ETV Bharat / bharat

కరోనాతో అనాథైన బాలికకు బ్యాంక్ నోటీసులు.. లోన్​ కట్టాలని ఒత్తిడి.. చివరకు...

author img

By

Published : Jun 6, 2022, 2:31 PM IST

orphan loan
orphan loan

Orphan Loan: కరోనా మహమ్మారి.. ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బలి తీసుకుంది. తనతో పాటు పదేళ్ల తమ్ముడు వియాన్‌ను ఒంటరిని చేసింది. అయితే అనాథగా మారిన ఆ అమ్మాయికి ప్రస్తుతం అప్పులు వేధిస్తున్నాయి. చనిపోయిన తన తండ్రి తీసుకున్న లోన్​ చెల్లించాలంటూ ఆమెకు నోటీసులు తెగ వస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ అమ్మాయి విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ స్పందించారు. అయితే ఆర్థిక మంత్రి జోక్యంతో ఆ అమ్మాయికి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది.

Orphan Loan: కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ బాలికను అప్పులు వేధిస్తున్నాయి. తన తండ్రి ఇంటి కోసం తీసుకున్న రుణం చెల్లించాలంటూ ఎల్ఐసీ ఆమెకు నిత్యం నోటీసులు జారీ చేస్తోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ బాలిక తనకు కొంత సమయం ఇవ్వాలంటూ ఎల్‌ఐసీని వేడుకుంది. ఈ విషయం తెలుసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 17ఏళ్ల వనిశా పాఠక్‌ తల్లిదండ్రులు గతేడాది మే నెలలో కరోనా కారణంగా మృతిచెందారు. దీంతో వనిశా, 11 ఏళ్ల ఆమె తమ్ముడు అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరిద్దరూ మేనమామ సంరక్షణలో ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధను దిగమింగుకుని వనిశా.. గతేడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో 99.8శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. కాగా.. వనిశా తండ్రి జితేంద్ర పాఠక్‌ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసేవారు. సొంతింటి కోసం జితేంద్ర గతంలో ఎల్‌ఐసీ నుంచి లోన్‌ తీసుకున్నారు. అయితే జితేంద్ర మరణించినప్పటి నుంచి రూ.29లక్షల రుణం తిరిగి చెల్లించాలంటూ ఎల్‌ఐసీ.. వనిశాకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. లోన్‌ కట్టకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

వనిశా, ఆమె తమ్ముడు మైనర్లు కావడం వల్ల జితేంద్ర పేరు మీద ఉన్న కమిషన్లు, సేవింగ్స్‌, పాలసీలను ఎల్‌ఐసీ బ్లాక్‌ చేసింది. వనిశాకు 18ఏళ్లు వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్‌ అన్నీ ఆమె చేతికి రానున్నాయి. అప్పటిదాకా తనకు సమయం ఇవ్వాలని, తండ్రి పేరు మీద ఉన్న ఆస్తులు వచ్చాక లోన్‌ చెల్లిస్తానని వనిశా.. ఎల్‌ఐసీకి లేఖ రాసింది. కానీ అటు వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

నిర్మలమ్మ జోక్యంతో.. వనిశా గురించి కొన్ని మీడియాల్లో కథనాలు రావడం వల్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకుని, తనకు అప్‌డేట్‌ చేయాలని ఆర్థిక సేవల విభాగం, ఎల్‌ఐసీ ఇండియాకు కేంద్రమంత్రి సూచించారు. ఆర్థిక మంత్రి జోక్యంతో వనిశాకు తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది. బాలికకు 18ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని నిర్ణయించినట్లు ఎల్‌ఐసీ వర్గాల సమాచారం.

ఇవీ చదవండి:

'మన కరెన్సీ, బ్యాంకులను 'అంతర్జాతీయం' చేద్దాం'

20వేల అడుగుల ఎత్తులో.. గడ్డకట్టించే చలిలో.. ఐటీబీపీ జవాన్ల యోగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.