ETV Bharat / bharat

వెంటిలేటర్​ తీసేసి ఇంటికి వెళ్తానని పట్టుబట్టిన జయలలిత.. నివేదికలో విస్తుపోయే నిజాలు

author img

By

Published : Oct 22, 2022, 3:28 PM IST

ఒక మహిళగా.. అందులోనూ సీఎంగా పాలన, పౌరుషంలోనూ గడగడలాడించారు. ప్రత్యర్థుల్ని చూసి ఏనాడూ జంకలేదు. ఎంతటి క్లిష్టమైన ఎన్నికైనా ధైర్యంగా ఎదుర్కొనేవారు. అలాంటి జయలలిత.. తన చివరి రోజుల్లో ఆస్పత్రిలో బాధాకరస్థితిలో ఉన్నట్లు తేలింది.

jayalalitha status in her last days in hospital
jayalalitha status in her last days in hospital

Jayalalitha Last Days: జయలలిత.. తన చివరి రోజుల్లో ఆస్పత్రిలో బాధాకరస్థితిలో ఉన్నట్లు తేలింది. ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ నివేదికలో వెల్లడైంది. ఆమె ఆస్పత్రిలో ఉన్న 75 రోజుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా మారిందో వివరంగా ఇచ్చారు. 2016 సెప్టెంబరు 22న రాత్రి 10.25 గంటలకు స్పృహలేని స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే జ్వరం, హైపర్‌టెన్షన్‌, హైపోథైరాయిడ్‌, మధుమేహం, పేగు సమస్యలకూ చికిత్సలు అందించారు. స్టెరాయిడ్స్‌ ఇచ్చారు. కమ్యూనిటీ అక్వైర్డ్‌ నిమోనియా, ఎడమ జఠరిక లోపాలున్నట్లు అదేరోజు బయటపడ్డాయి.

ఈసీజీకి నిరాకరణ
సెప్టెంబరు 24న రాత్రి 7.30 ప్రాంతంలో ఛాతీ భాగంలో నొప్పిగా ఉన్నట్లు జయలలిత భావించారు. 26న నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేషన్‌పై నిద్రలేకుండా ఇబ్బందిపడ్డారు. తనకు ఇబ్బందిగా ఉందని వైద్యులకు తెలిపారు. ఈసీజీ తీస్తామంటే ఒప్పుకోలేదు. ఆ తర్వాత గుండె కవాటంలో ఇబ్బంది ఉన్నట్లు టీటీఈలో తేలింది. గతంతో పోల్చితే ఈ సమస్య పెరిగినట్లుగా గుర్తించారు. 28న ఆమెకు నిద్రలేదు. ఊపిరి సరిగా ఆడక, తీవ్రంగా దగ్గుతూ కనిపించారు. ఆమె కోలుకోగానే కవాట సంబంధ సర్జరీ చేయాలని అదేరోజు సాయంత్రం వైద్యుడు సోమన్‌ తెలిపారు. అప్పటికి సెప్సిస్‌ లక్షణాలు లేవని, కవాట, ఊపిరితిత్తుల సమస్యలున్నాయని, కవాట సర్జరీ ముందస్తుగా చేయాలని డాక్టర్‌ రామ్‌గోపాలకృష్ణన్‌ 29న తెలిపారు. రెండ్రోజులపాటు ఊపరితిత్తుల భాగంలో ప్రమాదకర ద్రవాన్ని తీసే ప్లూరనల్‌ ఫ్లూయిడ్‌ ఆస్పిరేషన్‌ నిర్వహించారు.

