ETV Bharat / bharat

మోదీపై శివసేన స్వరం మారిందా?

author img

By

Published : Jun 10, 2021, 11:11 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడే శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు. ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని వ్యాఖ్యానించారు. రౌత్​ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Modi is top leader of country and BJP, says Raut
మోదీపై శివసేన స్వరం మారిందా?

ప్రధాని మోదీని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రశంసించారు. దేశంలోనే మోదీ అగ్రనాయకుడనీ, భాజపా అగ్రపార్టీ అని ఆయన అన్నారు. రాజకీయ పరమైన కారణాలతో రెండు చిరకాల మిత్ర పక్షపార్టీలు విడిపోయిన తర్వాత ఇలా జరగడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో రౌత్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తౌక్టే తుపాను పరిహారం నిధులపై చర్చించేందుకు ప్రధాని మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"గత ఏడేళ్లలో భాజపా విజయానికి మోదీయే కారణం. దేశంలో ప్రస్తుతం ఆయనే అగ్రనాయకుడు. భాజపాయే అగ్ర పార్టీ. ఈ విషయాన్ని నేను ఏ మీడియా రిపోర్టుల ఆధారంగా చెప్పడం లేదు. దీనిపై అధికారికమైన ప్రకటన ఏదీ లేదు" అని సంజయ్‌ వెల్లడించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇమేజ్‌తోనే భాజపా అధికారంలోకి వచ్చిందని రౌత్‌ అన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త వ్యతిరేకత వ్యక్తమైన మాట వాస్తవమేనని చెప్పారు. కేరళలో ఒక్కస్థానాన్ని కూడా దక్కించుకోని భాజపా.. తమిళనాడులో 4, పశ్చిమ్‌ బెంగాల్‌లో 77 స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే.

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భాజపా, శివసేన మిత్రపక్షాలుగా ఉండేవి. అయితే రాజకీయ పరమైన విభేధాలతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి శివసేన 'మహా వికాస్‌ అఘాడీ'గా ఏర్పడి అధికారం అందుకుంది. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ, మోదీతో, ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశమైన తర్వాత సంజయ్‌ రౌత్‌ భాజపాకు అనుకూలంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇదీ చదవండి : ఈ నెల 12, 13 తేదీల్లో జీ7 సదస్సుకు ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.