ETV Bharat / bharat

జోషీమఠ్​లో సీఎం పర్యటన.. వేగంగా సహాయక చర్యలు.. భూమి కుంగడానికి కారణమదేనా?

author img

By

Published : Jan 7, 2023, 11:15 AM IST

Updated : Jan 7, 2023, 2:12 PM IST

joshimath-disaster
joshimath-disaster

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. భూమికి పగుళ్లు రావడం, నిర్మాణాలు కూలిపోవడం వెనుక ఉన్న కారణాలు అన్వేషించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఇంతకీ జోషీమఠ్ కుంగిపోవడం వెనక ఉన్న కారణాలేంటి? గతంలో ఈ ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా జోషీమఠ్‌ పట్టణంలో భూమి కుంగిపోవడం తీవ్ర కలకలం రేపింది. భూమికి పగుళ్లు ఏర్పడటం, కుంగిపోవడం వల్ల సుమారు 600 ఇళ్లు దెబ్బతిన్నాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎముకలు కొరికే చలిలోనే కాలం గడుపుతున్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసి... భూమి కుంగిపోవడానికి గల కారణాలను అన్వేషించాలని ఆదేశించింది.

joshimath-disaster
పగుళ్లు

జోషిమఠ్ ఘటనపై వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ డైరెక్టర్‌ కలాచంద్‌ సైన్‌ స్పందించారు. ఏళ్ల క్రితం కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాలపై జోషిమఠ్ నిర్మితం కావడం వల్లే ప్రస్తుతం క్రమంగా కుంగిపోతుందని పేర్కొన్నారు. దాదాపు వందేళ్ల క్రితం జోషిమఠ్‌ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. వాటి మీదే జోషీమఠ్‌ నిర్మాణం జరిగిందని... అందుకే పట్టణ పునాదులు బలహీనంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే సెస్మిక్‌ జోన్‌-5లో ఉండటం... నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా ఇక్కడి శిలలు కాలక్రమేనా బలహీనంగా మారిపోయాయని వెల్లడించారు. జోషీమఠ్‌కు ప్రమాదం పొంచి ఉందని చాలా ఏళ్లుగా హెచ్చరికలు ఉన్నట్లు కలాచంద్‌ సైన్‌ తెలిపారు. 1976లో మిశ్రా కమిటీ జోషీమఠ్‌ ప్రమాదంపై హెచ్చరించిందని పేర్కొన్నారు. జోషీమఠ్‌లో జనాభాకు అనుగుణంగా నిర్మాణాలు పెరగడం... పర్యాటక ప్రాంతం కావడంతో భారీ నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు సమస్య తీవ్రమైందని పేర్కొన్నారు.

joshimath-disaster
రోడ్డుపై ఏర్పడ్డ పగుళ్లు

అధికారులకు సీఎం ఆదేశం..
మరోవైపు, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ శనివారం జోషీమఠ్​ను సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, జోషీమఠ్​లోని 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ధామీ ఆదేశించారు. వీలైనంత త్వరగా వారిని తరలించాలని స్పష్టం చేశారు. ప్రజల జీవితాలే తమకు ముఖ్యమని ఆయన తెలిపారు. పట్టణంలో విపత్తు నిర్వహణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్వల్పకాల, దీర్ఘకాల ప్రణాళికలతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. శాశ్వత పునరావాసం కోసం పీపల్​కోటి, గౌచార్ సహా పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కాగా, బాధిత కుటుంబాలకు నెలనెలా కొంత నగదు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

joshimath-disaster
పగుళ్ల కారణంగాా కూలిన ప్రహారీ

బాధితుల ఆగ్రహం..
ఇదిలా ఉండగా.. జోషీమఠ్​లోని సింగ్ధార్ వార్డులో ఓ మందిరం కూలిపోయింది. 15రోజుల క్రితమే ఆలయానికి భారీగా పగుళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే శుక్రవారం గుడి కూలిపోయిందని స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో లోపల ఎవరూ లేరని చెప్పారు. ఇళ్లకు పగుళ్ల నేపథ్యంలో అనేక మంది ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. పలువురు రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. స్థానిక పాఠశాల, గురుద్వారా, మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రాంతంలో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ సరైన సదుపాయాలు లేవని ఆరోపణలు వస్తున్నాయి. అధికార యంత్రాంగం తమకు తగిన సాయం చేయడం లేదని, చలిని తట్టుకునేందుకు, ఆహారం కోసం ఏర్పాట్లు కూడా లేవని బాధితులు వాపోయారు. ఒక్కపూట భోజనం అందించారని, రాత్రి మ్యాగీ తిని నిద్రపోయామని చెప్పారు. తమకు కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Last Updated :Jan 7, 2023, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.