ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్ జల విద్యుత్ ప్రాజెక్టులపై పాక్ అభ్యంతరం

author img

By

Published : Mar 24, 2021, 9:06 AM IST

సింధు నది జలమండలి వార్షిక సమావేశంలో పాకిస్థాన్ పలు విషయాలను లేవనెత్తింది. జమ్ముకశ్మీర్​లో విద్యుదుత్పత్తి కేంద్రాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. లద్దాఖ్​లో జల విద్యుత్ ప్రాజెక్టు వివరాలు అందించాలని కోరింది.

pak shows discomfort in india building new projects in jammu kashmir
జమ్ముకశ్మీర్ జల విద్యుత్ ప్రాజెక్టులపై పాక్ అభ్యంతరం

జమ్ముకశ్మీర్ చినాబ్ ఉపనది మరుసుదర్​పై నిర్మించనున్న పకల్ దుల్, లోవర్ కల్మయ్ జల విద్యుదుత్పత్తి కేంద్రాల డిజైన్లపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. లద్దాఖ్​లో నిర్మించబోయే జల విద్యుత్ ప్రాజెక్టుల వివరాలు అందించాలని కోరింది. సింధు నది జలమండలి వార్షిక సమావేశంలో పాక్ ఈ విషయాలను లేవనెత్తింది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం మంగళవారం దిల్లీలో మొదలైంది. చివరిసారిగా ఈ సమావేశం 2018లో జరిగింది.

గతేడాది జరగాల్సిన భేటీ కరోనా కారణంగా రద్దయింది. తాజా భేటీకి భారత సింధు నది కమిషనర్ పీకే సక్సేనాతో పాటు కేంద్ర జలమండలి, కేంద్ర విద్యుచ్ఛక్తి సంస్థ, జాతీయ జల విద్యుచ్ఛక్తి సంస్థల అధికారులు హాజరయ్యారు. పాక్​ నుంచి ఆ దేశ సింధు నది కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా నేతృత్వంలోని బృందం పాల్గొంది.

2019లో జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి లద్ధాఖ్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ 8 జల విద్యుత్ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలను తమకు అందించాలని పాక్ ఈ భేటీలో కోరింది. ఇరు దేశాల మధ్య 1960లో కుదిరిన సింధు నది ఒప్పందం ప్రకారం ఆ నది జలాలపై భారత్ ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు. అయితే అవి పాక్​కు అభ్యంతరం లేని రీతిలో ఉండాలి.

ఇదీ చదవండి:సింధు జల వివాదాలపై నేడు భారత్​-పాక్​ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.