ETV Bharat / bharat

మోదీ- బైడెన్ వర్చువల్​ భేటీ.. యూఎస్​లో జైశంకర్​, రాజ్​నాథ్

author img

By

Published : Apr 11, 2022, 4:25 AM IST

Updated : Apr 11, 2022, 6:57 AM IST

india biden
india biden

Modi Biden Virtual Meet: ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య పట్ల భారత్‌ తటస్థ వైఖరిపై అమెరికా పదేపదే అభ్యంతరాలు లేవనెత్తుతున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్‌గా జరిగే నేటి భేటీలో రష్యా అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మోదీ, బైడెన్‌ భేటీ తర్వాత వాషింగ్టన్‌లో ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు ముఖాముఖి చర్చలు జరగనున్నాయి.

Modi Biden Virtual Meet: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పాకిస్థాన్‌, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం వంటి అంతర్జాతీయ పరిణామాల మధ్య ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మధ్య నేడు(సోమవారం) అత్యున్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇరువురు నేతలు వర్చువల్‌గా సమావేశం కానున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్‌ తటస్థ వైఖరి, రష్యా నుంచి చమురు కొనుగోలు, రూపాయి-రూబుల్‌ వర్తకానికి ప్రాధాన్యం ఇవ్వడంపై అగ్రరాజ్యం అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌పై మాస్కో సైనికచర్యను వ్యతిరేకించాలని బైడెన్‌ కోరే అవకాశం ఉంది.

భారత్‌ నుంచి అమెరికా ఇదే కోరుకుంటున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. ఇంకా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, పాకిస్థాన్‌, శ్రీలంక సహా దక్షిణాసియా పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారం వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. కొవిడ్‌కు అంతం పలకడం, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ భద్రత, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై ప్రధాని మోదీ, బైడెన్‌ దృష్టి సారించనున్నారు. నెలరోజుల వ్యవధిలో ఇరు దేశాధినేతలు సమావేశం కావటం ఇది రెండోసారి. ద్వైపాక్షిక సహకారంపై సమీక్ష సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా.. అత్యున్నతస్థాయి చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు ఈ భేటీ దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

రష్యాకు దూరంగా ఉండాలి... రష్యాకు, అలీనోద్యమానికి భారత్‌ దూరం జరగాలని తాము కోరుకుంటున్నట్లు అమెరికాలో జో బైడెన్‌ సర్కారు శనివారం పేర్కొంది. భారత్, అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం అద్భుతంగా ముందుకు సాగుతోందని పేర్కొంది. దీన్ని మరింత పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుసంపన్నత, భద్రతకు ఇది కీలకమని వివరించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ వెండీ షెర్మన్‌.. కాంగ్రెస్‌లోని శక్తిమంతమైన విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులకు తెలిపారు. ప్రధాన నేతల భేటీ అనంతరం.. ఇరు దేశాలకు చెందిన ఇద్దరు చొప్పున మంత్రులు సైతం చర్చల్లో పాల్గొననున్నారు. భారత్ నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌.. అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చర్చలు సాగించనున్నారు.

ఇదీ చదవండి: రాహుల్​.. ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి: మాయావతి

Last Updated :Apr 11, 2022, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.