ETV Bharat / bharat

అరుదైన చికిత్స విధానంతో కెన్యా మహిళ ప్రాణం కాపాడిన వైద్యులు

author img

By

Published : Jan 12, 2023, 12:21 PM IST

Karnataka: Rare procedure performed on Kenyan patient
65ఏళ్ల కెన్యా మహిళ

65 ఏళ్ల కెన్యా మహిళకు కర్ణాటక వైద్యులు అరుదైన పద్ధతిని ఉపయోగించి సర్జరీ చేశారు. దీంతో ఎన్నో రోజులుగా బాధపడుతున్న మిట్రల్​ వాల్వ్ సమస్య నుంచి మహిళ బయటపడింది.

కర్ణాటకలోని మంగళూరు ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేసి మహిళ ప్రాణాలను కాపాడారు. చాలా రోజులుగా మిట్రల్​వాల్వ్ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 65 ఏళ్ల కెన్యా మహిళకు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. కానీ కొన్నేళ్ల తర్వాత ఆమెకు మళ్లీ సమస్యలు తలెత్తాయి. దీంతో మంగళూరులోని ఇండియానా ఆస్పత్రిని ఆశ్రయించింది మహిళ. ఇక్కడి వైద్యులు ట్రాన్స్‌కాథెటర్ టెక్నిక్​ను ఉపయోగించి లాప్రోస్కోపీ సర్జరీ చేసి పాత వాల్వ్​ను తీసేయకుండానే కొత్త వాల్వ్​ను అమర్చారు. దీంతో ఆ మహిళ పూర్తిగా కోలుకుంది.

Karnataka: Rare procedure performed on Kenyan patient
ఇండియానా ఆస్పత్రి వైద్య బృందం, కెన్యా మహిళ

2014లో అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో ఆ మహిళకు తొలుత బైపాస్ సర్జరీ జరిగిందని మంగళూరులోని ఇండియానా హాస్పిటల్ అండ్ హార్ట్ ఇనిస్టిట్యూట్ వైద్యుడు తెలిపారు. సర్జరీ జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని చెప్పారు. "సర్జరీ చేసి వేసిన వాల్వ్ పనిచేయక పోవడం వల్ల గుండె పనితీరు దెబ్బతిన్నది. దీని ప్రభావంతో ఆమెకు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, రక్తపోటు సమస్యలు మొదలయ్యాయి. దీంతో ఆమె చికిత్స నిమిత్తం మంగళూరులోని ఇండియానా హాస్పిటల్ అండ్ హార్ట్ ఇనిస్టిట్యూట్​లో చేరింది. ఇక్కడి వైద్యులు ఒక వినూత్న చికిత్స పద్ధతిని ఉపయోగించి సర్జరీ చేశారు. పాత వాల్వ్​ను తీసేయకుండా ఇంటర్వెన్షనల్ చికిత్స పద్ధతి ద్వారా గుండెను ఓపెన్ చేయకుండానే వాల్వ్​ను మార్చారు. ఈ పద్ధతినే ట్రాన్స్‌కాథెటర్ మిట్రల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్ (TMVR) అంటారు" అని హాస్పిటల్ హెడ్ డాక్టర్ యూసుఫ్ కుంబ్లే తెలిపారు.

ఈ చికిత్స ఒక గంటలో పూర్తయిందని, ఒక రోజులోనే రోగిని ఐసీయూ నుంచి బయటకు తీశారని వైద్యులు తెలిపారు. ఐదు రోజుల తర్వాత రోగిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఈ విధానం గతంలో కూడా పలు కేసుల్లో విజయవంతం అయిందని వైద్యులు తెలిపారు. చాలారోజుల నుంచి బాధపడుతున్న సమస్య నుంచి కాపాడినందుకు కెన్యా మహిళ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ చికిత్సతో తానెంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.