ETV Bharat / bharat

'మధ్యవర్తిత్వమే ఉత్తమం- సంధి కుదరకపోతే వినాశనం!'

author img

By

Published : Jul 17, 2021, 11:38 AM IST

Updated : Jul 18, 2021, 6:47 AM IST

సంఘర్షణల పరిష్కారానికి యంత్రాంగం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. పరస్పర సహకారంతో వివాదాలు పరిష్కరించుకోవడం భారత సంస్కృతిలో భాగమన్నారు.

NV RAMANA MEDIATION
ఎన్వీ రమణ

రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన విభిన్న కారణాల వల్ల సమాజంలో సంఘర్షణలు అనివార్యంగా మారాయని, వాటి పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. పరస్పర ఆమోదం, సహకారంతో వివాదాలను పరిష్కరించుకొనే సుదీర్ఘమైన సంస్కృతి భారత్‌తో పాటు, ఎన్నో ఆసియా దేశాలకు ఉందని తెలిపారు. శనివారం వీడియో సమావేశం ద్వారా 'ఇండియా-సింగపూర్‌ మీడియేషన్‌ సమ్మిట్‌-2021'లో ఆయన కీలకోపన్యాసం చేశారు. "వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ఓ సాధనంగా ప్రయోగించిన ఉదాహరణ మహా భారతంలోనే ఉంది. కౌరవులు-పాండవుల మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి శ్రీకృష్ణుడు రాయబారం నెరిపే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిత్వం విఫలమైతే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని చెప్పడానికి అదో ప్రబల ఉదాహరణ" అని ఆయన పేర్కొన్నారు.

యథో ధర్మ... స్థతో జయ

"బ్రిటిష్‌ వ్యవస్థ రావడానికి ఎంతోకాలం ముందే వివాదాల పరిష్కారం కోసం విభిన్నమైన మధ్యవర్తిత్వాలు అనుసరించిన చరిత్ర మనకు ఉంది. ఇదివరకు వివాదాలను సమాజ పెద్దలు పరిష్కరించేవారు. దేశంలో బ్రిటిష్‌ కోర్టు వ్యవస్థ ఏర్పాటైన తర్వాత అప్పటివరకు ఉన్న స్వదేశీ సామాజిక వివాద పరిష్కార వ్యవస్థ కనుమరుగైంది. మార్పులు చేర్పులతో బ్రిటిష్‌ న్యాయవ్యవస్థే ప్రస్తుత భారతీయ న్యాయ వ్యవస్థగా రూపాంతరం చెందింది. న్యాయవ్యవస్థ ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. వివాదాలను ఎదుర్కొనే శక్తిని అదే వారికి ఇచ్చింది. యథో ధర్మ, స్థతో జయ (ధర్మం ఎక్కడుంటే జయం అక్కడుంటుంది) అన్న నానుడికి జీవం పోసేలా కక్షిదారులకు సంపూర్ణ న్యాయం చేసే విస్తృతాధికారాలను రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ఇచ్చింది.

నిన్న దాఖలు.. నేడు పెండింగ్‌..!

భారతీయ కోర్టుల్లో 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తరచూ వింటున్నాం. ఇది అతిశయంతో కూడిన అనాలోచిత విశ్లేషణ. ఓ కేసు ఎన్నాళ్ల నుంచి పెండింగులో ఉందనేది తెలుసుకోకుండా అన్నింటికీ 'పెండెన్సీ' అనే పదాన్నే ఉపయోగిస్తున్నారు. నిన్న దాఖలైన కేసు ఈరోజు గణాంకాల్లో పెండింగ్‌ జాబితాలో చేరిపోతోంది. ఇది వ్యవస్థ మంచి-చెడులను విశ్లేషించేందుకు అనువైన సూచిక కాదు. కొన్ని కేసుల జాప్యంలో సహేతుకమైన కారణాలుంటాయి. వివాదం విలాసవంతం కావడమే అందులో ప్రధానమైంది. మంచి వనరులున్న కక్షిదారులు కొన్ని ప్రత్యేక వివాదాల్లో న్యాయవ్యవస్థను నిస్పృహకు గురిచేసే ప్రయత్నం చేస్తారు. రకరకాల ప్రొసీడింగ్స్‌ దాఖలుతో జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గుర్తించాలి

మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కోణంలోనూ కేసులను చూడాలి. ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసే న్యాయమూర్తులు కేసుల ఉద్ధృతిని ఎదుర్కోవడానికి తరచూ అర్ధరాత్రి వరకూ పనిచేస్తున్న సందర్భాలుంటున్నాయి. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ప్రజల్లో న్యాయ అవగాహన పెంచడంతోపాటు ప్రత్యామ్నాయ వేదికల ద్వారా వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో నిరంతరం మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

ఆర్బిట్రేషన్‌ వ్యవస్థ గొప్ప సంస్కరణ

1996లో దేశంలో స్వేచ్ఛా వాణిజ్యం ప్రారంభమైన తర్వాత ఆర్బిట్రేషన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లయింది. న్యాయవ్యవస్థలో ప్రధానమైన సంస్కరణ ఇది. దీనివల్ల వివాద పరిష్కారంలో న్యాయవ్యవస్థ జోక్యాన్ని తగ్గించి, కక్షిదారులకు గరిష్ఠ స్వయంప్రతిపత్తి కల్పించడం సాధ్యమైంది. 2019లో మధ్యవర్తిత్వంపై జరిగిన సింగపూర్‌ సదస్సు.. భారత్‌కు ప్రస్తుత మధ్యవర్తిత్వ వ్యవస్థను తీసుకొచ్చింది. 2021 మార్చి వరకు పది లక్షల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించగలిగారు.

కేసు స్వీకరించాలంటే మధ్యవర్తిత్వ ప్రయత్నం జరగాలి

భారత్‌లో మధ్యవర్తిత్వ వ్యవస్థ విజయవంతం కావాలంటే దాని చట్టబద్ధత, విశ్వసనీయత, ఆమోదయోగ్యత విషయాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. మధ్యవర్తిత్వానికి అవకాశాలు పెరుగుతున్నందున భారత్‌ ఈ విషయంలో మిషన్‌ మోడ్‌లో పనిచేయాలి. దీన్ని చౌకైన, వేగవంతమైన పరిష్కార మార్గంగా నిరూపించాలి. కోర్టులో ఏ కేసు స్వీకరించాలన్నా అంతకు ముందు మధ్యవర్తిత్వం ద్వారా దాన్ని పరిష్కరించే ప్రయత్నం తప్పనిసరిగా జరిగి ఉండాలన్న షరతు విధించాలి. ప్రస్తుతం ఉన్న శూన్యతను పరిష్కరించడానికి ఒక సంపూర్ణమైన చట్టం అవసరం. దేశంలో ఎక్కువమంది కక్షిదారులు మధ్యతరగతి, పేద వర్గాలేనని గుర్తించి, సమస్యల పరిష్కారం కోసం నమ్మకమైన మధ్యవర్తిత్వ వ్యవస్థను ఏర్పాటుచేస్తే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గుతుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇది స్వాగతించదగ్గ పరిణామం. మిగిలిన రాష్ట్రాలూ ఈ పంథాను అనుసరిస్తాయని ఆశిస్తున్నాను" అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

అందరి కోసం ఒక్కరిని బలిపెట్టకూడదు

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా న్యాయమూర్తులు నిష్పాక్షికతను కోల్పోకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. మెజార్టీ అభిప్రాయాల ఒత్తిడికి లోనుకాకుండా నిష్పాక్షికంగా తీర్పులు ఇవ్వాలని, ఎదుట ఎంతమంది ఉన్నప్పటికీ అది ఒకరి హక్కులను కాపాడేందుకు అడ్డంకి కాకూడదని సూచించారు. గుజరాత్‌ హైకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాలను ప్రారంభిస్తూ శనివారం వీడియో సమావేశం ద్వారా ఆయన మాట్లాడారు.

