ETV Bharat / bharat

కర్ణాటక బీజేపీలో 'తిరుగుబాటు' కలవరం.. 24 సీట్లపై ఎఫెక్ట్! పెద్ద సమస్యే!

author img

By

Published : Apr 17, 2023, 9:01 AM IST

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నేతల తిరుగుబాటు.. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉండటంతో టిక్కెట్లు ఆశించి భంగపాటుకు గురైన నాయకుల్లో.. అసంతృప్తిని చల్లార్చేందుకు అధికార భాజపా మల్లగుల్లాలు పడుతోంది.

karnataka assembly election 2023
తిరుగుబాటుదారులతో కర్నాటక బీజేపీలో కలవరం

కర్ణాటక శాసనసభ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు విషయం అధికార భాజపాకు తలనొప్పిగా మారింది. టిక్కెట్లు ఆశించి భంగపాటుకు గురైన నాయకుల తిరుగుబాటుతో ఆయా నియోజకవర్గాల ఫలితాలు తారుమారయ్యే అవకాశముందని భాజపా దిగులు చెందుతోంది. తాజాగా టిక్కెట్లు దక్కని మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మన్‌ సవాడి రాజీనామా నిర్ణయంతో ఆ పార్టీకి మరింత ఝలక్‌ తగిలింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఏర్పడిన అసంతృప్తి ఆందోళన కలిగించే విషయమేనని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు.

ఇప్పటి వరకు 224 స్థానాలకు గానూ 212 స్థానాలకు భాజపా.. అభ్యర్థులను ప్రకటించింది. సుమారు 24 స్థానాల్లో తిరుగుబాటు కనిపిస్తోందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే భాజపా స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ‌్డుకోలేదని భాజపా కర్ణాటక సీనియర్‌ నేత యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత‌్వం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ , ప్రహ్లాద్ జోషి, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, యడియూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్​ను రంగంలోకి దింపింది.

కొంతమంది ఆరెస్సెస్‌ నాయకులు సైతం అసమ్మతివాదులను బుజ్జగించే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. అసంతృప్త నాయకులందరితో మాట్లాడి పార్టీని వీడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, యడియూరప్పలు పేర్కొన్నారు. కేంద్ర నాయకత్వం సైతం అసంతృప్త సీనియర్లతో వ్యక్తిగతంగా సంప్రతింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

టిక్కెట్ల విషయంలో మునుపెన్నడూ లేని విధంగా భాజపా సరికొత్త విధానాన్ని అవలంబించింది. 75 ఏళ్లకు చేరువలోని సీనియర్‌ నాయకులకు నిర్మోహమాటంగా టిక్కెట్లను నిరాకరించింది. ఇప్పటి వరకు గెలవని స్థానాల్లో కొత్త ముఖాలను రంగంలోకి దింపింది. మరి కొన్ని చోట్ల తమ పిల్లలకు టిక్కెట్లు కావాలంటే సీనియర్లను పోటీ నుంచి తప్పుకోవాలని కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొన్ని ఆదేశాలు ఇచ్చారని... మిగిలిన జాబితాను ఖరారు చేయడానికి పార్టీ వివిధ అంశాలపై కసరత్తు చేస్తోందని భాజపా కేంద్ర ఎన్నికల భేటీ తర్వాత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు.

కాంగ్రెస్​ 'ఆపరేషన్​ హస్త'.. ఏం జరగనుందో..
కొందరు సిట్టింగ్​ ఎమ్యెల్యేలకు సీట్లు నిరాకరించడం వల్ల పార్టీకి నేతలు గుడ్​బై చెబుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగదీశ్​ షెట్టర్​ బీజేపీకి రాజీనామా చేశారు. అసలు ఎవరీ జగదీశ్​ శెట్టర్​? ఆయన కాంగ్రెస్​లో చేరనున్నారా? ఏం జరగనుంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.