ETV Bharat / bharat

విపక్షాల కూటమి సమావేశానికి 26 పార్టీలు.. ఉమ్మడి అభ్యర్థుల కోసం కమిటీ!

author img

By

Published : Jul 16, 2023, 10:33 PM IST

Updated : Jul 17, 2023, 7:01 AM IST

Opposition Meeting In Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో సోమవారం ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి.. 26 పార్టీల ముఖ్యనేతలు హాజరుకానునట్లు సమాచారం. బీజేపీని ఢీకొట్టే వ్యూహాలపై పార్టీలు చర్చించనున్నాయి.

opposition meeting in bengaluru
బెంగళూరులో ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశం

Opposition Meeting In Bengaluru : 2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవడమే లక్ష్యంగా.. సోమవారం బెంగళూరులో ప్రతిపక్షాల ఉమ్మడి సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి.. వివిధ పార్టీల ముఖ్యనేతల హాజరుకానున్నారు. ఈ మీటింగ్​లో దాదాపుగా 26 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. 2024 లోక్​సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై.. ప్రతిపక్షాలు చర్చిస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడిగా బీజేపీని ఎదుర్కోవడంపై వ్యహాలు రూపొందిస్తాయని పేర్కొన్నాయి.

ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని ప్రారంభించే అంశంపై ఈ సమావేశంలోనే చర్చ జరగనున్నట్లు తెలిసింది. దాంతో పాటు మెజారిటీ లోక్​సభ స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టడంపై ముందడుగు పడే అవకాశం ఉంది. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఓ సబ్​కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో సంస్కరణలపై ఈసీకి ఇచ్చే ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు చర్చలు జరుపుతాయని తెలిసింది. ప్రతిపక్షాల కూటమికి ఓ పేరును కూడా ఈ సమావేశంలోనే ప్రతిపాదించే అవకాశం ఉంది.

పార్లమెంట్​లో దిల్లీ ఆర్డినెన్స్​కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్​ స్పష్టం చేసిన నేపథ్యంలో.. తాము కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆమ్​ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అంతకుముందు జూన్​ 23న బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ అధ్యక్షతన జరిగిన పట్నా సమావేశానికి 15 పార్టీలు హాజరు కాగా.. సోమవారం జరగబోయే ఈ మీటింగ్​కు 26 పార్టీలు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శరద్​ పవార్​ నాయకత్వంలోని ఎన్​సీపీ చీలిక, బంగాల్​ పంచాయతీ ఎన్నికల్లో హింస వంటి పరిణామాల మధ్య ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రణాళికలను ప్రతిపక్షాలు రూపొందిస్తాయని పార్టీల వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షాల ఐక్యత అంశం, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గవర్నర్​తో నియంత్రణ చేయించడం వంటి వాటిపై పార్టీలు చర్చిస్తాయని వర్గాలు వివరించాయి.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ సారి సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్ కుమార్, డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జేఎంఎం నాయకుడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్​ పాటు ఆప్‌నకు చెందిన అరవింద్ కేజ్రీవాల్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరుకానున్నారు.

బీజేపీని ఎదుర్కొవాలంటే.. ప్రతిపక్షాలు విభేదాలు పక్కన బెట్టాలని ఓ సీనియర్​ నాయకుడు అభిప్రాయపడ్డారు. కాగా ప్రతిపక్షాల కూటమికి ఉమ్మడి ఎజెండా, సిద్దాంతం, నాయకుడే లేడని బీజేపీ ఆరోపిస్తుంది. కేవలం మోదీపై ద్వేషం మాత్రమే వీరిని ఐక్యం చేసిందని అంటోంది. అధికారం కోసమే ప్రతిపక్షాలు ఇవన్నీ చేస్తున్నాయని మండిపడింది. బెంగళూరు ప్రతిపక్షాల ఐక్యత కోసం సమావేశం నిర్వహిస్తున్న కాంగ్రెస్​ పార్టీ.. ముందుగా తమ పార్టీలో ఉన్న విభేదాల గురించి చెప్పాలని బీజేపీ డిమాండ్​ చేసింది.

ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్​కు ప్రత్యేక స్థానం: చిదంబరం
ప్రతిపక్ష పార్టీల కూటమిలో కాంగ్రెస్​కు ప్రత్యేక స్థానం ఉందన్నారు సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు​ చిదంబరం. సరైన సమయంలో కూటమికి నాయకుడు ఉద్భవిస్తాడని పేర్కొన్నాడు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమి ఐక్యంగా ఉండి.. 2024 లోక్​సభ ఎన్నికల్లో మోదీ ఎదుర్కొంటుందనే నమ్మకాన్ని వెలుబుచ్చారు. పట్నా ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్​పై ఆప్ లేవనెత్తిన తీరు దురదృష్టకరమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రతి సమస్య సరైన సమయంలో, సరైన స్థలంలో పరిష్కారం అవుతుందని వివరించారు.

Last Updated :Jul 17, 2023, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.