డీఎంకే ఎమ్మెల్యేపై ఐటీ నజర్.. 50ప్రాంతాల్లో సోదాలు.. కర్ణాటక కాంగ్రెస్ నేత ఇంటిపైనా..

author img

By

Published : Apr 24, 2023, 11:36 AM IST

it raids in g square chennai

తమిళనాడులో ఐటీ దాడుల వేడి కొనసాగుతోంది. పన్ను ఎగవేత ఆరోపణలతో రియల్​ ఎస్టేట్​ కంపెనీ జీ స్క్వేర్​ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీఎం​కే నేత ఇంట్లో కూడా దాడులు చేసింది. ఈ దాడులను వ్యతిరేకంగా డీఎం​కే శ్రేణులు నిరసన చేపట్టాయి.

తమిళనాడుకు చెందిన ప్రముఖ రియల్​ ఎస్టేట్​ కంపెనీ జీ స్క్వేర్​పై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుపుతోంది. పన్ను ఎగవేత, ఆదాయం లెక్కల్లో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలకు సంబంధించి 50 పైగా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా.. డీఎం​కే నేత, అన్నానగర్​ ఎమ్మెల్యే మోహన్, ఆయన కుమారుడు కార్తీక్​ ఇంటితో సహా కోయంబత్తూర్​లోని జీ స్క్వేర్​ కార్యాలయంలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ ఐటీ దాడులను వ్యతిరేకిస్తూ డీఎం​కే శ్రేణులు.. ఎమ్మెల్యే మోహన్​ ఇంటి ముందు నిరసన చేపట్టాయి.

జీ-స్క్వేర్ సంస్థ తక్కువ ధరలకు ఆస్తులు కొని.. వాటిని అధిక ధరలకు అమ్ముతోందని ఐటీ అధికారులు చెప్పినట్లు సమాచారం. కానీ, వసూలు చేసిన ఎక్కువ మొత్తానికి పన్నులు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై స్పష్టత రావాలంటే.. కంపెనీ డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, దాడులు చేసే సమయంలో ఐటీ శాఖ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారి బదులు సీఏపీఎఫ్​ (కేంద్ర సాయుధ పోలీస్​ బలగాలు​) సాయం తీసుకున్నారు. జీ స్క్వేర్​ కంపెనీపై దాడులు జరగడం ఇదే మొదటి సారి కాదు. పన్ను ఎగవేత ఆరోపణలతో 2019లో కూడా ఐటీ దాడులు జరిగాయి.

అంతకుముందు.. జీ స్క్వేర్ కంపెనీపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ కంపెనీని డీఎం​కే నేత కుటుంబం నడుపుతోందని.. అందుకే దానికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలా లబ్ధి చేకూరినట్లు ఆరోపించారు. అందువల్లనే ఆ సంస్థ అనూహ్య వృద్ధి సాధించిందని.. లేకపోతే అది సాధ్యం కాకపోయేదని అన్నారు.

కర్ణాటకలోనూ...
మరోవైపు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోనూ ఆదాయపు పన్ను శాఖ దాడులు చేపట్టింది. మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత గంగాధర్​ గౌడకు సంబంధించిన రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. దాంతో పాటు దక్షిణ కన్నడ జిల్లా బేల్థగడిలోని ఓ విద్యా సంస్థలో కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు.

మరోవైపు, లోకాయుక్త సైతం కర్ణాటకలో దాడులు చేపడుతోంది. లెక్కకు మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలతో బీబీఎంపీ (బృహన్​ బెంగళూరు మహానగర పాలిక)లోని అసిస్టెంట్​ టౌన్​ ప్లానింగ్​ అధికారి గంగాధరయ్య ఇంట్లో దాడులు నిర్వహించింది. నగదు, నగలు తదితర వస్తువులతో పాటు కొన్ని డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

lokayuktha raids in karnataka
లోకాయుక్త స్వాధీనం చేసుకున్న నగదు, నగలు ఇతర డాక్యుమెంట్లు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.