పోర్టబుల్‌ వెంటిలేటర్‌తో..
నవంబరు 1న ఆమె సుమారు 12 నిమిషాలపాటు కూర్చున్నారు. శ్వాస ఇబ్బంది ఉండటంతో 2న మాస్క్‌బ్రీతింగ్‌, వెంటిలేటర్‌ సాయం అందించారు. 4న కడుపులో నొప్పిగా ఉందని జయలలిత చెప్పారు. 5న కాస్త మెరుగై.. పోర్టబుల్‌ వెంటిలేటర్‌ సాయంతో వీల్‌ఛైర్‌లో కూర్చునేందుకు ప్రయత్నించారు. 14న సాయంత్రం కవాటాన్ని సరిచేయడంతో ఆమె బాగా మాట్లాడారు. 19న 5 లీటర్ల ఆక్సిజన్‌ టీ పీఎస్‌ వెంటిలేటర్‌ సాయంతో వీల్‌ఛైర్‌లో కూర్చున్నారు. అదేరోజు వార్డుకు తీసుకెళ్లారు. శ్వాస సమస్య, దగ్గు తగ్గలేదు. 20న టిఫిన్‌, కప్పు పెరుగన్నం తిన్నారు. మంచంపై 15 నిమిషాలపాటు కూర్చున్నారు. 22న దగ్గు వచ్చినప్పుడు స్రావం రావడం మొదలైంది. 23న ఉదయం 11.45కు కడుపు కిందిభాగంలో నొప్పి ఎక్కువగా ఉందని చెప్పారు.

గుండె కొట్టుకునే వేగం తగ్గింది..
25న జయ కుటుంబికుల ఆహ్వానం మేరకు యూఎస్‌ఏ నుంచి గుండెజబ్బు వైద్యనిపుణులు సమిన్‌శర్మ వచ్చారు. సాయంత్రంలోపు కరొనరీ ఆంజియోగ్రామ్‌ చేయాలని చెప్పారు. డాక్టర్‌ రిచర్డ్‌తో మాట్లాడాక నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇదే విషయాన్ని కుటుంబికులు, ప్రభుత్వాధికారులకు తెలిపారు. అదేరోజు ట్రాకియోస్టొమీ తీసేసి నెంబరు 4 షిలే ట్యూబ్‌ను అమర్చారు. గొంతుకు ఫెనెస్టేటెడ్‌ ట్యూబ్‌ను అమర్చడంతో ఆమె నిరాశచెందారు. దీంతో దానిస్థానంలో నాన్‌-ఫెనెస్టేటెడ్‌ ట్యూట్‌ను అమర్చారు. మరుసటిరోజు గుండె కొట్టుకోవడం తగ్గింది. ఫిజియోథెరపీ చేసేటప్పుడు నిమిషానికి 46 నుంచి 38 సార్లే కొట్టుకునేది. అంతలోసే సాధారణస్థితి వచ్చేది. ఇలా రెండుసార్లు జరిగింది. 27న టీ పీస్‌ వెంటిలేటర్‌ను తీసేసి ఒత్తిడి ద్వారా పనిచేసే వెంటిలేటర్‌ను అమర్చారు. తలనొప్పిగా ఉందంటూ 29న జయలలిత ఫిజియోథెరపీకి నిరాకరించారు. 30న ఛాతీ ప్రాంతంలో తనకు మంటగా ఉందని చెప్పారు. డిసెంబరు 1న కుడి కంటినుంచి నీరు కారుతుండటంతో ఐడ్రాప్స్‌ వేశారు. 2న రాత్రి 11 గంటలకు శ్వాస సరిగా ఆడటంలేదన్నారు. అప్పుడు పీసీఓ2 60శాతం ఉండగా, పొటాషియం స్థాయి పెరిగింది.

కళ్లు తెరిచి పిలిచారు
అక్టోబరు 3న జ్వరం తీవ్రమైంది. వెంటిలేటర్‌పైనే ఉంచారు. 4న ఆమెకు ఊపిరితిత్తుల సమస్య (పల్మనరీ ఎడెమా) ఉన్నట్లు అనుమానించారు. గుండెలో రక్తప్రవాహం తగ్గినట్లు డాక్టర్‌ బాబూ అబ్రహం గుర్తించారు. 5న ఎయిమ్స్‌ వైద్యబృందం వచ్చింది. వారి సూచనమేరకు ట్రాకియోస్టొమీ ట్యూబ్‌ 7వ తేదీన అమర్చారు. అప్పుడు జయలలితలో మార్పు వచ్చింది. కళ్లు తెరిచి పిలవడం లాంటివి చేశారు. 12న ఆమెకు మగతగా అనిపించింది, అడపాదడపా మాత్రమే నిద్రించేవారు. గుండెకు ఆంజియోగ్రామ్‌ తీయాలని యూఎస్‌ఏ వైద్య నిపుణుడు స్టువర్ట్‌ రసెల్‌ సూచించారు. 18న అపోలో బృందం చర్చించాక.. ఆమెకు కరొనరీ ఇస్కీమియాకు 72 గంటలపాటూ చికిత్స చేయాలని నిర్ణయించారు. అలా చేస్తే మూత్రపిండాలకు ఇబ్బంది ఉండొచ్చ అనుకున్నారు.

