ETV Bharat / bharat

కోర్టులో పాఠం చెప్పిన ధర్మాసనం.. న్యాయమూర్తులే గురువులు

author img

By

Published : Oct 29, 2021, 6:54 AM IST

sc
సుప్రీంకోర్టు

దేశ అత్యున్నత న్యాయస్థానంలో (Supreme Court News ) ఎన్నడూ చూడని ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ కేసుకు సంబంధించి జూనియర్​ న్యాయవాదిని అడుగడుగునా ప్రోత్సహిస్తూ.. న్యాయపాఠాలు నేర్పించింది సుప్రీం ధర్మాసనం. న్యాయపరమైన పదాలకు అర్థాలు వివరించింది. సీనియర్​ న్యాయవాది లేని పక్షంలో దాన్ని అవకాశంగా తీసుకొని వాదనలు వినిపించాలని సూచించింది.

సుప్రీంకోర్టులో (Supreme Court News ) గురువారం అసాధారణ దృశ్యం ఆవిష్కృతమయింది. ఇటీవలే న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న యువకుడికి ధర్మాసనం పాఠం చెప్పింది. పదాలకు అర్థాలు వివరిస్తూ అడుగడుగునా ప్రోత్సహించింది. వచ్చే ముందు కేసు సారాంశాన్ని తెలుసుకోవాలని, లేకుంటే కోర్టులో న్యాయవాది.. మైదానంలో బ్యాట్‌లేని సచిన్‌ టెండూల్కర్‌లా ఉంటాడని వ్యాఖ్యానించింది. సీనియర్‌ న్యాయవాది హాజరు కాకపోవడం వల్ల కేసు విచారణను కాసేపు వాయిదా వేయాలని కోరిన ఆ యువ న్యాయవాదిని ఉద్దేశించి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. సీనియర్లు రానప్పుడు వాదించడానికి సిద్ధంగా ఉండాలని హితవు చెప్పింది.

''కళాశాలలో మూట్‌ కోర్టులో పాల్గొని ఉంటారు కదా! దీన్ని మూట్‌ కోర్టు అని భావించండి. భోజన విరామం ప్రకటించడానికి ఇంకా పది నిమిషాలు ఉంది. కేసు సారాంశం చదివే ఉంటారు. వాదనలు ప్రారంభించండి. సీనియర్‌ రాకపోవడాన్ని అవకాశంగా భావించండి. కేసు సారాంశం తెలియని న్యాయవాది అంటే క్రికెట్‌ గ్రౌండ్‌లో బ్యాట్‌లేని సచిన్‌ టెండూల్కర్‌లాంటి వాడు. కోర్టుకు వచ్చే ముందు తప్పకుండా సారాంశాన్ని చదువుకొని సిద్ధం కండి. వాదనలు ప్రారంభించండి. మేం సహకరిస్తాం''

- ధర్మాసనం

ఈ మాటలు విన్న జూనియర్​ లాయర్​.. పన్నుల వ్యవహారానికి సంబంధించిన కేసు సారాంశాన్ని వినిపించడం ప్రారంభించారు. మధ్యలో కొన్ని పదాలకు ధర్మాసనం అర్థాలు అడిగింది. 'కాగ్నెంట్' అన్న పదానికి అర్థం చెప్పలేకపోవడంతో సెల్‌ తీసుకొని గూగుల్‌లో వెతకాలని సూచించింది. దీనికి హేతుబద్ధం, ఒప్పించండం వంటి అర్థాలు ఉన్నాయని ధర్మాసనమే చెప్పింది. మధ్యమధ్యలో 'మర్చంట్‌ ట్రేడ్‌ ట్యాక్సేషన్‌', 'ఎంటీటీ' అన్న పదాలకు అర్థాలు చెప్పింది. 'బెంచ్‌'కు 'ప్రిన్సిపల్‌ సీటు'కు మధ్య తేడా ఏమిటని అడిగింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు పరిధిలోని జబల్‌పుర్‌ బెంచ్‌...ప్రిన్సిపల్‌ సీటు అవుతుందా? కాదా? అని అడిగింది. భోజనానికి వెళ్తున్నామని, ఈ లోగా కేసును చదివి సిద్ధం కావాలని సూచించింది. భోజన విరామం అనంతరం ఈ జూనియర్‌ లాయర్‌ సహకరించగా, సీనియర్‌ న్యాయవాది వచ్చి వాదనలు వినిపించారు.

ఇదీ చూడండి: తుపాకులతో బెదిరించి 8 నిమిషాల్లో రూ.1.25కోట్లు స్వాహా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.