ETV Bharat / bharat

'ఇస్కాన్' వ్యవస్థాపకుడి స్మారకార్థం రూ.125 నాణెం విడుదల

author img

By

Published : Sep 1, 2021, 6:53 PM IST

ISKCON founder
నరేంద్ర మోదీ

ప్రముఖ ఆధ్యాత్మిక సొసైటీ 'ఇస్కాన్' వ్యవస్థాపకులు స్వామి ప్రభుపాద 125వ జయంతి సందర్భంగా స్మారక నాణేన్ని విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ప్రభుపాద స్థాపించిన ఇస్కాన్ మందిరాలు భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఇస్కాన్ వ్యవస్థాపకులు 'శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద'(ISKCON founder) 125వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రూ.125 ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన(Srila Bhaktivedanta Swami Prabhupada)కు నివాళులు అర్పించారు. నిజమైన విశ్వాసానికి ఇస్కాన్ అసలైన నిర్వచనం ఇచ్చిందని మోదీ పేర్కొన్నారు.

iskcon coin photo
మోదీ విడుదల చేసిన రూ.125 నాణెం

"ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు(iskcon temples) ఉన్నాయి. ఇవన్నీ భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. విశ్వాసం అంటే.. ఉత్సాహం, మానవత్వం మీద నమ్మకం అనే అర్థాన్ని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపజేస్తున్నాయి. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలోనూ ఇస్కాన్ చేసే సేవలు అనిర్వచనీయం. 2001లో కచ్​లో భూకంపం వచ్చినప్పుడు.. ఇస్కాన్ ముందుకు వచ్చి ప్రజలకు సాయం చేసిన విషయం నాకింకా గుర్తు. దేశం ఎప్పుడు ప్రకృతి విపత్తులకు గురైనా.. ఇస్కాన్ సాయానికి ముందుకొచ్చింది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రపంచానికి భారత్​ ఎంతో పరిజ్ఞానాన్ని అందించిందని మోదీ(PM Modi) పేర్కొన్నారు. యోగా ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. భారత్​లో ప్రజలు పాటించే జీవన విధానంతో పాటు ఆయుర్వేదం వంటి శాస్త్రాల నుంచి ప్రపంచం చాలా ప్రయోజనం పొందవచ్చని అన్నారు.

వర్చువల్​గా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రపంచానికి వేదాలు..

ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్​నెస్​గా పిలిచే 'ఇస్కాన్'ను ప్రభుపాద స్థాపించారు. హరేకృష్ణ ఉద్యమానికి(hare krishna movement) ఆద్యులు ఈయనే. ప్రపంచానికి వేదాలను పరిచయం చేసే దిశగా ఇస్కాన్ కృషి చేసింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో.. భగవద్గీత, వేదాలను 89 భాషల్లోకి అనువదించారు.

దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వందలాది ఇస్కాన్ మందిరాలను నిర్మించారు ప్రభుపాద. అనేక పుస్తకాలు రచించారు. భక్తియోగ మార్గంలో నడవాలని ప్రపంచానికి బోధించారు.

ఇదీ చదవండి: ఇంధన ధరలపై మోదీ సర్కారుకు రాహుల్ చురకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.