ETV Bharat / bharat

పీఎం-కేర్స్​ నిధులతో ఆక్సిజన్​ యూనిట్లు

author img

By

Published : Jan 6, 2021, 5:37 AM IST

PM-CARES
పీఎం-కేర్స్​ నిధులతో ఆక్సిజన్​ యూనిట్లు

దేశంలో వైద్య అవసరాల కోసం ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో 162 అదనపు ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పీఎం-కేర్స్ ‌నిధి నుంచి రూ.201.58 కోట్లు కేటాయించింది. తీవ్రమైన కరోనా కేసులు సహా ఇతర వైద్యపరమైన అవసరాల కోసం అంతరాయాలు లేని ముందస్తు ఆక్సిజన్‌ అవసరం అని కేంద్రం పేర్కొంది.

దేశవ్యాప్తంగా మెడికల్​ ఆక్సిజన్​ను మరింత అందుబాటులో ఉంచేందుకు పీఎం-కేర్స్​ నిధి నుంచి రూ.201.58 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) మంగళవారం వెల్లడించింది. ప్రధానంగా కొవిడ్​ బారిన పడినవారికి, వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి అవసరమైన ఆక్సిజన్​ను తగినంతగా, నిరంతరాయంగా అందించటం వీటి లక్ష్యమని పేర్కొంది.

162 పీఎస్​ఏ ప్లాంట్లు..

ఈ మేరకు తెలంగాణ సహా 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 162 పీఎస్​ఏ మెడికల్​ ఆక్సిజన్​ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలోని 5 ఆసుపత్రులకు ఈ ప్లాంట్లు మంజూరయ్యాయి. వీటి ఏర్పాటుకు సంబంధించి ఆయా రాష్ట్రాలతో సంప్రదించి ఆసుపత్రులను గుర్తించినట్లు పీఎంఓ తెలిపింది. వీటి సామర్థ్యం 154.19 మెట్రిక్​ టన్నులుగా పేర్కొంది. వీటి ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్​ లభ్యత పెరగడమే కాకుండా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సమయానికి అందుబాటులో ఉంచడానికి కూడా వీలవుతుందని పేర్కొంది.

కొవిడ్​ మహమ్మారిపై పోరుకు గాను ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రజలెవరైనా భాగస్వామ్యం అయ్యేలా 2020 మార్చిలో పీఎం కేర్స్​ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్​కు ప్రధాని మోదీ నేతృత్వం వహిస్తుండగా.. కేంద్ర హోం, ఆర్థిక, రక్షణ శాఖల మంత్రులు సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'ఆ అనుమతులు వచ్చాకే సెంట్రల్​ విస్టా నిర్మాణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.