ETV Bharat / bharat

'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'

author img

By

Published : Mar 5, 2021, 1:41 PM IST

అధికార, ప్రతిపక్షాల విమర్శలతో కేరళలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ప్రతిపక్ష యూడీఎఫ్​ చేస్తోన్న విమర్శలను సీఎం పినరయి విజయన్​ తిప్పికొట్టారు. అటు దర్యాప్తు సంస్థలతో తమపై పెత్తనం చెలాయించాలని చూడొద్దని కేంద్రంలోని భాజపాకు కూడా చురకలంటించారు. మరోవైపు టికెట్ల కేటాయింపులో ఎల్​డీఎఫ్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులు సహా స్పీకర్​కు ఈ ఎన్నికల్లో టికెట్​ ఇవ్వకూడదని నిర్ణయించింది.

Pinarayi Vijayan
'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'

కేరళలో తిరిగి అధికారం సాధించడమే లక్ష్యంగా లెఫ్ట్​ డెమొక్రెటిక్​ ఫ్రంట్​ (ఎల్​డీఎఫ్​) వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఐదుగురు మంత్రులను ఈ ఎన్నికల్లో టికెట్​ నిరాకరించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా ఇతర కేబినెట్​ మంత్రులు తిరిగి పోటీకి సిద్ధమవుతున్నారు.

వీరికి ఉద్వాసన..

ప్రస్తుత కేబినెట్​లో ఉన్న ఐదుగురు మంత్రులు థామస్​ ఐసాక్, జీ సుధాకరన్ , సీ రవీంధ్రనాథ్​, ఈపీ జయరాజన్, ఏకే బాలన్​కు ఈ ఎన్నికల్లో పార్టీ ఉద్వాసన పలికింది. అలానే ప్రస్తుత స్పీకర్​కు కూడా టికెట్​ నిరాకరించింది. ఈ మేరకు కేరళ సీపీఎమ్​ నిర్ణయం తీసుకుంది.

ఎందుకు..?

సాధారణంగా, వరుసగా రెండు సార్లు పోటీ చేస్తే మూడోసారి అవకాశం ఇవ్వకూడదన్నది సీపీఐ పార్టీ నియమం. అభ్యర్థుల విజయావకాశాలను బట్టి కొందరికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ఈ విషయంపై పార్టీ రాష్ట్ర మండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. గెలుపే లక్ష్యంగా ఎల్​డీఎఫ్​.. అభ్యర్థుల ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.

అంత సులువు కాదు..

వరదల సమయంలో ప్రభుత్వ నిర్వహణ, పాలనా దక్షతలో మంచి పేరు సంపాదించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. అయితే బంగారం స్మగ్లింగ్​ సహా అనేక వివాదాల్లో స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం పేరు రావడం ఆయన్ను ఇరుకున పెట్టింది. ప్రతిపక్ష యునైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​ (యూడీఎఫ్​)కు ఈ ఆరోపణలే ప్రచారాస్త్రాలుగా మారాయి. అయితే ఈ విమర్శలను విజయన్​ తీవ్రంగా ఖండించారు. అటు కేరళ మౌలిక వసతుల పెట్టుబడి నిధుల బోర్డు (కేఐఐఎఫ్​బీ)పై ఎన్​ఫోర్సెమెంట్​ డైరక్టరేట్​ (ఈడీ) కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు.

"మనకు మంచి రహదారులు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కావాలి. వీటికి ఎవరూ అడ్డుపడకూడదు. భాజపా పాచికలు ఇక్కడ పారవు. ఎందుకంటే ఇది కేరళ. మమ్మల్ని భయపెట్టాలని చూడొద్దు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడ రౌడీయిజం చేయడానికి కుదరదు. కేఐఐఎఫ్​బీ కోసం సేకరించిన నిధుల్ని కచ్చితంగా వినియోగిస్తాం. మేం ఏ అధికారానికి తలొగ్గం."

- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి

ఈ వ్యాఖ్యలతో కేఐఐఎఫ్​బీ విషయంలో ఈడీ సహా కేంద్రంపై పోరాటానికి విజయన్​ సిద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ప్రతిపక్ష యూడీఎఫ్​పైనా విజయన్​ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం ప్రతి విషయాన్ని వివాదాస్పదం చేయడం తగదని హితవు పలికారు. ఎల్​డీఎఫ్​ను బలహీనపరిచి రాష్ట్రంలో భాజపాకు తలుపులు తెరవాలని ప్రతిపక్ష యూడీఎఫ్​ ప్రయత్నిస్తోందని విజయన్​ ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.