ETV Bharat / bharat

'మేం గెలిస్తే ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి'.. రాహుల్​ గాంధీ హామీ

author img

By

Published : Apr 28, 2023, 5:35 PM IST

కర్ణాటకలో ఒక్కో గ్రామానికి కోటి రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. కల్యాణ కర్ణాటక ప్రాంతానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తామన్నారు. గురువారం కలబురగి జిల్లాలో ప్రచారం నిర్వహించిన రాహుల్​ గాంధీ.. కర్ణాటక ప్రజలకు ఈ హామీలు ఇచ్చారు.

karnataka-elections-2023-rahul-promises-rs-1crore-to-each-village-panchayat-and-rs-five-crore-for-kalyana-karnataka
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023

కర్ణాటక ప్రజలపై కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ హామీల వర్షం కురిపించారు. రాష్ట్రంలో తమ​ పార్టీ అధికారంలోకి వస్తే.. ఒక్కో గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు మంజూరు చేస్తామన్నారు. కల్యాణ కర్ణాటక ప్రాంతానికి రూ.5వేల కోట్లు కేటాయిస్తామని వాగ్దానం చేశారు. (బీదర్, యాద్గిర్, రాయచూరు, కొప్పల్, కలబురగి, బళ్లారి, విజయనగర జిల్లాలను కల్యాణ కర్ణాటక ప్రాంతంగా పరిగణిస్తారు.) అదే విధంగా రాష్ట్రంలో 50వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. గురువారం కలబురగి జిల్లాలో ప్రచారం నిర్వహించిన రాహుల్​ గాంధీ.. ప్రజలపై ఈ హామీలు గుప్పించారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని రాహుల్​ గాంధీ జోస్యం చెప్పారు. బీజేపీకి 40 నంబర్​ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆ పార్టీ నలభై సీట్లు మాత్రమే గెలుస్తుందని ఎద్దేవా చేశారు. కర్ణాటక మంత్రులపై 40 శాతం కమీషన్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. రాహుల్​ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రాహుల్​ గాంధీ.. ప్రభుత్వ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ల నుంచి ఆ పార్టీ కమీషన్​ వసూలు చేసిందని ఆరోపించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 150 స్థానాలు గెలుచుకుని.. అధికారంలోకి వస్తుందని రాహుల్​ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓ దొంగ ప్రభుత్వంగా అభివర్ణించిన ఆయన.. ప్రతిపక్షాల నుంచి అధికార పక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్న రాహుల్​ గాంధీ.. తాము అధికారం​లోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

karnataka-elections-2023
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అభివాదం చేస్తున్న రాహుల్​

కాంగ్రెస్​ పార్టీ ఇంతకు ముందే ఇచ్చిన పలు హామీలను రాహుల్​ గాంధీ గుర్తు చేశారు. అందులో కుటుంబ పెద్ద అయిన మహిళలకు రూ. 2000, ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్ల కరెంట్​, రెండేళ్ల పాటు నిరుద్యోగ పట్టభద్రులకు రూ.3000, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు రూ.1,500, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 10 కిలోల బియ్యం ఇస్తామని చెప్పిన రాహుల్​.. వాటిని కచ్చితంగా అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. దీంతో పాటు మహిళలకు ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మరో హామీ కూడా ఇచ్చారు.

karnataka-elections-2023
రాహుల్ సమావేశానికి హాజరైన జనం
karnataka-elections-2023
సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్​ గాంధీ

కర్ణాటకలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ పావులు కదుపుతోంది. అందుకు అనుగుణంగానే పలు పథకాల అమలు హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో 224 శాసనసభ స్థానాలకుగానూ ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 10న పోలింగ్ జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.