ETV Bharat / bharat

'కేరళం'గా మారనున్న కేరళ.. అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం.. కేంద్రం ఆమోదముద్రే ఆలస్యం!

author img

By

Published : Aug 9, 2023, 2:37 PM IST

Updated : Aug 9, 2023, 3:27 PM IST

kerala name change
kerala name change

Kerala Name Change : కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Kerala Name Change : కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అధికారికంగా తమ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్​లో ఉన్న అన్ని భాషల్లో తమ రాష్ట్రాన్ని కేరళంగా మార్చాలని స్పష్టం చేశారు. ఈ తీర్మానానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF ఎలాంటి సవరణలు కోరకుండానే మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో స్పీకర్‌ తీర్మానానికి ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే కేరళను మలయాళంలో కేరళంగా వ్యవహరిస్తున్నారు. మిగిలిన భాషల్లోనూ అలాగే వ్యవహరించాలని విజయన్‌ ప్రభుత్వం.. కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

"కేరళను మలయాళంలో( Kerala State Name in Malayalam ) కేరళంగానే పిలుచుకుంటున్నాం. కానీ ఇతర భాషల్లో అది కేరళగా కొనసాగుతోంది. రాజ్యాంగంలోని ఒకటో షెడ్యూలులో మన రాష్ట్రం పేరు కేరళగా ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం దీన్ని కేరళంగా సవరణ చేసేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అసెంబ్లీ ఏకగ్రీవంగా కోరుతోంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులోని భాషలన్నింటిలో రాష్ట్రం పేరును కేరళంగానే సవరించాలని కోరుతున్నాం."
-పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

మలయాళం మాట్లాడే ప్రజల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలని దేశ స్వాతంత్ర్య సంగ్రామ సమయం నుంచీ పోరాటం జరిగిందని విజయన్ పేర్కొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజనలో భాగంగా 1956 నవంబర్ 1న కేరళ ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ఇతర భాషల్లో తమ రాష్ట్రం పేరు మాత్రం ఇప్పటికీ కేరళగానే ఉందని తెలిపారు.

పేరు మార్పునకు డిమాండ్- మలయాళానికి ప్రాధాన్యం
కేరళను కేరళంగా అధికారికంగా మార్చాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఇంగ్లిష్ డాక్యుమెంట్​లలో కేరళ పేరును కేరళంగా మార్చాలని సీపీఎం ఎమ్మెల్యే ఎంఎం మణి 2016లో అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అయితే, అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని సీఎం విజయన్ అప్పట్లో సమాధానం ఇచ్చారు. పేరు మార్చే ప్రతిపాదనపై ముందడుగు పడకపోయినా.. పాలనాపరమైన కార్యకలాపాల్లో మలయాళానికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది విజయన్ సర్కారు. చట్టాలు, ఉత్తర్వులను మలయాళంలోనే ఇవ్వడం ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారిక భాషగా మలయాళాన్ని గుర్తిస్తూ 2017లో ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు, సర్క్యులర్లు, లేఖలు అన్నీ మలయాళంలోనే జారీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు ఇంగ్లిష్​ను ఉపయోగిస్తున్నారు.

పేదల ఇంటికి ఫైబర్​నెట్​.. 'ఫ్రీ'గా హై స్పీడ్ ఇంటర్నెట్​ కనెక్షన్​..

రేషన్ షాపుల్లో నగదు విత్​డ్రా సౌకర్యం.. గ్యాస్​ సిలిండర్లు, పాల ప్యాకెట్లూ కొనొచ్చు

Last Updated :Aug 9, 2023, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.