ETV Bharat / bharat

'రూ.కోటి లాటరీ గెలిచా.. నన్ను కాపాడండి ప్లీజ్'.. పోలీస్​ స్టేషన్​కు కూలీ పరుగు

author img

By

Published : Jun 30, 2023, 4:45 PM IST

Karala Migrante Worker Wins Lottery
రూ కోటి గెలిచిన కార్మికుడు భయంతో పోలీస్ స్టేషన్​కు పరుగు

ఓ వలస కూలీ తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతడిని ఎవరో వెంబడిస్తున్నారని అనుకున్న పోలీసులు.. అసలు విషయం తెలుసుకొని షాక్​ అయ్యారు. ఇంతకీ ఈ కథేంటంటే?

లాటరీలో కోటి రూపాయల నగదు గెలుచుకున్న ఓ కార్మికుడు.. 'నన్ను కాపాడండి' అంటూ పోలీస్ స్టేషన్​కు వెళ్లాడు. మొదటగా ఆ కార్మికుడ్ని ఎవరైనా వెంబడిస్తుండవచ్చని పోలీసులు భావించారు. కానీ అతడి విషయం ఏంటని ఆరా తీయగా.. అసలు కథ తెలుసుకొని పోలీసులు నోరెళ్లబెట్టారు. 'ఫిఫ్టీ - ఫిఫ్టీ' అనే లాటరీలో అతడు కోటి రూపాయలు గెలుచుకున్నట్లు నిర్ధరించుకుని అతడికి సహాయం చేశారు. ఈ ఘటన కేరళ తిరువనంతపురంలో జరిగింది.

ఇదీ కథ...
బంగాల్​కు చెందిన బిర్షు రాంబ ఓ వలస కార్మికుడు. అతడు ప్రస్తుతం కేరళలో ఉంటున్నాడు. అయితే రాంబ సోమవారం ఫిఫ్టీ - ఫిఫ్టీ అనే లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. విజేత ఎవరో తెలుసుకునే క్రమంలో రాంబ బుధవారం సాయంత్రం లాటరీ విక్రయించిన వారి వద్దకు వెళ్లాడు. లాటరీ గెలిచిన వారి నంబర్లను విక్రయదారులు చూడగా.. అందులో రాంబ కొనుగోలు చేసిన టికెట్ నంబరు ఉంది. రాంబ కోటి రూపాయలు గెలుచుకున్నాడని తెలిసిన లాటరీ నిర్వాహకులు సైతం ఆశ్చపోయారు. అతడు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్న విషయాన్ని చెప్పి.. పోలీసుల నుంచి భద్రత తీసుకోవాలని వారు సలహా ఇచ్చారు.

లాటరీ గెలుచుకున్న తనపైన ఏ సమయంలోనైనా దాడి జరగవచ్చని ఆందోళన చెందిన రాంబ.. పోలీసుల సహాయం పొందాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక తంపనూర్ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించాడు. తాను గెలుపొందిన లాటరీ గురించి వివరించి.. భద్రత కావాలని పోలీసులను అభ్యర్థించాడు. లాటరీ టికెట్​ను పోలీసులకు అప్పజెప్పి.. మిగిలిన ప్రక్రియ గురించి తనకు తెలియదంటూ నిర్వాహకుల నుంచి నగదు ఇప్పించాల్సిందిగా కోరాడు. వెంటనే స్పందించిన ఎస్​హెచ్​ఓ ఆర్.ప్రకాశ్.. ఫెడరల్ బ్యాంక్ మేనేజరుకు సమాచారం చేరవేసి.. ఆ లాటరీ టికెట్​ను ఆయనకు అందించారు. పోలీసులు కూడా 'కోటీశ్వరుడైన కార్మికుడి'కి ఆశ్రయం కల్పించి.. డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. వారు ఈ విషయాన్ని వారి ఫేస్​బుక్ పేజీలో షేర్ చేశారు.

మూడు నెలల కిందట ఇలానే..
మూడు నెలల కిందట కూడా బంగాల్​కు చెందిన మరో కార్మికుడు కేరళ లాటరీలో విజేతగా నిలిచాడు. కేరళ ప్రభుత్వం 'స్త్రీ శక్తి' పేరిట నిర్వహించిన లాటరీని మార్చ్​ 16వ తేదీన డ్రా తీశారు. ఆ డ్రా లో బంగాల్​కు చెందిన కార్మికుడు ఎస్​ కే బదేస్ రూ. 75 లక్షలు గెలుచుకున్నాడు. అతడు కూడా భయంతో పోలీసులను ఆశ్రయించాడు. సానుకూలంగా స్పందించిన పోలీసులు అతడికి సహాయం చేశారు.

అంతకుముందు కూడా కేరళ కోజికోడ్​కు చెందిన వ్యక్తి ఇలాంటి భద్రత సమస్యలు తలెత్తుతాయన్న అనుమానంతో లాటరీ గెలుచుకున్న తన పేరును బహిర్గతం చేయకూడదని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశాడు. అతడి కోరిక మేరకు లాటరీ నిర్వాహకులు కూడా విజేత పేరును వెల్లడించలేదు. ఆ డ్రా లో విజేత రూ. 12 కోట్లు గెలుపొందాడు. ఇతరత్రా పన్నుల చెల్లింపుల తర్వాత అతడు రూ. 7.65 కోట్లు పొందాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.