ETV Bharat / opinion

విషజ్వరాల ముసురు.. ముందస్తు జాగ్రత్తలే విరుగుడు

author img

By

Published : Sep 30, 2021, 6:46 AM IST

కొవిడ్‌ను(Covid-19), సాధారణ విషజ్వరాలను(viral fever india) వేర్వేరుగా గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా వర్షాకాలంలో పలు విషజ్వరాలు జోరందుకున్నాయి. ఇలాంటి సమయంలో ముందు జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

viral fevers
విషజ్వరాలు

కొవిడ్‌ తీవ్రత(Covid surge in India) తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో వర్షాలు ముమ్మరించి సీజనల్‌ వ్యాధుల(Viral Fever in India) ముప్పు పెరుగుతోంది. పలు రకాల విషజ్వరాలు(Seasonal Fever) జోరందుకుంటున్నాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు దాదాపుగా ఒకే రకమైన వ్యాధి లక్షణాలు కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు కొవిడ్‌గా భావించే ప్రమాదం ఉంది. గత సంవత్సరం వర్షాకాలంలో లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు భౌతిక దూరం పాటించడం వల్ల సాంక్రామిక వ్యాధులు చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం సాధారణ పరిస్థితుల నేపథ్యంలో జనసమ్మర్దం అధికంగా ఉండేచోట్ల విషజ్వరాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. కొవిడ్‌ను, సాధారణ విషజ్వరాలను వేర్వేరుగా గుర్తించడంలో ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముంది. ఈ విషయంలో వైద్యులతోపాటు ప్రజల్లోనూ అవగాహన పెరగాలి.

వర్షాకాలంలో అధికం

దేశంలో డెంగీ(Dengue fever) వంటి జ్వరాలు ప్రబలడానికి నగరీకరణే ప్రధాన కారణంగా నిలుస్తోంది. నీరు నిల్వ ఉండేచోట దోమలు వృద్ధిచెంది జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దేశంలో డెంగీవ్యాప్తి వర్షాకాలం తరవాత ఎక్కువగానే ఉంటున్నా, దక్షిణాది రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కేసులు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి ప్రస్తుతం గ్రామాల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాధికి ప్రధాన వాహకమైన ఏడిస్‌ దోమ మనదేశంలో అన్ని పెద్ద నగరాల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్ల మందిని ప్రభావితం చేసే మలేరియా మన దేశంలో ప్రధానమైన ప్రజారోగ్య సమస్య.

అటవీ, గిరిజన ప్రాంతాల్లో మలేరియా(Malaria in India) ప్రభావం అధికం. రెండు దశాబ్దాలుగా మలేరియా తాలూకు మరణాల శాతం తగ్గినా వ్యాధి బారిన పడుతున్న వారు అధికంగా ఉంటున్నారు. ప్రాణాంతకమైన ఫాల్సిపారం మలేరియా వయసుతో నిమిత్తం లేకుండా ప్రభావితం చేస్తుంది. ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో గ్రామాల్లో, పారిశుద్ధ్య వ్యవస్థ లోపాల వల్ల పట్టణాలు, నగరాల్లో మలేరియా విజృంభిస్తోంది. జులై నుంచి నవంబర్‌ మధ్య మన దేశంలో మలేరియా తీవ్రరూపం దాలుస్తుంది. మందులకు లొంగని మలేరియా కేసులు ఊపిరితిత్తుల సమస్యలను మరింత జటిలంగా మారుస్తున్నాయి. తక్కువ మోతాదులో లేదా తక్కువ కాలం మాత్రమే మందులను వాడితే వ్యాధి తగ్గని పరిస్థితి నెలకొంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030నాటికి మలేరియాను 90శాతం తగ్గించే ప్రణాళికను చేపట్టింది. కేవలం మందులు వెదజల్లడం వంటి ప్రక్రియల ద్వారానే కాకుండా నూతన సమగ్ర విధానాల ద్వారా పరిసరాలు, వ్యక్తిగత పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మలేరియా ప్రభావిత దేశాలు గుర్తుచేశాయి. మందకొడిగా సాగుతున్న మలేరియా టీకా పరిశోధనలు కొన్ని దేశాలకే పరిమితమయ్యాయి. వర్షాలు, వరదల వల్ల విజృంభించే లెప్టోస్పిరోసిస్‌ వ్యాధి ఎలుకలు, మేకలు, పందుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాలేయం, మూత్రపిండాలు పాడై, మరణించే పరిస్థితి నెలకొంటుంది. ఏటా లక్షమందికిపైగా దీనిబారిన పడుతున్నారు.

చాపకింద నీరులా విస్తరించే టైఫాయిడ్‌కు చక్కని ఔషధాలు అందుబాటులో ఉన్నా ఏటా రెండులక్షల మందికిపైగా దీని బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. మనదేశంలో ఏడాది పొడవునా టైఫాయిడ్‌ సాధారణ వ్యాధిలా కనబడినా, వర్షాకాలంలో అధికంగా వ్యాప్తి చెందుతోంది. విషజ్వరాలను గుర్తించే అనేక రక్త పరీక్షలు కొన్నిసార్లు విఫలమవుతుంటాయి. అందుకని, వాటి ఆధారంగానే రోగ నిర్ధారణ సాధ్యం కాదు. కొన్ని రకాల పరీక్షలు పెద్ద నగరాలలోసైతం అందుబాటులో లేవు. అందువల్ల వ్యాధి నిర్ధారణలో జాప్యం కూడా అశనిపాతంలా మారుతోంది. వర్షాకాలంలో అనేకమంది దోమ కాటుతో ప్రబలే చికున్‌గన్యా జ్వరంతోపాటు, కీళ్ల వ్యాధుల బారిన పడుతున్నారు. బ్రుసెల్లోసిస్‌ వంటి జ్వరాలు కూడా ఈ సీజన్‌లో అధికంగా వస్తాయి. సరైన వ్యాధి నిర్ధారణ జరగకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.

ఉపేక్ష వద్దు

వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నాలాల్లో పూడికలు తొలగించాలి. ఆసుపత్రులను సంసిద్ధం చేయడంతో పాటు, దోమకాటు నివారణ చర్యలు చేపట్టాలి. వరద నీరు జనావాసాల్లో నిలిచిపోకుండా, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. కొవిడ్‌ లక్షణాలతోపాటు సీజనల్‌ జ్వరాలను విడిగా గుర్తించాలి. సత్వర చికిత్స ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. ఇందుకోసం ఆరోగ్య యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలి. ప్రజలు సైతం వ్యాధి లక్షణాలను ఏమాత్రం ఉపేక్షించకుండా సత్వర చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి. పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇప్పటికే కొవిడ్‌ బారినపడి విలవిల్లాడిన మన సమాజం, మరికొన్ని ఆరోగ్య విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం ప్రస్తుత సమయంలో క్లిష్టతరమే. ప్రణాళికాబద్ధమైన చర్యలు మాత్రమే ఇలాంటి ఉత్పాతాల నుంచి ప్రజలను రక్షిస్తాయన్న సంగతి అధికార యంత్రాంగాలు గుర్తించాలి.

--డాక్టర్ శ్రీభూషణ్ రాజు, హైదరాబాద్ నిమ్స్​లో నెఫ్రాలజీ విభాగాధిపతి.

ఇదీ చదవండి:World Heart Day:గుండె వ్యాధుల తీవ్రత అధికంగా భారత్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.