ETV Bharat / bharat

'ఆక్సిజన్​ మరణాల'పై రాజకీయ దుమారం

author img

By

Published : Jul 21, 2021, 5:01 PM IST

died due to oxygen shortage
ఆక్సిజన్​ కొరతతో మరణాలు

ఆక్సిజన్​ కొరతతో(Oxygen shortage in India) దేశంలో ఒక్క మరణం కూడా సంభవించలేదని పార్లమెంట్​లో కేంద్రం ప్రకటించటం వల్ల రాజకీయ రగడను రాజేసింది. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి విపక్షాలు. కేంద్రం తీరువల్లే దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని మండిపడ్డాయి. తాజా ప్రకటన పార్లమెంట్​ను తప్పుదోవపట్టించటమేనని ఆరోపించాయి. విపక్షాల విమర్శలను భాజపా తిప్పికొట్టింది. ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని ఎదురుదాడికి దిగింది.

కరోనా రెండో ఉద్ధృతి(Corona second wave) సమయంలో దేశంలో ఎలాంటి దుర్భర పరిస్థితులు తలెత్తాయి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. లక్షల కొద్ది కేసులు, శవాల గుట్టలు, ఆక్సిజన్​ కొరతతో(Oxygen shortage in India) ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే.. ఆక్సిజన్​ కొరత కారణంగా కొవిడ్(Covid-19)​ బాధితులెవరూ మృతి చెందలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభలో ప్రకటించింది. ఇలాంటి మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతలేవీ నివేదించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ వెల్లడించారు. ఆక్సిజన్​ కొరతతో ఒక్కరు కూడా మృతి చెందలేదని ప్రకటించటంపై రాజకీయ దుమారం చెలరేగింది. దీంతో కేంద్రం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి.

కేంద్రం వల్లే మరణాలు..

ఆక్సిజన్​ కొరతతో ఒక్క మరణం సంభవించలేదని ప్రకటించటంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కరోనా సమయంలో 700 శాతం మేర ఆక్సిజన్​ ఎగమతులను పెంచటం, దేశీయంగా ప్రాణవాయువు సరఫరాకు ట్యాంకులను అందుబాటులో ఉంచకపోవటం వల్లే మరణాలు సంభవించాయన్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. అలాగే.. నిపుణుల బృందం, పార్లమెంటరీ కమిటీల సలహాలను విస్మరించి, ఆక్సిజన్ అందించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటమూ ఓ కారణమని ఆరోపించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ ప్లాంట్ల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టినట్లు కనిపించలేదన్నారు.

తప్పుడు సమాచారంతో పార్లమెంట్​ను తప్పుదోవ పట్టించడం కోసమే ఇలా చేసినట్లు కాంగ్రెస్​ పేర్కొంది.

పాలసీ మార్పుతో విపత్కర పరిస్థితులు: సిసోడియా

కరోనా రెండో దశలో ఆక్సిజన్​ కొరత వల్ల నమోదైన మరణాలపై దర్యాప్తునకు కేంద్రం అనుమతిస్తే తమ ప్రభుత్వం ప్రత్యేక ప్యానల్​ను ఏర్పాటు చేస్తుందన్నారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా. కేంద్రం తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఏప్రిల్​ 13 తర్వాత ఆక్సిజన్​ పంపిణీ పాలసీని మార్చటం, సరైన నిర్వహణ లేకపోవటం వల్ల ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ కొరతకు కారణమైందని, దాంతోనే విపత్కర పరిస్థితులు తలెత్తాయన్నారు. మరణాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించటం లేదని ఆరోపించారు.

కేంద్రాన్ని కోర్టుకు లాగాలి: రౌత్​

ఆక్సిజన్​ కొరతతో తమ బంధువులను కోల్పోయిన ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టుకు లాగాలన్నారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​. ' పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్​ కొరతతో చాలా మంది చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం బయపడి దూరంగా పరుగెడుతోంది. ఇది పెగాసస్ ప్రభావంలా నాకు అనిపిస్తోంది. కరోనా మరణాలపై పార్లమెంట్​లో కేంద్రం అంగీకరించేలా బంధువులను కోల్పోయిన ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు.

రాజకీయాలు చేస్తున్నారు: భాజపా

ఆక్సిజన్​ కొరతతో మరణాలపై దుమారం చెలరేగిన నేపథ్యంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టింది భాజపా. కొవిడ్​ రెండో ఉద్ధృతి సమయంలో ఆక్సిజన్​ కొరతతో మరణాలు సంభవించలేదని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కోర్టులకు తెలిపాయని గుర్తు చేసింది. అలాగే.. కేంద్రానికి ఇచ్చిన సమాధానంలోనూ అలాంటి వివరాలే ఇచ్చినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన సమాచారం మేరకే పార్లమెంట్​లో ప్రకటన చేసినట్లు భాజపా ప్రతినిధి సంబిత్​ పాత్ర తెలిపారు. అలాంటి మరణాలపై ఏ ఒక్క రాష్ట్రం డేటా ఇవ్వలేదని ఉద్ఘాటించారు. కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ వంటి నేతలు ఈ అంశంపై రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

మా రాష్ట్రంలో ఒక్కరు చనిపోలేదు: మధ్యప్రదేశ్​ మంత్రి

ఆక్సిజన్​ కొరత వల్ల తమ రాష్ట్రంలో ఒక్క మరణం సంభవించలేదన్నారు మధ్యప్రదేశ్​ వైద్య,విద్య శాఖ మంత్రి విశ్వాస్​ సరాంగ్​. 'ఆక్సిజన్​ అందక మా రాష్ట్రంలో ఒక్కరూ చనిపోలేదు. కేంద్ర ఆరోగ్య మంత్రి రాజ్యసభలో అదే చెప్పారు. తమిళనాడులోనూ.. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సైతం అలాంటి ప్రకటనే చేశారు.' అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'కరోనాపై కేంద్రానివి తప్పుడు లెక్కలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.