసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఈ డ్రిల్స్‌లో పాల్గొనాలని పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య భారీగా పడిపోయిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం చూసుకుంటే చాలా తక్కువగా ఉందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ హాట్‌స్పాట్‌లను గుర్తించి, వైరస్‌ను కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండడం, మాస్కులు ధరించడం, గాలివెలుతురు సరిగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యల ద్వారా కొవిడ్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని తెలిపింది.

24 గంటల్లో 1,590 కొవిడ్‌ కొత్త కేసులు
గడిచిన 24 గంటల కరోనా కేసుల సంఖ్యను శనివారం ఉదయం కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 1,590 కొవిడ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపింది. 146 రోజుల్లో ఇదే అత్యధికమని తెలిపింది. క్రియాశీలక కేసులు 8, 601కు చేరాయి.

ఇవీ చదవండి : 15 కిలోల వెండితో ప్రధాని మోదీకి ప్రత్యేక కానుక.. అయోధ్య గుడి, శ్రీరామ ప్రతిమలతో..

తండ్రిపై కోపం చిన్నారికి శాపం.. హోంవర్క్​ చేసుకుంటున్న బాలికను కాల్చిచంపిన దుండగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.