ETV Bharat / bharat

మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్​- ఎంత శాతం ఓటింగ్ నమోదైందంటే?

author img

By PTI

Published : Nov 7, 2023, 4:02 PM IST

Updated : Nov 7, 2023, 7:56 PM IST

Mizoram Assembly Election 2023 : మిజోరం అసెంబ్లీలోని 40 స్థానాలకు ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. ఫలితంగా రికార్డ్ స్థాయిలో 77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Mizoram Assembly Election 2023
Mizoram Assembly Election 2023

Mizoram Assembly Election 2023 : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా రికార్డ్ స్థాయిలో 77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా కొన్ని పోలింగ్ బూతుల నుంచి వివరాలు అందలేదని.. వాటిని పరిగణలోకి తీసుకుంటే సుమారు 80 శాతం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మొరాయించిన ఈవీఎం.. రెండోసారి వచ్చి ఓటేసిన సీఎం
Mizoram Assembly Polls : అంతకుముందు మిజోరం సీఎం జోరంథంగా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎం సమస్య కారణంగా ఆయన తొలిసారి అయిజోల్ నార్త్​-2 పోలింగ్ కేంద్రానికి ఎన్నికల కేంద్రానికి వచ్చి ఓటు వేయలేక వెనుతిరిగారు. తర్వాత అల్పాహారం తినడానికి వెళ్లి.. 11 గంటల సమయంలో మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఓటేశారు. అయిజోల్​లోని సౌత్-2 పోలింగ్ స్టేషన్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Mizoram Assembly Election 2023
ఓటేసిన ముఖ్యమంత్రి జోరంథంగా

ఓటేసిన 101 ఏళ్ల వృద్ధుడు, 96 ఏళ్ల దివ్యాంగుడు
ఓ శతాధిక వృద్ధుడు తన భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంపాయి దక్షిణ నియోజకవర్గానికి చెందిన 101 ఏళ్ల వయసున్న పు రౌలనుదల.. 86 ఏళ్ల తన భార్యతో వచ్చి ఓటు వేశారు. వీరే కాకుండా 96 ఏళ్ల దివ్యాంగుడు అయిజాల్​లోని తన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Mizoram Assembly Election 2023
ఓటేసిన శతాధిక వృద్ధుడు, ఆయన భార్య
Mizoram Assembly Election 2023
ఓటేసిన 96 ఏళ్ల దివ్యాంగుడు

పటిష్ఠ భద్రతతో పోలింగ్
మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. మొత్తం 12 వందల 76 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల నేపథ్యంలో బంగ్లాదేశ్, మయన్మార్‌తో మిజోరం పంచుకుంటున్న సరిహద్దుల వెంబడి.. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మణిపుర్‌, అసోం, త్రిపుర రాష్ట్రాల.. సరిహద్దులను మూసివేశారు. ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

గెలుపెవరిదో?
అధికార మిజో నేషనల్ ఫ్రంట్.. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన సాగించాలని భావిస్తోంది. మరోవైపు.. జొరాం పీపుల్స్ మూమెంట్, బీజేపీ, కాంగ్రెస్.. అధికార పార్టీని గద్దెదించాలని ప్రయత్నిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు సాధించింది. కాంగ్రెస్​కు 5, బీజేపీకి ఒక సీటు దక్కింది.

Last Updated : Nov 7, 2023, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.