ETV Bharat / bharat

భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. టీకా తీసుకున్నా వస్తుందా?.. ఎలా పుట్టుకొచ్చింది?

author img

By

Published : Dec 23, 2022, 8:53 AM IST

new covid variant bf7
బెదరగొడుతున్న బీఎఫ్‌ 7

New Covid Variant : ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న కరోనా ఉప వేరియంట్​ భారత్​లోకి ప్రవేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఎఫ్​ 7 వేరియంట్​తో మునుపెన్నడూ లేనంతగా చైనాలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏంటీ ఉప వేరియంట్​? దాని లక్షణాలేంటో తెలుసుకుందామా మరి.

New Covid Variant : కరోనా మహమ్మారి విజృంభణ ధాటికి ప్రస్తుతం చైనా విలవిల్లాడుతోంది. మునుపెన్నడూ లేనంతగా ఆ దేశంలో కేసులు వెల్లువెత్తుతున్నాయి. ఒమిక్రాన్‌కు చెందిన బీఎఫ్‌.7 అనే ఉప వేరియంట్‌ అక్కడ కొవిడ్‌ వ్యాప్తికి ప్రధాన కారణం. అది ఇప్పుడు మన దేశంలోకీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఇంతకీ ఈ బీఎఫ్‌.7 ఎలా పుట్టుకొచ్చింది? భారత్‌లో దాని ప్రభావం ఎంతమేరకు ఉండే అవకాశాలున్నాయి? వంటి అంశాలను పరిశీలిస్తే..

ఏమిటీ వేరియంట్‌?
వైరస్‌లు ఉత్పరివర్తనాలకు లోనైనప్పుడు వాటిలో ఉప రకాలు (సబ్‌ వేరియంట్లు) పుట్టుకొస్తుంటాయి. కొవిడ్‌ కారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ ఉత్పరివర్తనాలకు గురవడం వల్ల వచ్చిన వేరియంట్లలో ఒమిక్రాన్‌ ఒకటి. ఒమిక్రాన్‌ నుంచి ‘బీఏ.5’.. దాన్నుంచి ‘బీఏ.5.2.1.7’ పుట్టుకొచ్చాయి. బీఎఫ్‌.7 కూడా బీఏ.5.2.1.7 వంటిదే. బీఏ.5 వేరియంట్‌ను బీఎఫ్‌.7కు మాతృకగా చెప్పొచ్చు.

ఎలా పుట్టుకొచ్చింది?
ప్రధానంగా సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో ఆర్‌346టీ, ఎన్‌460 అనే రెండు ప్రత్యేక ఉత్పరివర్తనాల కారణంగా బీఎఫ్‌.7 ఆవిర్భవించింది. టీకా, గత ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఉత్పత్తయ్యే యాంటీబాడీలను నిరోధించడంలో ఈ ఉత్పరివర్తనాలు కీలకంగా పనిచేస్తున్నట్లు తేలింది.

కొవిడ్​ వ్యాక్సిన్​

టీకా తీసుకున్నా వస్తుందా?
కొవిడ్‌ టీకా తీసుకున్న వ్యక్తులు, గతంలో కరోనా బారినపడ్డవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలను బీఎఫ్‌.7 సబ్‌ వేరియంట్‌ సులువుగా బోల్తా కొట్టించగలుగుతోంది. చైనాలోని వుహాన్‌ నగరంలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌తో పోలిస్తే బీఎఫ్‌.7కు ఈ సామర్థ్యం 4.4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఒమిక్రాన్‌లోని బీక్యూ.1 అనే ఉప రకానికి ఈ సామర్థ్యం 10 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. యాంటీబాడీలను నిరోధించగల సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే వైరస్‌ అంత విస్తృతంగా ప్రబలుతుంది. బీఎఫ్‌.7 ఒకరికి సోకిందంటే.. ఆ వ్యక్తి నుంచి సగటున 10 నుంచి 18.6 మందికి వ్యాపిస్తోంది.

ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వేరియంట్​

ఇంకా ఏయే దేశాల్లో బయటపడింది?
గతంలో అమెరికాతో పాటు పలు ఐరోపా దేశాల్లో బీఎఫ్‌.7 వ్యాప్తి కనిపించింది. ఈ ఏడాది అక్టోబరులో అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 5% ఈ రకానికి చెందినవే. బ్రిటన్‌లో వాటి వాటా 7.26%గా నమోదైంది. ఆ దేశాల్లో ఈ వేరియంట్‌ బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురవడం, ఆసుపత్రిపాలవడం తక్కువగానే కనిపించింది.

చైనాలో ఎందుకంత విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది?
'జీరో కొవిడ్‌' పేరుతో కరోనా ఆంక్షల విషయంలో చైనా ముందునుంచీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్‌ సహా పలు వేరియంట్లు ఆ దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందలేదు. మునుపు కరోనా బారిన పడ్డ దాఖలాలు లేకపోవడంతో ప్రస్తుతం చైనీయుల్లో సంబంధిత రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంది. అదే ఇప్పుడు అక్కడ విస్తృత వ్యాప్తికి ప్రధాన కారణం. దీనికితోడు చైనాలో ఎక్కువగా అచేతన వైరస్‌ ఆధారంగా ఉత్పత్తిచేసిన టీకాలను పంపిణీ చేశారు. అనేక ఉత్పరివర్తనాలకు లోనైన వేరియంట్లను అవి సమర్థంగా అడ్డుకోలేకపోతున్నాయి.

మనం ఆందోళన చెందాల్సిన అవసరమెంత?
బీఎఫ్‌.7 వ్యాప్తిపై ప్రస్తుతానికి భారతీయులు భయాందోళనలకు గురవ్వాల్సిన అవసరం లేదన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. మన దేశంలో గతంలోనే డెల్టా, ఒమిక్రాన్‌ వంటి పలు వేరియంట్లు ప్రబలంగా వ్యాప్తి చెందాయి. ప్రజల్లో కొవిడ్‌ సంబంధిత రోగనిరోధక శక్తి అధికంగా ఉంది. కాబట్టి బీఎఫ్‌.7 మనకు పెద్దగా నష్టం చేకూర్చకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అయితే గతంలో మహమ్మారి ఉద్ధృతి అనూహ్యంగా పెరిగినదాన్నిబట్టి చూస్తే.. ఈ సబ్‌ వేరియంట్‌ను ఎంతమాత్రమూ తేలిగ్గా తీసుకోకూడదని కూడా హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనలను పక్కాగా పాటించాలని సూచిస్తున్నారు.

బీఎఫ్‌.7 బారినపడిన వారిలో కనిపించే లక్షణాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.