ETV Bharat / bharat

అయోధ్యలో 'శ్రీరామ నవమి' ఈసారి మరింత ప్రత్యేకం.. 10 రోజులు వేడుకలు.. లక్షల్లో బహుమతులు!

author img

By

Published : Mar 20, 2023, 6:23 PM IST

ఈసారి అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకల మరింత వైభవంగా నిర్వహించనున్నారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను నిర్వహించడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

ram navami sri Rama Navami 2023 ayodhya
ram navami sri Rama Navami 2023 ayodhya

శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరపడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలోని శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​.. ఈ సారి వేడుకలను మరింత వైభవంగా జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగా 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం శ్రీరామ జన్మ ఉత్సవ్​ పేరిట ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఈసారి ఉత్సవాలకు చాలా ప్రాధాన్యం ఉంది. తాత్కాలిక ఆలయంలో జరుగుతున్న చివరి శ్రీరామ నవమి ఉత్సవాలు ఇవే. వచ్చే ఏడాది శ్రీరాముడు.. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన ఆలయంలో పూజలు అందుకోనున్నాడు.

మార్చి 30న శ్రీరామ నవమిని పురస్కరించుకుని.. శ్రీరామ జన్మ భూమి ట్రస్ట్​ మార్చి 22 నుంచి శ్రీరామ జన్మోత్సవాన్ని ప్రారంభించనుంది. ఈ ఉత్సవాల్లో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా.. ఏడు రోజుల పాటు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరపనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

సైకిల్‌ రేస్‌, మారథాన్‌, ఖోఖో, కత్తి యుద్ధం, కబడ్డీ, బోటింగ్‌, వాలీబాల్‌, కుస్తీ లాంటి డజనుకు పైగా క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో మొదటగా మార్చి 22న సైకిల్​ రేస్​ ఉంటుంది. ఈ రేస్​ అయోధ్యలోని లతా మంగేష్కర్​ చౌక్​ వద్ద ఉదయం 5.30 గంటలకు మొదలవుతుంది. 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరయూ హారతి ఘాట్​ వద్ద ముగుస్తుంది. ఇక సాంస్కృతిక కార్యక్రమాల్లో.. కథలు, కవి సమ్మేళనం, సంగీతం, భజన లాంటివి నిర్వహించనున్నారు. కాగా, అయోధ్య నుంచి 300 కిలో మీటర్ల రేడియస్​లో ఉన్న వర్ధమాన క్రీడాకారులు, కళాకారులకు ప్రాధాన్యం ఇస్తారు.

Ram Navami 2023
అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు

ఖరీదైన బహుమతులు..
క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఖరీదైన బహుమతులు అందజేయనున్నారు. అనంతరం వారికి సత్కారం చేయనున్నారు. ఇలా మొత్తంగా బహుమతులకు రూ. 12,45,300 ఖర్చు చేయనున్నారు.

శ్రీరామ నవమి విశిష్టత..
రామ.. అనే పదం కేవలం రెండు అక్షరాల కలయిక కాదు.. అదో మహాశక్తి మంత్రం. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే.. చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్త జనం పండుగ జరుపుకొనే శుభ తరుణం ఇది. ఈ రోజు ప్రధానంగా శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం అనే మూడు ఘట్టాలు నిర్వహిస్తారు. హిందూ సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.