ETV Bharat / bharat

'మోదీ పాలనలో వారి కలలకు రెక్కలు.. రాజకీయ సంస్కృతిలో మార్పు'

author img

By

Published : May 30, 2022, 6:10 PM IST

Updated : May 30, 2022, 7:17 PM IST

PM Modi News: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపంలో దేశానికి సమర్థమైన నాయకత్వం లభించిందని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన సారథ్యం పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం, గర్వం ఉందని చెప్పారు. మోదీ ప్రభుత్వం 8 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు అమిత్ షా. ప్రతి పౌరుని కలలకు మోదీ రెక్కలిచ్చారని కొనియాడారు.

Modi
amit shah on pm modi

PM Modi News: తన 8ఏళ్ల పాలనలో ప్రతి భారత పౌరుడి కలలు, ఆశయాలకు ప్రధాని నరేంద్ర మోదీ రెక్కలిచ్చారని కొనియాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం వరుస ట్వీట్లు చేశారు. అన్ని వర్గాలు విశ్వసించి, గర్వించే నాయకత్వం మోదీ రూపంలో దేశానికి దక్కిందని పేర్కొన్నారు.

"అధికారాన్ని సేవా మార్గంగా పరిగణించి.. పేదలు, రైతులు, మహిళలు, అణగారిన వర్గాలకు హక్కులను కల్పించారు ప్రధాని మోదీ. అలా చేయడం ద్వారా వారికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఏర్పడి.. దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. ఈరోజు మోదీ రూపంలో భారత్​కు ఒక మంచి నాయకత్వం లభించింది. దాని పట్ల అన్ని వర్గాలకు విశ్వాసం, గర్వం ఉంది. ప్రజల అంచనాలను అందుకోవడానికి ఆయన నిరంతరం శ్రమించడమే ఈ నమ్మకానికి పునాది."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

"గత ఎనిమిదేళ్లలో ప్రతి పౌరుడి కలలు, ఆశయాలకు మోదీ రెక్కలిచ్చారు. వారిలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సమర్థమైన నాయకత్వం, పట్టుదలతో దేశాన్ని సురక్షితం చేయడమే కాదు.. ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకునే నిర్ణయాలను తీసుకున్నారు. టెక్నాలజీ నుంచి సంక్షేమం వరకు మోదీ విధానాలు, ఘనతలు ప్రపంచానికే ఆదర్మం" అని షా కొనియాడారు.

సమర్థ నాయకత్వం ద్వారా విపత్తును అవకాశంగా ఎలా మలుచుకోవాలో ప్రపంచానికి నవ భారత్​ చాటిచెప్పిందన్నారు అమిత్ షా. "జమ్ముకశ్మీర్ అయినా​, ఈశాన్య ప్రాంతాలైనా, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలైనా.. దశాబ్దాల పాటు ఎవరూ కన్నెత్తి చూడడానికైనా సాహసించని ప్రాంతాల్లో మోదీ తన నాయకత్వ పటిమ, దూరదృష్టితో అభివృద్ధి, శాంతికి బాటలువేశారు." అని షా పేర్కొన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తు కోసం పీఎం-కేర్స్​ను ప్రారంభించడం పట్ల మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయ సంస్కృతిని మోదీ మార్చేశారు: ప్రధాన మంత్రి మోదీ.. దేశ రాజకీయ సంస్కృతిని మార్చేశారని అన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీ ప్రభుత్వం 8ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. "సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమమే మోదీ సర్కారు ఆత్మ. ప్రభుత్వ పథకాలు చివరి వ్యక్తికీ చేర్చడమే మా అతిపెద్ద సవాలు. అయితే ఆ పనిని ప్రధానే స్వయంగా చేపట్టారు." అని నడ్డా పేర్కొన్నారు.

కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్​ ఠాకూర్​ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఓ థీమ్​ సాంగ్​ను విడుదలచేశారు. ఈ ఎనిమిదేళ్లలో మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతలను తెలియజేసేలా నమో యాప్​లో ఓ ప్రత్యేక క్యాంపెయిన్​నూ ప్రారంభించారు.

అదే గత ఎనిమిదేళ్ల పాలనకు ప్రతిరూపం: ప్రజల ఆశయాల సాధనకు చేసిన కృషి.. గత ఎనిమిదేళ్ల పాలనకు ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్​లో నమో యాప్​లోని వికాస్​ యాత్ర అనే విభాగానికి సంబంధించిన లింక్​ను షేర్​ చేశారు. దాని ద్వారా భాజపా ప్రభుత్వ 'ఎనిమిదేళ్ల సేవ' గురించి తెలుసుకోవాలని ప్రజలకు విన్నవించారు.

అన్నింటా విఫలం: ఆర్థిక వ్యవస్థ నిర్వహణ లోపం, అధిక ద్రవ్యోల్బణం, రాజ్యాంగ సూత్రాలను కాలరాయడం వంటివి మోదీ ఎనిమిదేళ్ల పాలనకు నిదర్శనమని విమర్శించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని టీఎంసీ నేతలు శషి పంజా, చంద్రిమా భట్టాచార్య సోమవారం ఓ ప్రెస్​మీట్​లో పేర్కొన్నారు. ఈ సర్కారు.. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి.. విస్మరించడం మరింత బాధాకరమని అన్నారు. పీఎం కేర్స్​ నిధులపై సరైన ఆడిట్ నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​' పథకానికి మోదీ శ్రీకారం

Last Updated :May 30, 2022, 7:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.