ETV Bharat / bharat

రండి.. భారత్​లో తయారు చేయండి: మోదీ

author img

By

Published : Nov 18, 2021, 5:12 PM IST

Updated : Nov 18, 2021, 6:09 PM IST

కరోనా కాలంలో ప్రపంచ దేశాలకు భారీ స్థాయిలో ఔషధాలు, టీకాలు అందించడం ద్వారా భారత్.. 'ఫార్మసీ ఆఫ్​ ద వరల్డ్​'గా గుర్తింపు దక్కించుకుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఫార్మా రంగంలో తొలి గ్లోబల్​ ఇన్నోవేటివ్​ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

pm modi latest news
ప్రధాని మోదీ

భారత్​.. ఈ ఏడాది 100 దేశాలకు 65 మిలియన్లకుపైగా కొవిడ్​ టీకాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మన ఫార్మా రంగాన్ని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయని.. అందుకే ఈ రోజున భారత్​ 'ఫార్మసీ ఆఫ్​ ద వరల్డ్​'గా గుర్తింపు దక్కించుకుందని అభిప్రాయపడ్డారు.

ఫార్మా రంగానికి సంబంధించిన తొలి గ్లోబల్​ ఇన్నోవేటివ్​ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్నారు ప్రధాని. వైద్యపరికరాలు, ఔషధాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం భారత్​ లక్ష్యమని పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఆలోచించి, అందరిని సంప్రదించిన తర్వాతే తమ విధానాలను రూపొందిస్తున్నామన్నారు.

ఫార్మా రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే శక్తిసామర్థ్యం భారత్​కు ఉందని వెల్లడించారు మోదీ. టీకాలు, మందుల్లో వినియోగించే కీలక పదార్థాలను దేశంలోనే తయారు చేసే విధంగా కృషి చేయాలన్నారు.

"కరోనా మహమ్మారి తొలినాళ్లలో.. కీలక వైద్యపరికరాలు, ప్రాణాలు కాపాడే ఔషధాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేశాము. ఈ ఏడాది 100 దేశాలకు 65మిలియన్ల కొవిడ్​ టీకాలను సరఫరా చేశాము. సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో ఉన్న మేము.. మరింత సాయం చేయగలము. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్​ను 'ఫార్మసీ ఆఫ్​ ద వరల్డ్​'గా గుర్తిస్తున్నాయి. రండి.. భారత్​లో ఆలోచించండి, భారత్​లో ఆవిష్కరించండి, భారత్​లో తయారు చేయండి. మా వద్ద ప్రతిభ ఉంది, వనరులు ఉన్నాయి. మా వద్ద అన్నీ ఉన్నాయి."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

భారత ఆర్థిక వృద్ధిలో ఫార్మా రంగం కీలక పాత్ర పోషిస్తోందని మోదీ ఉద్ఘాటించారు. దేశంలో 30లక్షల మందికి ఉద్యోగాలిచ్చి, 13బిలియన్​ డాలర్ల వాణిజ్య మిగులు ఉన్న రంగం ఫార్మా అని పేర్కొన్నారు. 2014 నుంచి దేశ ఆరోగ్య సంరక్షణ రంగానికి.. 12బిలియన్​ డాలర్లకుపైగా విదేశీ పెట్టుబడులు లభించాయని, భవిష్యత్తులో మరిన్ని దక్కించుకునే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. ఆవిష్కరణలకు కావాల్సిన నిధులు, మౌలిక వసతులతో పాటు వివిధ అంశాలపై 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో చర్చించనున్నారు.

ఇదీ చూడండి:- 'క్రిప్టో కరెన్సీ అలాంటి వారి చేతుల్లోకి చేరకుండా చూడాలి'

Last Updated :Nov 18, 2021, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.