ETV Bharat / bharat

ఆక్సిజన్​ కొరత.. ఇప్పుడే ఎందుకిలా..?

author img

By

Published : Apr 22, 2021, 5:38 AM IST

oxygen, oxygen shortage
ఆక్సిజన్​ కొరత.. ఇప్పుడే ఎందుకిలా..?

దేశంలో కరోనా సెకెండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న వేళ ప్రతి చోటా వినిపిస్తున్న మాట ఆక్సిజన్‌ కొరత. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిల్చుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి మొర పెట్టుకుంటున్నాయి. కరోనా దేశంలోకి ప్రవేశించినప్పుడు ఎలాంటి మౌలిక వసతులూ లేని తొలినాళ్లలో లేని ఆక్సిజన్‌ కొరత.. ఇప్పుడే ఎందుకు ఏర్పడుతోంది...? కొరతకు కారణాలు ఏంటి?

కరోనా మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌ ప్రధాని మోదీ చెప్పినట్లుగా తుపానులా వచ్చి పడింది. దీంతో కేసులు భారీగా పెరగడానికి తోడు రెండో వేవ్‌ సమయంలో ఎక్కువ మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతుండడంతో దీనికి డిమాండ్‌ ఏర్పడింది. తొలి వేవ్‌ సమయంలో రోజకు 2,800 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం కాగా.. ప్రస్తుతం ఆ డిమాండ్‌ 5వేల మెట్రిక్‌ టన్నులకు చేరింది. దీంతో ఆక్సిజన్‌ కొరత దేశాన్ని వెంటాడుతోంది.

ఎగుమతులు కారణమా..?

2020 ఏప్రిల్‌ నుంచి 2021 జనవరి మధ్య కాలంలో భారత్‌ సుమారు 9,301 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను విదేశాలకు ఎగుమతి చేసిందన్న నివేదిక కలకలం రేపింది. దీంతో కేంద్రంపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకోకుండా విదేశాలకు ఎలా ఎగుమతి చేస్తారన్న ప్రశ్నలు ఉత్పత్తన్నమయ్యాయి. దీనిపై కేంద్రం స్పందించింది. దేశంలో అంతగా డిమాండ్‌ లేని డిసెంబర్‌, జనవరి నెలల్లో ఎగుమతులు జరిగాయని, అది కూడా అవసరానికి మించి ఉన్న ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌నే ఎగుమతి చేశామని పేర్కొంది.

ఒక్కో సమయంలో ఒక్కో చోట డిమాండ్‌

దేశంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడడానికి మరో ముఖ్య కారణం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయంలో కొవిడ్‌ విజృంభించడమే. ప్రస్తుతం దేశానికి రోజుకు 7200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. డిమాండ్‌ మాత్రం రోజుకు 5వేల మెట్రిక్‌ టన్నులు ఉంది. అయితే, సెకండ్‌ వేవ్‌ తొలినాళ్లలో మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లో కేసులు విజృంభించాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతూ.. దిల్లీ, యూపీల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో డిమాండ్‌ ఏర్పడిన ప్రాంతానికి సత్వరమే ఆక్సిజన్‌ రవాణా చేసే విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆక్సిజన్‌ తయారీ సంస్థలు చెబుతున్నాయి. డిమాండ్‌ ఉన్న మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో తయారీ ప్లాంట్లు లేకపోవడాన్ని కారణంగా చెబుతున్నారు.

సిలిండర్లు, ట్యాంకర్ల కొరత

ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్‌ను తరలించాలంటే ముఖ్యంగా క్రయోజనిక్‌ ట్యాంకర్లు, సిలిండర్లు అవసరం. ప్రస్తుతం వీటి కొరత కూడా ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బందులకు కారణమవుతున్నాయి. పైగా సువిశాల దేశంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆక్సిజన్‌ను తరలించాలంటే రవాణాకు ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే కేంద్రం ఇటీవల ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించింది. దీనికి తోడు 50వేల మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సైతం దిగుమతికి నిర్ణయించింది. దీంతో ఆక్సిజన్‌ సరఫరాకు కొద్దిరోజుల్లోనే ఇబ్బందులు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో మే చివరి నాటికి రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకుంటే మాత్రం ఆక్సిజన్‌కు తీవ్రత కొరత ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆక్సిజన్ కోసం దిల్లీ హైకోర్టుకు మ్యాక్స్ ఆసుపత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.