ETV Bharat / bharat

ఒకేరోజు 13వేల మందికి 'వింత జ్వరం'.. భయంతో ఆస్పత్రికి పరుగు.. ప్రభుత్వం అలర్ట్

author img

By

Published : Jun 20, 2023, 2:01 PM IST

Updated : Jun 20, 2023, 3:03 PM IST

Viral Fever In Kerala : కేరళలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13,000 మంది రోగులు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది.

Viral Fever In Kerala
Viral Fever In Kerala

Viral Fever In Kerala : కేరళలో సోమవారం ఒక్కరోజే సుమారు 13,000 మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. విష జ్వరాలతో ప్రతి రోజూ సుమారు 10వేలకు పైగా రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 10 రోజులుగా ప్రజలు.. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను కలిపితే రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13,000 మంది జ్వరం బారిన పడగా.. ఇందులో 12,984 మంది చికిత్స పొంది వెళ్లారు. మరో 180 మంది రోగులు ఆస్పత్రిలో చేరారు. జూన్​ నెల ప్రారంభం నుంచి సోమవారం వరకు 1,61,346 మంది చికిత్స పొందారు.

Kerala Viral Fever : డెంగ్యూ, మెదడు వాపు లాంటి విష జ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోయాయి. సోమవారం ఒక్కరోజే 110 మంది డెంగ్యూ బారిన పడ్డారని తేలింది. మరో 218 మందికి డెంగ్యూ లక్షణాలు ఉండడం వల్ల చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువ మంది రోగులు ఎర్నాకుళం జిల్లాకు చెందిన వారే ఉన్నారు. 43 మందికి డెంగ్యూ నిర్ధరణ కాగా.. మరో 55 మందిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1,011 మంది రోగులు డెంగ్యూ బారిన పడ్డారు. మరోవైపు మెదడు వాపు వ్యాధి బారిన పడే రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 8 మందికి మెదడు వాపుగా తేలింది. మరో 14 మందికి ఈ లక్షణాలు కనిపించాయి. ఈ నెలలో ఇప్పటివరకు 76 మందికి మెదడు వాపు వ్యాధి సోకగా.. మరో 116 మందిలో లక్షణాలు ఉన్నాయి.

ప్రభుత్వం అప్రమత్తం
రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల బారిన పడే వారి సంఖ్య పెరగుతుండడం వల్ల ప్రభుత్వం అప్రమత్తమైంది. విష జ్వరాలు వ్యాపించకుండా చర్యలు చేపట్టింది. మెదడు వాపు వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. వర్షాకాల సీజన్​ నేపథ్యంతో పాటు శుభ్రత లోపాలతోనే విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని తెలిపింది.

ప్రత్యేక వార్డులు సిద్ధం
డెంగ్యూ రోగుల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేసింది. ఈ రోగాలు ఇతరులకు వ్యాపించకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆస్పత్రులకు సూచించింది. ఇతర రోగుల కోసం ఫీవర్​ వార్డులు, ఐసీయూలను ఏర్పాటు చేయాలని వైద్య కళాశాలల్ని ఆదేశించింది. అవసరమైన మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని చెప్పింది. ప్రతి ఆస్పత్రులోనూ వైద్య సిబ్బందితో పాటు డాక్టర్లు కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది. దోమలకు ఆవాసాలైన నీటి కుంటలు ఉండకుండా చూడాలని సూచించింది. భవన నిర్మాణ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని.. నిబంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇవీ చదవండి : ఇంటింటా జ్వరం.. ఈ జాగ్రత్తలతో అంతా పదిలం!

మీ పిల్లల్లో జ్వరం.. శరీరంపై పగుళ్లా.. అయితే జరభద్రం

Last Updated : Jun 20, 2023, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.