ETV Bharat / bharat

'కోర్టుల్లో ఆ భాషలు వాడాలి.. పౌరులకు చేరువ చేయాలి'

author img

By

Published : Apr 30, 2022, 11:48 AM IST

PM Modi news: న్యాయస్థానాల్లో స్థానిక భాషల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీని వల్ల న్యాయవ్యవస్థ పట్ల పౌరుల్లో విశ్వాసాన్ని పెంపొందించవచ్చని అన్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మాట్లాడారు.

PM Modi news
PM Modi news

local languages in courts: దేశం అమృత కాలంలో ఉందని.. ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ సులభంగా, సత్వర న్యాయం అందించే న్యాయవ్యవస్థ కోసం మనమంతా ఆలోచన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో న్యాయవిద్య అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లు ఉండేలా చూడటం మనందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని.. కోర్టుల్లో స్థానిక భాష ఉపయోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా సాధారణ పౌరుల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించవచ్చని అన్నారు.

"న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహిస్తే.. సాధారణ పౌరుల్లో విశ్వాసం పెంపొందించడమే కాకుండా.. న్యాయవ్యవస్థకు వారిని దగ్గర చేసినట్లు అవుతుంది. పురాతన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉంది. 2015లో 1800 పాత చట్టాలను గుర్తించి.. 1450 చట్టాలను తొలగించాం. కానీ, రాష్ట్రాలు మాత్రం ఇప్పటివరకు 75 చట్టాలనే తొలగించాయి. మన దేశంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి రక్షణగా ఉంటే.. శాసనశాఖ పౌరుల ఆశయాలను ప్రతిబింబించేలా పనిచేస్తుంటుంది. ఈ రెండు అంశాల కలయిక.. భవిష్యత్​లో సమర్థవంతమైన న్యాయవ్యవస్థ కోసం బీజం వేస్తుంది."
-నరేంద్ర మోదీ ప్రధానమంత్రి

న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలో కేంద్రం ఉత్తమంగా పనిచేస్తోందని మోదీ వివరించారు. వసతులను నవీనీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థలో సాంకేతికత వినియోగాన్ని పెంపొందించామని చెప్పారు. డిజిటల్ ఇండియా మిషన్​లో ఇదే కీలక భాగమని అన్నారు. ఈ-కోర్టుల ప్రాజెక్టును మిషన్ మోడ్​లో అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

PM Modi news
సదస్సులో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తులు, అధికారులు

దిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహిస్తున్నారు. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్​వీ రమణ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, పలు రాష్ట్రాల న్యాయశాఖ మంత్రులు, అధికారులు విచ్చేశారు. న్యాయమూర్తుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఇదే సదస్సులో మాట్లాడిన సీజేఐ జస్టిస్ రమణ.. న్యాయమూర్తులు విధి నిర్వహణలో భాగంగా తమ పరిమితులను గుర్తుంచుకోవాలని సూచించారు. లక్ష్మణ రేఖను దాటొద్దని అన్నారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: 'న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.