ETV Bharat / bharat

మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అడిగినందుకు.. కేజ్రీవాల్​కు రూ.25వేలు ఫైన్​

author img

By

Published : Mar 31, 2023, 3:58 PM IST

Updated : Mar 31, 2023, 5:08 PM IST

modi degree gujarat high court judgement
ప్రధాని మోదీ డిగ్రీ పీజీ సర్టిఫికెట్ల కేసు

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్ల వ్యవహారంలో గుజరాత్‌ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. మోదీ డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వాలని గుజరాత్​ యూనివర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టింది. పిటిషన్​ వేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు రూ.25వేల జరిమానా విధించింది.

ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు చూపించాలని కోరిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​కు గుజరాత్ హైకోర్టు రూ.25వేలు జరిమానా విధించింది. మోదీ డిగ్రీపై కేజ్రీవాల్​కు కావాల్సిన సమాచారం ఇవ్వాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఏడేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలను గుజరాత్ హైకోర్టు శుక్రవారం పక్కనబెట్టింది. కేజ్రీవాల్​కు విధించిన జరిమానాను నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని స్పష్టం చేసింది.

ఇదీ జరిగింది..
2016 ఏప్రిల్​లో అరవింద్​ కేజ్రీవాల్.. కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​కు ఓ లేఖ రాశారు. ఆర్టీఐ చట్టం ప్రకారం అందులో మోదీ విద్యార్హతలకు సంబంధించి వివరాలు వెల్లడించాలని కోరారు. తన గురించి ప్రభుత్వ రికార్డులు వెల్లడించేందుకు ఏం అభ్యంతరం లేదన్న కేజ్రీవాల్​.. మోదీ విద్యార్హతల సమాచారాన్ని కమిషన్ ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటోందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అప్పటి కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​ ఎమ్​ శ్రీధర్ ఆచార్యులు.. గుజరాత్ యూనివర్సిటీకి, దిల్లీ యూనివర్సిటీకి ఆదేశాలు జారీచేశారు. మోదీ విద్యార్హతలకు సంబంధించిన రికార్డులను కేజ్రీవాల్‌కు ఇవ్వాలని సూచించారు.

కేంద్ర సమాచార కమిషన్​ ఛైర్మన్​ ఎమ్​ శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలపై.. గుజరాత్ యూనివర్సిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై గుజరాత్​ హైకోర్టును ఆశ్రయించింది. కేసుపై విచారణ చేపట్టిన కోర్టు.. కేంద్ర సమాచార కమిషన్​ ఆదేశాలపై స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆదేశాల్ని పక్కనబెడుతూ.. కేజ్రీవాల్​కు జరిమానా విధించింది.

సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా గుజరాత్‌ యూనివర్శిటీ తరఫున వాదనలు వినిపించారు. మోదీ విద్యార్హతలను దాచిపెట్టాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఆ వివరాలు ఇప్పటికే పబ్లిక్‌ డొమైన్‌లో, యూనివర్శిటీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్‌ అయినా.. నిరక్షరాస్యుడైనా పెద్ద భేదమేమీ ఉండదని, మోదీ విద్యార్హతలను ప్రత్యేకంగా బయటపెట్టడం వల్ల ప్రజా ప్రయోజనమేం కలగదని తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.

ఇది ప్రధాని వ్యక్తిగత గోప్యతపై ఇది ప్రభావం చూపుతుందన్నతుషార్‌ మెహతా.. ఓ వ్యక్తి బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను ఖండించిన కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది.. ఆ పత్రాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో లేవన్నారు. ఆధారాల కోసమే వాటి కాపీలను కోరుతున్నామని ఆయన వెల్లడించారు. ఇరువరి వాదనలు విన్న గుజరాత్​ హైకోర్టు.. ఈ తీర్పు వెలువరించింది.
ప్రధాని మోదీ 1978లో గుజరాత్‌ యూనివర్శిటీ నుంచి డిగ్రీ, 1983లో దిల్లీ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తిచేశారు.

దేశ ప్రజలకు ఆ హక్కు లేదా?
మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో గుజరాత్​ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. "ప్రధాన మంత్రి ఏం చదువుకున్నారో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? డిగ్రీ సర్టిఫికెట్ చూపించాలన్న ఆదేశాలను ఆయన కోర్టులో వ్యతిరేకించారు. ఎందుకు? డిగ్రీ పట్టా చూపించాలని అడిగిన వారికి జరిమానా వేస్తారా? అసలు ఏం జరుగుతోంది? నిరక్షరాస్య లేదా చదువు తక్కువ ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

కేజ్రీవాల్​పై బీజేపీ ఫైర్​..
గుజరాత్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది బీజేపీ. ప్రధానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. ఈ విషయంలో కేజ్రీవాల్.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Last Updated :Mar 31, 2023, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.