'విద్వేష ప్రసంగాలపై మీ వాదన సబబే కావొచ్చు'.. తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం

author img

By

Published : Oct 11, 2022, 7:02 AM IST

supreme court on hate speech

దేశంలోని మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరిన్ని వివరాలతో ఈ నెల 31లోపు అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. తలాక్‌ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది.

Supreme Court On Hate Speech: దేశంలోని మైనార్టీలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సోమవారం అదనపు వివరాలను కోరింది. "అలాంటి వ్యాఖ్యల వల్ల దేశంలో వాతావరణం కలుషితమవుతోందన్న పిటిషనర్‌ వ్యాఖ్యలు సబబే కావొచ్చు. వాటిని కట్టడి చేయాలన్న వాదనలో అర్థం ఉండొచ్చు. అయితే న్యాయస్థానం స్పందించాలంటే పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలి" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.ఆర్‌.భట్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. పిటిషనర్‌ ఒకటి లేదా రెండు ఉదంతాలపై దృష్టిపెట్టాలని సూచించింది. పిటిషన్‌లో 58 ఘటనలను ప్రస్తావించారని తెలిపింది. "అయితే ఆ నేరం ఎప్పుడు జరిగింది.. అందులో ప్రమేయమున్న వ్యక్తులెవరు.. వారిపై కేసులు నమోదు చేశారా.. అవి ఏ దశలో ఉన్నాయి.. వంటి వివరాలేవీ మాకు తెలియదు" అని వ్యాఖ్యానించింది. ఆ వివరాలతో ఈ నెల 31లోపు అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను నవంబరు 1కి వాయిదావేసింది.

మరో కేసులో.. ఉత్తరాఖండ్‌, దిల్లీల్లో గత ఏడాది జరిగిన 'ధర్మ సంసద్‌'లలో విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అక్కడి ప్రభుత్వాలను జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం ప్రశ్నించింది. తుషార్‌ గాంధీ అనే కార్యకర్త వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వివరాలను కోర్టు కోరింది. విద్వేష ప్రసంగాలు, మూకదాడులపై నిబంధనల ప్రకారం స్పందించని సీనియర్‌ పోలీసు అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు.

తలాక్‌పై కేంద్రం స్పందన కోరిన సుప్రీం
తలాక్‌ పేరుతో ముస్లింలలో ఉన్న ఏకపక్ష, న్యాయవిరుద్ధమైన విడాకుల గురించి కేంద్రం, ఇతర వర్గాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. తలాక్‌-ఈ-కినాయా, తలాక్‌-ఈ-బైన్‌ తదితరాల పేరుతో ఇస్తున్న విడాకుల చట్టబద్ధత గురించి జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ జేబీ పర్దీవాలా సభ్యులుగా ఉన్న ధర్మాసనం కేంద్ర న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖలకు నోటీసులను అందజేసింది. ఈ సంప్రదాయం ఏకపక్షం, న్యాయ విరుద్ధమని.. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేదని కర్ణాటకకు చెందిన సయీదా అంబ్రీన్‌ వేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. విడాకులకు సంబంధించి లింగ, మత సమానత్వాన్ని పాటిస్తూ కేంద్రం నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషనర్‌ విన్నవించారు.

నేర అభ్యర్థుల వివరాల ప్రదర్శనపై దావా కొట్టివేత
నేరప్రవృత్తి కలిగిన అభ్యర్థుల వివరాలను రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో పొందుపరచాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారత ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలంటూ పిటిషనర్‌కు సూచించింది.

రాజస్థాన్‌ ప్రభుత్వంపై అసంతృప్తి
కొవిడ్‌ మహమ్మారి కారణంగా మరణించినవారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లింపునకు బాధితుల ఎంపిక విషయంపై రాజస్థాన్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర సర్కార్‌ చేసే సాయం దాతృత్వమేమి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై పూర్తిస్థాయి అఫిడవిట్‌ను శుక్రవారంలోగా దాఖలు చేయాలంటూ జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సోమవారం ఆదేశించింది.

అనిల్‌ దేశ్‌ముఖ్‌కు బెయిల్‌.. అభ్యంతరాలపై నేడు విచారణ
మనీ లాండరింగ్‌ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు బాంబే హైకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ ఎస్‌ఆర్‌ భట్‌లతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ అంశంపై మంగళవారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుందని జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

దిల్లీలో టపాసులపై నిషేధాన్ని ఇప్పటికిప్పుడు ఎత్తివేయలేం
దిల్లీలో 2023 జనవరి 1 వరకు టపాసుల నిల్వ, విక్రయం, వినియోగాన్ని నిషేధిస్తూ స్థానిక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీపావళి నేపథ్యంలో రాబోయే కొన్ని రోజుల్లో దిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు నిషేధాన్ని ఎత్తివేసి, కాలుష్య పెరుగుదలకు తాము కారణం కాదలుచుకోలేదని పేర్కొంది.

ఇవీ చదవండి: సుప్రీంలో సంచలనం.. కొలీజియంలో తొలిసారి అలా.. కొత్త సీజేఐ వచ్చాకే ఏదైనా..

'జాతీయ జంతువుగా ఆవు' పిటిషన్​ తిరస్కరణ.. కొలీజియం నియామకాలకు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.