ETV Bharat / bharat

POLAVARAM GUIDE BUND కుంగిపోయిన పోలవరం గైడ్​బండ్​.. నదీ ప్రవాహ మళ్ళింపులో కీలకమదే

author img

By

Published : Jun 6, 2023, 8:25 AM IST

పోలవరం గైడ్​బండ్
పోలవరం గైడ్​బండ్

Polavaram Project: పోలవరంలో గైడ్‌బండ్‌ కుంగిపోయింది. సుడిగుండాల నిరోధానికి స్పిల్‌వే ఎడమ వైపు ఏర్పాటుచేస్తున్న గైడ్‌బండ్‌ నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పుడు దాని మధ్యలో పగుళ్లు వచ్చి అప్రోచ్‌ ఛానల్‌ వైపునకు కుంగింది. ఈ ఘటనపై కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ సమీక్షించారు.

Polavaram Project Construction : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన.. ఎడమ వైపున నిర్మిస్తున్న గైడ్‌బండ్‌ కుంగిపోయింది. దాదాపు 500 మీటర్ల పొడవున దిగువ నుంచి సుమారు 26 మీటర్ల ఎత్తున గైడ్‌బండ్‌ నిర్మాణం చేపట్టారు. ఈ పనులను కూడా ప్రాజెక్టు పనులను చేపట్టిన కాంట్రాక్టర్​ మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీయే చేస్తోంది. ఏడాది కిందట చేపట్టిన నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చిన సమయంలో.. గైడ్‌బండ్‌ మధ్యలో పగులు లాంటిది ఏర్పడి అప్రోచ్‌ ఛానల్‌ వైపునకు కుంగిపోయింది. గైడ్‌బండ్‌ నిర్మాణంలో భాగంగా నిర్మించిన కట్ట, కట్టలోని రాళ్లు కింది భాగానికి జారిపోయాయి. దీంతో ఇందులోని రిటైనింగ్‌ వాల్‌ కుంగింది. దీనిలో కటాఫ్‌ సరిగా లేకపోవడమే గైడ్‌బండ్‌ కుంగిపోవడానికి కారణమై ఉంటుందని కొందరు ఇంజినీర్లు అనుమానిస్తున్నారు.

ఆదివారం నాటికి పూర్తిగా కుంగిపోయింది

పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఈ విషయం తెలియజేశారు. గైడ్‌బండ్‌ ఎందుకు కుంగింది, కారణాలేంటి, ఎలా సరిదిద్దాలనే అంశాలపై పోలవరం అథారిటీ అధికారులు, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ సభ్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. శుక్ర, శనివారాల్లో కొంత పగుళ్లు బారాయని, ఆదివారం నాటికి పూర్తిగా కుంగిపోయిందని చెబుతున్నారు.

గైడ్‌బండ్‌ కుంగడానికి కారణాలు గుర్తించి, విశ్లేషించాలి

సోమవారం గైడ్‌బండ్‌ కుంగినట్లు తెలియగానే కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ ఖుష్విందర్‌ వోహ్రా.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు, ఎస్​ఈ నరసింహమూర్తి, ఇతర నిపుణులతో సమీక్షించారు. ఆకృతుల సంస్థ నిపుణులు పోలవరాన్ని సందర్శించి, గైడ్‌బండ్‌ కుంగడానికి కారణాలు గుర్తించి, విశ్లేషించాలని సూచించారు. వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదీ తేల్చాలన్నారు. సమస్య పరిష్కారానికి మార్గం కనుగొని, తక్షణమే కేంద్ర జలసంఘానికి నివేదించాలని ఇంజినీర్లను ఆదేశించారు. ఈ అంశంపై కేంద్ర జలసంఘం పెద్దలతో చర్చించేందుకు.. పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇవాళ దిల్లీకి వెళుతున్నారు.

అసలు గైడ్‌బండ్‌ నిర్మించాల్సిన అవసరం ఎందుకు

పోలవరం ప్రాజెక్టులో తొలుత గైడ్‌బండ్‌ నిర్మాణ ప్రతిపాదన లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గోదావరి సహజ ప్రవాహాన్ని మార్చారు. అప్రోచ్‌ ఛానల్‌ తవ్వి, అదే మార్గంలో స్పిల్‌వే మీదినుంచి నదిని మళ్లించారు. పుణెలో ఉన్న కేంద్ర జల విద్యుత్తు పరిశోధన కేంద్రంలో పోలవరం ప్రాజెక్టు నమూనా రూపొందించారు. దాని ద్వారా అక్కడి ప్రవాహం, తదితర అంశాలపై నమూనా అధ్యయనం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలవరం స్పిల్‌వే ఎడమ వైపున గోదావరి ప్రవాహ వేగం, వడి ఎక్కువగా ఉంటుందని తేలింది. దీనివల్ల పోలవరం ఎడమ వైపున స్పిల్‌వే సమీపంలో పెద్ద పెద్ద సుడిగుండాలు ఏర్పడతాయని గుర్తించారు. ఇది స్పిల్‌వేకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని భావించారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలసంఘం నిపుణులు చర్చించారు. సమస్య పరిష్కారం కోసం స్పిల్‌వేకి ఎగువన గైడ్‌బండ్‌ నిర్మించాలని ప్రతిపాదించారు.

గైడ్‌బండ్​ నిర్మాణం ద్వారా గోదావరి ప్రవాహాన్ని ఇలా మార్చవచ్చు

స్పిల్‌వే వద్ద ఈ గైడ్‌బండ్‌ నిర్మాణం లేకపోవడం, అప్రోచ్‌ ఛానల్‌ ముఖద్వారం వద్ద వెడల్పు పెంచకపోతే గోదావరి ప్రవాహం ఎడమ వైపున సెకనుకు 13.6 మీటర్ల వేగంతో, స్పిల్‌వే మధ్యలో సెకనుకు 9.2 మీటర్ల వేగంతో, కుడివైపు 2.5 మీటర్ల వేగంతో ఉంటుందని లెక్కించారు. గైడ్‌బండ్‌ నిర్మాణంతో పాటు అప్రోచ్‌ ఛానల్‌ ముఖద్వారం వెడల్పు చేయడం, ఇతరత్రా కొన్ని చర్యలు తీసుకుంటే.. నదీ ప్రవాహ వేగం ఎడమ వైపున సెకనుకు 4 మీటర్లకు, మధ్యలో 5.5 మీటర్లకు తగ్గుతుందని, కుడివైపున సెకనుకు 4 మీటర్లకు పెరుగుతుందని లెక్కించారు. అంటే గోదావరి ప్రవాహించే వేగం దాదాపు ఒకేలా ఉండేలా, స్పిల్‌వే పొడవునా కూడా ఉండేలా.. గైడ్‌బండ్‌ నిర్మాణంతో సరిదిద్దవచ్చని తేల్చి నిర్మాణం చేపట్టారు.

పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కుంగిపోయిన గైడ్‌బండ్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.