ETV Bharat / bharat

ప్రాణాల మీదకు తెచ్చిన శాంతి పూజ.. నాలుకపై కాటేసిన పాము.. కోసేసిన పూజారి​!

author img

By

Published : Nov 26, 2022, 1:14 PM IST

రాత్రి పూట కలలో పదే పదే పాములు కనిపిస్తున్నాయని ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చేసిన పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది. మూడనమ్మకంతో శాంతి పూజ చేయబోయి.. పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత ఏమైందంటే?

నాలుకపై కాటేసిన పాము
నాలుకపై కాటేసిన పాము

రాత్రి పూట కలలో పాములు కనిపిస్తున్నాయని ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చేసిన పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది. జ్యోతిష్కుడి సలహాతో శాంతి పూజ నిర్వహించిన ఆ ఉద్యోగి.. పాము కాటుకు గురయ్యాడు. మూడనమ్మకంతో మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు. తమిళనాడు ఈరోడ్​ జిల్లాలో ఈ విచిత్ర ఘటన జరిగింది.

54 ఏళ్ల ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రాత్రి పూట కలలో పదే పదే పాములు కనిపిస్తున్నాయని జ్యోతిష్కుడిని సంప్రదించాడు. సర్పదోషం ఉందని, విరుగుడు కోసం శాంతి పూజ చేయాలని ఉద్యోగికి చెప్పాడు జ్యోతిష్కుడు. పామును క్షమించమని కోరాలని, లేకపోతే కరవకుండా వదిలి పెట్టదని నమ్మించాడు. అతని మాటలకు భయపడ్డ ఆ ఉద్యోగి పూజకు సిద్ధమయ్యాడు.

పూజ కార్యక్రమానికి పాముతో వచ్చాడు జ్యోతిష్కుడు. మంత్రాలు చదివిన అనంతరం... పాముకు మూడు సార్లు నాలుకను చూపి... ఊదాల్సిందిగా ఉద్యోగికి చెప్పాడు. అలా రెండు సార్లు ఉద్యోగి చేయగా మూడో సారికి సహనం కోల్పోయిన పాము నాలుకపై కాటు వేసింది. దీంతో అతడు భయభ్రాంతులకు లోనయ్యాడు. విషం శరీరానికి వ్యాపించకుండా చేసేందుకు ఓ కత్తిని తీసుకుని నాలుకను కత్తిరించాడు జ్యోతిష్కుడు. అనంతరం బాధితున్ని ఆసుపత్రికి తరలించారు.

'కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి నాలుక తెగిపోయిందని, పాము సైతం కరిచిందని చికిత్స కోసం మా ఆసుపత్రిలో చేరాడు. నాలుక నుంచి చాలా రక్తం బయటకు వచ్చింది. శరీరంలోకి పాము విషం వ్యాపించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడికి చికిత్స అందించేందుకు మా వంతుగా కృషి చేశాం. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అతనికి కృత్రిమ శ్వాసను అందించాం. విషానికి విరుగుడు ఇచ్చి నాలుకను తిరిగి అమర్చేందుకు శస్త్రచికిత్స చేశాం. ఏడు రోజుల అనంతరం ఆ వ్యక్తి కోలుకుని ఇంటికి వెళ్లాడు' అని డాక్టర్ సెంథిల్‌కుమారన్ చెప్పారు. అయితే ఆ వ్యక్తి తన వివరాలు చెప్పేందుకు నిరాకరించాడని డాక్టర్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.