సిసోదియా మనిషికి రూ.కోటి లంచం, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

author img

By

Published : Aug 19, 2022, 7:51 PM IST

Delhi excise policy

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియాను ఈడీ అధికారులు కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ దాడులపై ఆప్, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Delhi Excise Policy: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియాపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిసోదియా అనుచరుడికి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి లంచంగా ఇచ్చాడని ఎఫ్​ఐఆర్​లో సీబీఐ పేర్కొంది. మనీష్​ సిసోదియా నివాసాలు సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ శుక్రవారం అనేక గంటలపాటు విస్తృత సోదాలు నిర్వహించింది. మొత్తం 31 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అనంతరం రూ.కోటి వ్యవహారంపై ప్రకటన జారీ చేసింది.

సిసోదియాతో సహా మొత్తం 15 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎక్సైజ్​ పాలసీ తీసుకొచ్చిన సమయంలో దిల్లీ ఎక్సైజ్​ కమిషనర్​గా ఉన్న అరవ గోపీ కృష్ణ, అప్పటి డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఆనంద్ కుమార్ తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్, తొమ్మిది మంది వ్యాపారవేత్తలు, రెండు కంపెనీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని సీబీఐ పేర్కొంది.

మరోవైపు దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సంబంధించిన కేసులో మనీష్ సిసోదియాను ఈడీ కూడా విచారించనున్నట్లు సమాచారం. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దర్యాప్తు వివరాలను ఈడీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు సమాచారం. త్వరలో ఈడీ కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు మొదలు పెట్టనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
మనీష్ సిసోదియాపై సీబీఐ దాడులపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.

సీబీఐని తన పని తాను చేసుకోనివ్వండి. భయపడాల్సిన పనేంలేదు. మనల్ని ఇబ్బంది పెట్టాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఆటంకాలు వస్తుంటాయి. కానీ, మన పని ఆగదు. మనీశ్‌ సిసోదియాపై తనిఖీలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. మన నేతలు అలాంటి సోదాలను ఎదుర్కొన్నారు. ఇవి మనల్ని ఆపలేవు. దేవుడు మనతో ఉన్నాడు. ఈ దాడులకు పార్టీ భయపడదు. ఈరోజే దిల్లీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ను అభినందిస్తూ అమెరికా దిగ్గజ వార్తాపత్రిక అయిన న్యూయార్క్‌ టైమ్స్‌లో మొదటి పేజీలో కథనం వచ్చింది. మనీశ్‌ సిసోదియా ఫొటోను కూడా ప్రచురించారు. కొవిడ్‌ కారణంగా సంభవించిన భారీ మరణాలు గురించి చివరిగా ఈ పత్రికలో భారత్ గురించి వార్త వచ్చింది. ఇప్పటివరకు భారత్​లో ​ అత్యుత్తమ విద్యాశాఖ మంత్రి మనీష్‌ సిసోదియానే. అందులో ఎటువంటి సందేహం లేదు.

--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

దిల్లీలోని ఆప్ ప్రభుత్వం.. మద్యం కుంభకోణంలో పాలుపంచుకుంది. మద్యం లైసెన్సు​దారుల నుంచి నగదు వసూలు చేసే ఇద్దరు మధ్యవర్తులు దేశం విడిచి వెళ్లిపోయారు. మనీష్ సిసోదియా భారీగా అవినీతికి పాల్పడ్డారు.పంజాబ్ ఎన్నికల్లో దిల్లీ మద్యం లైసెన్సుల ద్వారా వచ్చిన డబ్బుల్ని వినియోగించారు. ఆప్ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.

-భాజపా

ఇవీ చదవండి: ఆ గ్రామంలోని కుక్కలు కోటీశ్వరులు, ఏటా భారీగా ఆదాయం, అదిరే లైఫ్​స్టైల్

సీన్​ రివర్స్, రాహుల్ గాంధీ​ పీఏ అరెస్ట్, వారిని ఇరికిద్దామనుకుంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.