ETV Bharat / bharat

'ఖైదీ'ల హోటల్​- అన్ని పనులు వాళ్లే, టేస్టీటేస్టీగా ఫుడ్​! ఎక్కడో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 12:46 PM IST

Prisoners Hotel : ఖైదీలు ప్రారంభించిన టిఫిన్​ సెంటర్​కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికులు, ఉద్యోగులు అక్కడి ఆహారం తినేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టిఫిన్​ చాలా బాగుందని చెబుతున్నారు. రోజూ ఇక్కడికే రావాలనిపిస్తోందని అంటున్నారు. అసలు ఆ టిఫిన్​ సెంటర్​ ఎక్కడ? ఖైదీలు ప్రారంభించడానికి కారణమేంటి?

Prisoners Hotel
Prisoners Hotel

'ఖైదీ'ల హోటల్​- అన్ని పనులు వాళ్లే, ఫుడ్​ కూడా చాలా టేస్టీగా!

Prisoners Hotel : ఆ టిఫిన్​ సెంటర్​లో మొత్తం ఖైదీలే కనిపిస్తారు. వంట చేసేది వారే.. వడ్డించేదీ వారే. పాత్రలను శుభ్రం చేసుకునేది కూడా వాళ్లే. అదేంటి ఖైదీలు.. జైలులో లేకుండా అక్కడేం చేస్తున్నారని అనుకుంటున్నారా?.. మహారాష్ట్ర పుణె జిల్లాలోని ఎరవాడ జైలులో ఉంటున్న పలువురు ఖైదీలు టిఫిన్​ సెంటర్​​ ప్రారంభించారు. అందులో అన్ని పనులు వారే చూసుకుంటున్నారు. ఖైదీలు వండుతున్న రుచికరమైన ఆహారాన్ని తినేందుకు స్థానికులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Prisoners Hotel
టీ తయారు చేస్తున్న ఖైదీ

ఉదయం టిఫిన్స్​.. మధ్యాహ్నం స్నాక్స్​..
ఎరవాడ జైలులోని ఖైదీలతో అధికారులు.. శృంఖల ఉపాహర్​ గృహ్​ పేరుతో టిఫిన్​ సెంటర్​ను​ ఆగస్టు 9న ప్రారంభించారు. ఎరవాడ జైలు అధికారి అమితాబ్​ గుప్తా చొరవతో ఈ టిఫిన్​ సెంటర్​ ప్రారంభమైంది. ఖైదీలు ప్రారంభించిన టిఫిన్​ సెంటర్​లో మొత్తం 24 మంది పనిచేస్తున్నారు. ఉదయం పూట అన్ని రకాల టిఫిన్లు, టీ అమ్ముతున్నారు. మధ్యాహ్న సమయంలో బజ్జీలు, పకోడీ విక్రయిస్తున్నారు. మొదట్లో నాన్​వెజ్​ ఫుడ్​ ఐటమ్స్​ అమ్మినప్పటికీ ఇప్పుడు వెజ్ మాత్రమే విక్రయిస్తున్నారు. మొదట్లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్నా.. ఆ తర్వాత రద్దీ భారీగా పెరిగింది. ఇప్పటి వరకు అక్కడ విక్రయిస్తున్న ఆహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జైలు అధికారులు తెలిపారు. ఖైదీలు ప్రారంభించిన టిఫిన్ సెంటర్​కు ఫినోలెక్స్​ కంపెనీ.. విలువైన వంట సామగ్రిని ఉచితంగా అందించిందని చెప్పారు.

Prisoners Hotel
ఆహారాన్ని సర్వ్​ చేస్తున్న ఖైదీ

'అందరం కలిసి ఆడుతూ పాడుతూ..'
జైల్లో ఎంత పనిచేసినా.. రోజు గడిచినట్లే అనిపించేదికాదని .. కానీ ఇప్పుడు రోజు ఎప్పుడు అయిపోతుందో తెలియట్లేదని ఖైదీలు చెబుతున్నారు. అందరం కలిసి ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటున్నామని.. అన్ని రకాల వంటలు నేర్చుకున్నామని తెలిపారు. నాలుగు గోడల మధ్య జీవితానికి, బయటి జీవితానికి ఎంతో తేడా ఉందని చెప్పారు. స్పేచ్ఛ అంటే ఏంటో బయటకు వచ్చాకే తెలుస్తోందన్నారు. ఖైదీలు నడుపుతున్న టిఫిన్​ సెంటర్​లో ఆహారం ఎంతో రుచిగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. కొత్తగా దుకాణం ప్రారంభించినట్లు అస్సలు లేదని.. కొన్నేళ్లుగా షాప్​ నడుపుతున్నట్లే ఆహారం ఉంటోందని అంటున్నారు.

Prisoners Hotel
కస్టమర్లతో కిటికిటలాడుతున్న హోటల్​

వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు..
"జైలులో ఉన్న ఖైదీల్లో కొందరు మంచిగా వంట చేసే వాళ్లు ఉన్నారని తెలుసుకున్నాం. అందుకే వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు టిఫిన్​ షాప్​ను​ మూడు నెలల క్రితం ప్రారంభించాం. దీనికి చాలా మంచి స్పందన లభిస్తోంది. ముందుకు టిఫిన్​ మాత్రమే అమ్మినా.. ఇప్పుడు చాలా రకాల ఆహార పదార్థాలు అమ్ముతున్నారు" అని స్పెషల్​ ఇన్​స్పెక్టర్​ డా.జలీందర్​ సుపేకర్​ తెలిపారు.

ఇది ఖైదీల 'ఫ్రీడమ్'​ బ్యూటీ పార్లర్​ గురూ!

ఖైదీల 'బ్యాండ్​ బాజా బరాత్'.. పెళ్లిళ్లకు మేళతాళాలు వారివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.