ETV Bharat / bharat

భారత్‌లో ఒమిక్రాన్‌ తీవ్రత.. ఇంకా స్పష్టమైన ఆధారాల్లేవ్‌..!

author img

By

Published : Dec 21, 2021, 5:21 AM IST

Omicron's Severity In India
భారత్‌లో ఒమిక్రాన్‌ తీవ్రత

ఒమిక్రాన్‌ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్​ఎస్​ఏసీఓజీ) వెల్లడించింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్​లోనూ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

కొత్తగా వెలుగుచూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోందన్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన పలు దేశాలు.. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. మరోవైపు భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ ప్రాబల్యం, రోగనిరోధకత నుంచి తప్పించుకోవడం లేదా తీవ్రతపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఐఎన్​ఎస్​ఏసీఓజీ) వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించిన నేపథ్యంలో ప్రజారోగ్య చర్యలు పెంచడంతోపాటు, వేరియంట్‌ ప్రభావాలపై పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఇన్సాకోగ్‌ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా డెల్టా (B.1.617.2)తో పాటు దాని అనుబంధ రకాల ప్రాబల్యమే అధికంగా ఉందని తెలిపింది. 'దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగానే ఉన్నప్పటికీ ఇవి కూడా క్రమంగా ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు బ్రిటన్‌లోనూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది' అని ఇన్సాకోగ్‌ వెల్లడించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి ఒమిక్రాన్‌కు వ్యాధి తీవ్రత తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది.

అయితే, అది ఇదివరకు ఇన్‌ఫెక్షన్‌ వల్లా లేదా వ్యాక్సినేషన్‌ వల్ల కలిగిన రక్షణా? అనే విషయంపై స్పష్టత లేదని ఇన్సాకోగ్‌ పేర్కొంది. అదే విధంగా వ్యాక్సిన్‌ తీసుకోని వారితోపాటు పాక్షికంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఒమిక్రాన్‌ తీవ్రత ఎలా ఉందో చెప్పేందుకు సరైన సమాచారం లేదని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఈ వేరియంట్‌ కేసులు 150కి పైగా బయటపడ్డాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 54 మంది ఈ వేరియంట్ బారినపడ్డారు. రాజస్థాన్‌, తెలంగాణాల్లోనూ ఈ కేసుల సంఖ్య 20 దాటింది.

ఇదీ చూడండి: దేశంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా 16 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.