ETV Bharat / bharat

'మూడో ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధమే'

author img

By

Published : Jul 11, 2021, 9:00 PM IST

కరోనా మొదటి, రెండు దశలతో పోలిస్తే మూడో వేవ్​ ముప్పును రాష్ట్రాలు సమర్థంగా ఎదుర్కొంటాయని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్ కుమార్ ఉద్ఘాటించారు. మహమ్మారి విజృంభణ, గత అనుభవాల నేపథ్యంలో రాష్ట్రాలు పాఠాలు నేర్చుకున్నాయని తెలిపారు.

niti aayog vice chairman
నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్ కుమార్

దేశంలో ఒకవేళ కరోనా వైరస్‌ మూడో ముప్పు వస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ స్పష్టం చేశారు. ఇదివరకు వచ్చిన రెండు వేవ్‌ల నుంచి రాష్ట్రాలు సరైన పాఠాలు నేర్చుకున్నాయని అన్నారు. అంతేకాకుండా సాధ్యమైనంత తొందరగా కరోనా విజృంభణకు ముందున్న పరిస్థితులు వస్తాయని రాజీవ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా వైరస్‌ మూడో ముప్పుపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఈ విధంగా మాట్లాడారు.

"కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెకండ్‌ వేవ్‌, అంతకుముందుతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థపై థర్డ్‌వేవ్‌ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని నా అంచనా. వైరస్‌ విజృంభణను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతకుముందు వచ్చిన వేవ్‌ల నుంచి రాష్ట్రాలు పాఠాలు నేర్చుకున్నాయి."

-రాజీవ్‌ కుమార్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌

ఇదీ చదవండి: అక్టోబర్​-నవంబర్​లో కరోనా మూడో ఉద్ధృతి!

కొవిడ్‌ వారియర్లు..

దేశంలో మూడో ముప్పు రూపంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తే.. ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 1500 ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధమవుతునట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యే వెల్లడించారు. వాటిని దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల పడకలకు అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తే.. అలాంటి పరిస్థితుల్లో 'కొవిడ్‌ వారియర్ల'ను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం 26రాష్ట్రాల్లో దాదాపు 111 కేంద్రాల ద్వారా దాదాపు లక్ష మందికి శిక్షణ అందిస్తోంది.

ఇక దేశంలో రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా జులై 5వ తేదీన 34వేలకు తగ్గిన కేసుల సంఖ్య ఆ తర్వాత ఒక్కసారిగా పెరుగింది. దాదాపు వారం రోజుల నుంచి వరుసగా నిత్యం 40వేల పైచిలుకు కేసులు నమోదుకావడం మూడో ముప్పునకు సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యం (ఆర్‌నాట్‌) పెరగడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.