ETV Bharat / bharat

మణిపుర్​లో ఆగని హింస.. గుంపులుగా వచ్చి దాడులు.. బీజేపీ ఆఫీస్​ ధ్వంసం!

author img

By

Published : Jun 17, 2023, 2:49 PM IST

Manipur Violence : మణిపుర్‌లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. రెండు జాతుల మధ్య ఘర్షణలతో అక్కడ చెలరేగిన హింసకు ఇప్పుడప్పుడే తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. నిరసనకారులు గుంపులుగా విధ్వంసం సృష్టించేందుకు యత్నిస్తున్నారు. తొంగ్జులోని బీజేపీ పార్టీ కార్యాలయంపై దాడికి దిగి.. కుర్చీలు, సామగ్రిని ధ్వంసం చేశారు.

manipur violence
manipur violence

Manipur Violence : మెయిటీ, కుకీ వర్గీయుల వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి క్వక్తా, కాంగ్వై ప్రాంతాల్లో ఘర్షణ జరిగ్గా.. శనివారం వేకువజామున వరకు కూడా చెదురుమదురు కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. రాజధాని ఇంఫాల్‌లోని స్థానిక అడ్వాన్స్‌ హాస్పిటల్ సమీపంలోని ప్యాలెస్ కాంపౌండ్‌ వద్ద ఒక మూక నిప్పంటించడానికి ప్రయత్నించింది. ఆ మూకలో దాదాపు వెయ్యిమంది వరకు ఉన్నారని అధికారులు తెలిపారు.

మణిపుర్‌ విశ్వవిద్యాలయం సమీపంలో, తొంగ్జు ప్రాంతంలోని ఓ ఎమ్మెల్యే ఇంటి వద్ద వందల మంది గుమిగూడి ఇదే తరహాలో దాడికి యత్నించారని వెల్లడించారు. అలాగే మరో 300 నుంచి 400 మంది గుంపుగా వచ్చి ఇంఫాల్ సమీపంలోని ఇరింగ్‌బామ్ పోలీస్‌ స్టేషన్‌లోని ఆయుధాలను లూటీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్‌ ఫోర్స్ మూక దాడుల్ని భగ్నం చేస్తున్నాయి. మణిపుర్‌ బీజేపీ అధ్యక్షురాలి ఇంటివద్ద నిరసకారులు విధ్వంసం సృష్టించారు. అలాగే తొంగ్జులోని బీజేపీ పార్టీ కార్యాలయంపై నిరసకారులు దాడి చేశారు. నిరసనకారుల దాడిలో పార్టీ ఆఫీసులోని కుర్చీలు, సామగ్రిని ధ్వంసం అయ్యాయి.

manipur violence
నిరసనకారుల దాడిలో ధ్వంసమైన బీజేపీ కార్యాలయం

ఆర్మీ విశ్రాంత అధికారులు ఆవేదన..
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆర్మీ విశ్రాంత అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'నేను విశ్రాంత జీవితం గడుపుతోన్న మణిపుర్‌ రాష్ట్రానికి చెందిన ఓ భారతీయుడిని. ఇప్పుడు మణిపుర్‌ను ఎవరూ రాష్ట్రంగా గుర్తించడం లేదు. ఈ రాష్ట్రాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అనిపిస్తోంది. ఇక్కడ లిబియా, లెబనాన్‌, నైజీరియా, సిరియా మాదిరిగా ఎప్పుడైనా, ఎవరివల్లైనా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఇదంతా ఎవరైనా వింటున్నారా..?' అని ఆర్మీకి చెందిన విశ్రాంత అధికారి లెఫ్టినెంట్ జనరల్‌ ఎల్‌ నిషికాంత సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి ఇంటిపై పెట్రోల్​ బాంబులు..
కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్​కే రంజన్ సింగ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు గురువారం రాత్రి.. పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ దాడిలో మంత్రి నివాసంలోని కింది, మొదటి అంతస్తు బాగా దెబ్బతిన్నాయి. అంతేగాక.. రంజన్​ సింగ్ ఇంటి కింద ఉన్న పార్కింగ్ ప్రదేశంలోని పలు వాహనాలు దగ్ధమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దుండగుల దాడి సమయంలో మంత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో దుండగులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అమిత్​ షా పర్యటన..
Amit Shah Manipur Visit : మణిపుర్​లో నెలకొన్న పరిస్థితులపై విచారణకు త్వరలోనే విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వెల్లడించారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా విచారణ చేపడుతుందని చెప్పారు. దీంతో పాటు మణిపుర్ గవర్నర్​ అధ్యక్షతన ముఖ్యమంత్రి సహా అన్ని పార్టీలు, ఇరు తెగల సభ్యులతో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.