ETV Bharat / bharat

నిమ్స్​లో చికిత్స పొందుతూ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

author img

By

Published : Feb 26, 2023, 9:28 PM IST

Updated : Feb 27, 2023, 6:28 AM IST

medical student
medical student

PG Medical student Preethi Passed Away: సీనియర్ వేధింపులు తాళలేక హానికర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడి గత నాలుగు రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందింది. నిమ్స్​లో చికిత్స పొందుతూ ఇవాళ రాత్రి ప్రాణాలు విడిచింది. ఎలాగైనా దేవుడి దయతో బ్రతికి వస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు కన్నీటి శోకమే మిగిలింది. ప్రీతి మరణంతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రీతి మరణంపై మంత్రి హరీశ్​రావు స్పందించారు.

PG Medical student Preethi Passed Away: గొప్ప డాక్టర్ కావాలనుకున్న వైద్య విద్యార్థిని కలలు కళలుగానే మిగిలిపోయాయి. స్టెతస్కోప్​తో ఎంతో మందికి వైద్యం అందించాల్సిన ఆ చేతులు ఓ సీనియర్ వేధింపుల కారణంగా మత్తు ఇంజెక్షన్ పట్టాల్సి వచ్చింది. ఉన్నత స్థానంలో నిలబడి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలనుకున్న ఆ చదువుల తల్లి అర్ధాంతరంగా చనువు చాలించింది. పేదల బతుకులలో వెలుగులు నింపాల్సిన ఆ వైద్య విద్యార్థిని సీనియర్ విద్యార్థి వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గత నాలుగురోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.10 నిమిషాలకు ప్రాణాలు విడిచింది. ప్రీతి మృతిపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు స్పందించారు.

మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని మంత్రి హరీశ్​ అన్నారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్య బృందం నిర్విరామంగా, శక్తి వంచన లేకుండా శ్రమించిందన్నారు. పూర్తి ఆరోగ్యవంతురాలై వస్తుందని అనుకున్నామని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలిచి వేసిందని హరీశ్​ అన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

ఈ నెల 22న వరంగల్ ఎంజీఎంలో విధులు నిర్వహిస్తూ సీనియర్ విద్యార్ధి వేధింపులతో మనస్తాపం చెంది హానికర ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఎంజీఎంలో చికిత్స అందించినా పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ సాయంత్రమే హుటాహుటిన హైదరాబాద్​లోని నిమ్స్​కు తరలించారు. ఆ రోజు నుంచి చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థి ఆదివారం మృతి చెందింది. తమ కూతురు ఆ భగవంతుడి దయతో ఎలాగైనా బతుకుతుందని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కన్నీటి శోకమే మిగిలింది.

గత నాలుగు రోజులుగా నిమ్స్​లోని ఏఆర్‌సీయూలో వెంటిలేటర్‌, ఎక్మో యంత్రం సాయంతో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించింది. ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు చాలా కృషి చేశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత వరంగల్​లోని ఎంజీఎంలో ఒకసారి గుండె ఆగిపోగా.. ఆ తర్వాత హైదరాబాద్​లోని నిమ్స్‌లో చేర్చినప్పటి నుంచి గుండె అయిదుసార్లు ఆగిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్‌ చేసి పనిచేసేలా చేసినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్య బృందం శత విధాలా ప్రీతిని బతికించడానికి ప్రయత్నించింది.. కానీ ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. దాంతో ఆదివారం ప్రాణాలతో కొట్టుమిట్టాడిన వైద్య విద్యార్థిని ప్రాణాలు విడిచింది. ప్రీతి మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

preethi incident
ప్రీతి చనిపోయినట్లు ధ్రువీకరించిన నిమ్స్‌ వైద్యులు

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సైఫ్​ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వైద్య విద్యార్థిని మరణంపై ప్రతిపక్షాలు, గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. నిమ్స్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వరంగల్​లోని కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం ముందు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున్న ఆందోళనకు దిగాయి. ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటనకు కారణమైన ప్రిన్సిపల్, హెచ్‌వోడీలపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నాయి. వైద్య విద్యార్థిని ప్రీతిని వేధించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని.... విద్యార్థి, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Feb 27, 2023, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.