ETV Bharat / bharat

''అగ్నిపథ్​'తో వారికి ఎలాంటి నష్టం లేదు'.. కేంద్రం క్లారిటీ

author img

By

Published : Jun 16, 2022, 3:11 PM IST

Updated : Jun 16, 2022, 4:26 PM IST

సైన్యంలో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అగ్నిపథ్​ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్రం వెల్లడించింది. సైన్యంలోని రెజిమెంటల్​ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయమని స్పష్టం చేసింది.

d
d

స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్'​ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్​ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం సైన్యంలో మూడు శాతం మాత్రమే అని పేర్కొంది. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది.

ఈ పథకం ద్వారా.. 17.5 నుంచి 21 ఏళ్లు మధ్య ఉన్న వారు త్రివిధ దళాలలో చేరవచ్చు. నాలుగేళ్ల పాటు సేవలు అందించాక వీరిలో 25 శాతం మందికి మాత్రమే సైన్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద సైన్యంలో చేరిన వారిని 'అగ్నివీరులు'గా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46,000 మంది సైనికులను నియమించనుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది.

అయితే దీనిపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బిహార్​లో వరుసగా రెండోరోజూ వీధుల్లోకి వచ్చి యువకులు ఆందోళన చేశారు. రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. పట్నా-గయా, పట్నా-బక్సర్ రహదారులను నిరసనకారులు నిర్బంధించారు. జెహానాబాద్​లో 83వ నంబర్ జాతీయ రహదారిని అడ్డగించారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. రాష్ట్రంలోని జెహానాబాద్, ఛాప్ర, నవాదా జిల్లాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. టీఓడీ(టూర్ ఆన్ డ్యూటీ- అగ్నిపథ్)ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అగ్నిపరీక్ష పెట్టకండి: అగ్నిపథ్​ పథకం అమలును కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తప్పుపట్టారు. నిరుద్యోగులను అగ్నిపథ్​లో నడిపించి వారికి సహనానికి అగ్నిపరీక్ష పెట్టకండి అని ప్రధానికి విజ్ఞప్తి చేశారు రాహుల్. "రెండేళ్ల వరకు ఎలాంటి ర్యాంకు, పింఛను ఉండదు. నియామకాలు కూడా ఉండవు. నాలుగేళ్ల తర్వాత ఆ అభ్యర్థులకు స్థిరమైన భవిష్యత్తు ఉండదు. సైన్యాన్ని కేంద్రం గౌరవించట్లేదు. ప్రధానిగారు.. దేశంలోని నిరుద్యోగుల అభ్యర్థనలను వినండి. అగ్నిపథ్​లో నడిపించి వారి సహనానికి అగ్నిప్రరీక్ష పెట్టకండి." అని రాహుల్​ ట్వీట్​ చేశారు.

అగ్నిపథ్​ తీసేయండి: అగ్నిపథ్​పై నిరసనలకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ​ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని.. పార్లమెంట్​లో చర్చించాలని డిమాండ్​ చేశాయి. దేశ ప్రయోజనాలకు హాని కలిగించే విధంగా ఈ పథకం ఉందని ఆరోపించాయి. "ఈ పథకంతో మిలటరీని కాంట్రాక్ట పద్ధతిలోకి తీసుకొచ్చినట్లు అయింది. తక్కువ జీతాలు ఇవ్వడం అంటే.. యువతను అవమానించడమే. ప్రాణత్యాగానికి సిద్ధపడే యువతకు ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం నేరం." అని సీపీఎం నేతలు మండిపడ్డారు.

ఇదీ చూడండి : బుల్​డోజర్లతో కూల్చివేతలు ఆపలేం.. కానీ...: సుప్రీంకోర్టు

Last Updated :Jun 16, 2022, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.