ఐసీయూలో ఉండగానే..
జయలలిత అక్టోబరు 19న మాట్లాడారు. 22న సంజ్ఞలకు స్పందించడం మొదలుపెట్టారు. కండరాల్లో బలహీనత తగ్గలేదు. దానికి చికిత్స చేయాలనుకున్నారు. 27న ముఖం ఎడమవైపు కండరాల్లో కదలికలు కనిపించాయి. రాత్రి 10 గంటల సమయంలో ఆమెకు చిరాకుగా అనిపించి.. 'నేను ఇంటికి వెళ్తాను' అని అన్నారు. వెంటిలేటర్‌ను తీసేశారు. వైద్యులబృందం ఆమెకు వెంటిలేటర్‌ అవసరంపై నచ్చచెప్పడంతో ఒప్పుకొన్నారు. 29న రాత్రి ఆమెకు గుండె కొట్టుకోవడంలో సమతుల్యత లోపించింది. ఛాతీలో తీవ్ర నొప్పిగా ఉందని ఆమె వైద్యులకు చెప్పారు. రెండ్రోజులపాటూ ఈసీజీలు తీశారు. స్వల్ప గుండెపోటు వచ్చినట్లు తేలింది. గుండెలో రక్తప్రసరణ కూడా తగ్గింది. మళ్లీ ఈసీజీ తీస్తామంటే.. జయలలిత నిరాకరించారు. 31వ తేదీన అవయవాలు కదిలించడం, కూర్చోవడానికి ప్రయత్నించడం, మంచం నుంచి కాళ్లు కిందపెట్టడంలాంటివి చేశారు.

4న మరింత ఇబ్బంది
డిసెంబరు 3న ఉదయం 10.30గంటలకు శ్వాస తీసుకునే రేటు బాగా పెరిగింది. కరొనరీ ఆంజియోగ్రామ్‌ తీయాలని తిరిగి ఎయిమ్స్‌ బృందం సూచించింది. తీవ్ర దగ్గు మరింత బాధించింది. 4న.. దగ్గినప్పుడు స్రావం ట్యూబుల్లో ఇరుక్కుపోయింది. తిరిగి వాటిని శుభ్రంచేసేవారు. 11గంటలకు కార్న్‌ఫ్లేక్స్‌తో పాలు తాగారు. 10-15 నిమిషాలు మంచం నుంచి కూడా దిగారు. మధ్యాహ్నం భోజనం చేయలేదు. అది తెలియకుండానే వైద్యురాలు ఆమెకు శ్వాసనాళ మాస్క్‌ను వేశారు. మధ్యాహ్నం 1.20కి జయలలిత వాంతి చేసుకున్నారు. సాయంత్రానికి శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పారు. గుర్రుమన్న శబ్దం శ్వాసలో కనిపించింది. ఇది తీవ్రమవుతూ వచ్చింది. ఆమెను సాధారణస్థితికి తేవడానికి సీపీఆర్‌ పద్ధతి అనుసరించారు. 3సార్లు షాక్‌ ఇచ్చారు. మరోపక్క చికిత్స ఇస్తూనే ఉన్నారు. వెంటనే ఎక్మో బృందాన్ని అప్రమత్తం చేశారు. స్పృహలో లేకున్నా కళ్లు కదుపుతున్న లక్షణాలు కనిపించాయి. సాయంత్రానికి డయాలసిస్‌ కూడా చేశారు. ఈసీజీలో గుండెకొట్టుకోవడం కనిపించలేదు. 4వ తేదీ అర్ధరాత్రి దాటే వరకు ఇదే కొనసాగింది. 5న సాయంత్రం 4.10కి ఎయిమ్స్‌ వైద్యుల సలహామేరకు మెదడు సంబంధ పరీక్షలకు ప్రతిపాదించారు. ఆ రోజు రాత్రి 11 గంటలకు ఎక్మో కొనసాగించేలా ఆదేశించారు. ఏవీ ఫలించలేదు. ఆమె మరణించినట్లు రాత్రి 11.30లకు ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.