కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ?

author img

By

Published : May 15, 2022, 10:04 AM IST

priyanka gandhi as congress president

Priyanka Gandhi congress president: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టేందుకు రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో నవసంకల్ప్​ చింతన్​ శిబిర్​ నిర్వహిస్తోంది కాంగ్రెస్​. ఆరు కమిటీలు కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్​ అధ్యక్ష బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించాలనే అంశం తెరపైకి వచ్చింది. రాహుల్​ సిద్ధంగా లేకపోతే.. అధ్యక్షురాలిగా ప్రియాంకను నియమించాలని యూపీ నేతలు డిమాండ్​ చేశారు. మరోవైపు.. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్​ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు.

Priyanka Gandhi congress president: దేశ సామాజిక, ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో కీలక మార్పులు తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్​ పార్టీ మేధోమథనం కొనసాగిస్తోంది. ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాలను దగ్గరకు చేర్చుకోవడానికి సామాజిక న్యాయ అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో కొనసాగుతున్న నవసంకల్ప చింతన శిబిరంలో రెండో రోజు పలు కీలక అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిగా చేయాలనే అంశంపై తెరపైకి వచ్చింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకుంటే ప్రియాంకను అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ నేత ప్రమోద్​ కృష్ణం డిమాండ్​ చేశారు. రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చల సందర్భంగా.. ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు యూపీ నేతలు. అయితే.. అజెండాలో లేని అంశాలు మాట్లాడవద్దని సూచించారు కమిటీ ఛైర్మన్ మల్లికార్జున్​ ఖర్గే. మరోవైపు.. రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌కు పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు ప్రమోద్ కృష్ణం. అయితే అలాంటి చర్చలకు ఇక్కడ ఆస్కారం లేదని స్పష్టం చేశారు మల్లికార్జున్‌ ఖర్గే.

నేటితో ముగింపు..: మూడు రోజుల కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ శివిర్​ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఆరు ప్రధాన అంశాలపై నేతలు మేధో మథనం జరిగినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆరు కమిటీలు రూపొందించిన సిఫార్సుల ముసాయిదాలను ఆదివారం.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అందించనున్నారు కమిటీల చైర్మన్లు. ఉదయం 11 గంటలకు భేటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఆరు కమిటీలు ఇచ్చిన సిఫారసులు, తీర్మానాలను వర్కింగ్ కమిటీలో ప్రవేశపెట్టనున్నారు సోనియా గాంధీ. రాజకీయ, ఆర్థిక, సామాజిక, వ్యవసాయ, యువత, సంస్థాగత అంశాలపై ప్రవేశపెట్టే తీర్మానాలకు ఆమోదం తెలపనుంది సీడబ్ల్యూసీ. ఆదివారం మధ్యాహ్న 3 గంటలకు చింతన్ శిబిరానికి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి ప్రశాంగించునున్నారు రాహుల్ గాంధీ. అనంతరం నవ సంకల్ప్ శిబిర్ సమావేశాల ముగింపు ఉపన్యాసంలో కీలక ప్రకటన చేయనున్నారు సోనియా.

కాంగ్రెస్​కు కీలకం కానున్న ఉదయపుర్ డిక్లరేషన్: రాజకీయ ఎత్తుగడలు, రంగాల వారీగా నూతన విధానాలు, సంస్థాగత మార్పులు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్.. దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, రైతాంగ,యువజన, పార్టీ సంస్థాగత అంశాలపై కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ 50 శాతానికిపైగా యువకులకు ఇవ్వాలని భావిస్తోంది. తక్షణమే పార్టీ అధికారంలోకి రావడం కంటే మరో రెండు వందల ఏళ్ల పాటు బలంగా ఉండేలా నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. అవసరమైతే పార్టీ పగ్గాలు కూడా యువతకు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు సోనియా గాంధీ. చట్టసభల్లో ఎక్కువగా యువత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నారు.

నూతన ఆర్థిక విధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి విధానాలు తీసుకువచ్చి, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని పేర్కొంది ఆర్థిక వ్యవహారాల కమిటీ. 1991 తరహాలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని ప్రతిపాదించింది. విదేశీ మారక నిల్వలు తరిగిపోవడం పై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. వ్యవసాయ రంగం పై కీలకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొంది. నూతన వ్యవసాయ విప్లవం రావాల్సిన ఆవశ్యకత అజెండాగా అనేక సంస్కరణలకు ప్రతిపాదనలు చేశాయి కమిటీలు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత కల్పిస్తూ దేశవ్యాప్తంగా మరోసారి రైతు రుణమాఫీ చేపట్టటం, రైతులకు పంటలకు భీమా సౌకర్యం కల్పించటం వంటివి అందులో పొందుపరిచాయి. పార్టీలో సంస్థాగతంగా సామాజిక న్యాయ సలహామండలి ఏర్పాటు చేయటం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ప్రస్తుతం ఉన్న 20 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో మహిళలకు సముచిత స్థానం కల్పించటం, ఒక వ్యక్తికి రాజ్యసభ సహా అన్ని రకాల నామినేటెడ్ పదవులకు రెండు సార్లు మాత్రమే అవకాశం వంటి సంస్కరణలతో కుటుంబ వారసత్వ పార్టీ అనే ముద్ర తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్.

దేశవ్యాప్తంగా రాహుల్​ పాదయాత్ర: 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్​ గాంధీ పాదయాత్ర చేపట్టనున్నారు. ఉదయ్​పుర్​లో నిర్వహిస్తున్న చింతన్​ శిబిర్​లో ఈ విషయంపై చర్చించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఏడాది చివర్లో ఈ పాదయాత్ర ఉండనుందని పేర్కొన్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో నేతలు పాదయాత్రలు చేపట్టి పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లటం, ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టటం వంటివి చేస్తారని తెలిపారు.

ఇదీ చూడండి: చింతన్​ శిబిర్​లో కాంగ్రెస్ మేధోమథనం.. కీలక నేతలతో సోనియా భేటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.