"కోర్టులపై ప్రజా విశ్వాసం, నమ్మకం సరికొత్త శిఖరాలకు చేరాలంటే న్యాయవ్యవస్థ గేట్లను మరింత విశాలంగా తెరవడం అత్యవసరం. కేసుల దాఖలు నుంచి తీర్పు వెలువరించేంత వరకూ ప్రతి ప్రక్రియకూ పారదర్శకతే ప్రాతిపదిక. కోర్టు గదుల్లో అందరి ముందే విచారణ జరుగుతుంది. దాన్ని ప్రజలు కూడా చూడొచ్చు. స్థలం, భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటివరకు పరిమితులు విధిస్తూ వచ్చాం. స్వాతంత్రం వచ్చిన 74 ఏళ్ల తర్వాత కూడా న్యాయవ్యవస్థపై ప్రజల మనసుల్లో చాలా అపోహలున్నాయి. వీటిని తొలగించి కోర్టులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు ఇదే సరైన సమయం. రాజ్యాంగానికి నిర్వచనం చెప్పేవి, ప్రజాకర్షకమైన కేసులు తప్ప అన్ని కేసులపై ప్రజలకు ఆసక్తి ఉండకపోవచ్చు".

సమాచార లోపంతో వక్రభాష్యాలు

"ప్రస్తుతం ప్రజలు మీడియా ద్వారా కోర్టు విచారణల గురించి తెలుసుకుంటున్నారు. కోర్టులనుంచి వచ్చే సమాచారాన్ని వడపోసే సమయంలో కొన్నిసార్లు సమాచార లోపం వల్ల కోర్టులు అడిగే ప్రశ్నలు, వ్యక్తంచేసే అభిప్రాయాలు వక్రభాష్యాలకు లోనవుతున్నాయి. కొన్ని స్వార్థశక్తులు ఈ వక్రభాష్యాలకు మరింత ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తుంటాయి. ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకపోవడం వల్ల దురభిప్రాయాలకు తావు ఏర్పడుతోంది. ఇలాంటి రుగ్మతలను నివారించడానికి న్యాయస్థానాల విచారణ ప్రత్యక్ష ప్రసారమే మందు. కేసు విచారణ, న్యాయమూర్తుల అభిప్రాయాల గురించి ప్రజలు నేరుగా తెలుసుకోగలుగుతారు. ఆ దారిలో చాలా అప్రమత్తతతో సాగాలి".

ప్రజా పరిశీలనా ఒత్తిడి

"న్యాయమూర్తులు ప్రజా పరిశీలనా ఒత్తిడికి గురవుతారు. అది ప్రభావపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుంది. న్యాయం అందించడానికి అది అనుకూలం కాకపోవచ్చు. న్యాయమూర్తులు అత్యధికమంది అభిప్రాయానికి వ్యతిరేకంగా నిలిచి అయినా సరే తాను చేసిన ప్రమాణానికి కట్టుబడి న్యాయం అందించే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కువమంది తనను చూడటంవల్ల న్యాయమూర్తులు చర్చనీయాంశాలుగా మారొచ్చు. అందరి కోసం (మైటీ ఆఫ్‌ మెనీ) ఒకరి హక్కులను రక్షించే విధులకు అవి నిరోధంగా మారకూడదు. ప్రత్యక్ష ప్రసార నిబంధనలను చాలా జాగ్రత్తగా అమలుచేయాలి. సుప్రీంకోర్టులోని కొన్ని కోర్టుల్లోనైనా ప్రత్యక్ష ప్రసారాలు మొదలుపెట్టడానికి అవసరమైన సౌకర్యాల కల్పన, ఫుల్‌కోర్ట్‌లో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నిస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఖజానాపై ఎక్కువ భారం లేకుండా తక్కువ ఖర్చుతోనే ప్రత్యక్ష ప్రసారాలు మొదలుపెట్టవచ్చన్న నమ్మకం నాకుంది" అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

Last Updated :Jul 18, 2021, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.