ETV Bharat / bharat

Jawaharlal Nehru: నెహ్రూ దేశ ఉపాధ్యక్షుడైన వేళ..

author img

By

Published : Sep 2, 2021, 9:15 AM IST

Updated : Sep 2, 2021, 9:25 AM IST

జవహర్‌లాల్‌ నెహ్రూ అనగానే.. దేశ తొలి ప్రధాని (India First Prime Minister) అని అందరికీ గుర్తొస్తారు. అయితే ఆయన భారత్​కు ఉపాధ్యక్షుడిగా(Nehru As Vice President) కూడా ఉన్నారని చాలా మందికి తెలియదు. నెహ్రూ ఉపాధ్యక్షుడిగా ఎప్పుడున్నారనేగా.. మరి ఆ విషయం తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Nehru, Sardar Patel
నెహ్రూ, సర్దార్​ పటేల్​

జవహర్‌లాల్‌ నెహ్రూ (Jawaharlal Nehru) దేశ ఉపాధ్యక్షుడవటం ఏంటనుకుంటున్నారు కదూ! స్వతంత్ర భారతావనికి తొలి ప్రధాని (India first prime minister)కాకముందే.. నెహ్రూ దేశానికి ఉపాధ్యక్షుడయ్యారు! అదెలా అంటే.. స్వాతంత్య్రానికి ఏడాది ముందు 1946లో సరిగ్గా సెప్టెంబరు 2న కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ముస్లిం లీగ్‌తో కలసి దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. తేదీ ఖరారు కాకున్నా భారత్‌ నుంచి తెల్లవారు వెళ్లిపోవటం ఖాయమైందప్పటికే. అధికార బదిలీ సక్రమంగా జరిగేందుకు వీలుగా ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఆధారంగా ఈ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.

నెహ్రూకు విదేశాంగ శాఖ

అప్పటిదాకా పాలన నడిపిస్తున్న బ్రిటిష్‌ వైస్రాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ స్థానంలో ఈ తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. దీనికి అధ్యక్షుడిగా బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ (తొలుత లార్డ్‌ వావెల్‌, 1947 మార్చి నుంచి మౌంట్‌బాటన్‌) వ్యవహరించగా.. ఉపాధ్యక్షుడి బాధ్యతలను (Nehru As Vice President) జవహర్‌లాల్‌ నెహ్రూకిచ్చారు. ఈ హోదాలో ఆయనకు ప్రధానమంత్రికుండే అధికారాలన్నీ ఉండేవి. నెహ్రూ ఆధ్వర్యంలో 12 మంది సభ్యుల కేబినెట్‌ ఏర్పాటైంది. పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేస్తున్న ముస్లిం లీగ్‌ తొలుత ప్రభుత్వంలో చేరటానికి ఇష్టపడకున్నా తర్వాత చేరింది. తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడి హోదాలో నెహ్రూ విదేశాంగ శాఖ, కామన్వెల్త్‌ సంబంధాలు తీసుకోగా, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు హోంశాఖ, సమాచార మంత్రిత్వ శాఖ అప్పగించారు. తర్వాత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్రప్రసాద్‌కు వ్యవసాయం, సి.రాజగోపాలచారికి విద్య, బల్‌దేవ్‌సింగ్‌కు రక్షణ, జగ్జీవన్‌రామ్‌కు కార్మిక, అసఫ్‌ అలీకి రైల్వే శాఖలు కేటాయించారు. ముస్లిం లీగ్‌ నుంచి కేబినెట్‌లో చేరిన లియాఖత్‌ అలి ఖాన్‌ (తర్వాత పాకిస్థాన్‌ తొలి ప్రధాని అయ్యారు)కు ఆర్థిక శాఖ కేటాయించారు. 1946 సెప్టెంబరు 2 నుంచి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగస్టు 15 దాకా ఈ తాత్కాలిక ప్రభుత్వమే దేశంలో పాలన కొనసాగించింది.

ఉప్పు పన్ను రద్దు

1885 నుంచి భారతీయులు భరిస్తూ వస్తున్న ఉప్పుపై పన్నును (గాంధీ దండి యాత్ర చేపట్టింది కూడా ఈ పన్ను రద్దుకే) ఈ తాత్కాలిక ప్రభుత్వమే రద్దు చేసింది. అంతేగాకుండా.. తొలి బ్యాచ్‌ విదేశాంగశాఖ అధికారులను (ఐఎఫ్‌ఎస్‌) నియమించటం కూడా ఆరంభించింది. అమెరికా, సోవియట్‌ యూనియన్‌, ఫ్రాన్స్‌లతో పాటు అన్ని దేశాలతో దౌత్యపరమైన చర్చలు కూడా మొదలయ్యాయి. ఫలితంగా 1947 ఏప్రిల్‌లోనే భారత్‌లో తమ తొలి రాయబారిగా డాక్టర్‌ హెన్రూ గ్రాడీని అమెరికా నియమించింది. మేలో చైనా రాయబారి డాక్టర్‌లో చియా లున్‌ దిల్లీ వచ్చేశారు. బెల్జియం తమ కాన్సులేట్‌ కార్యాలయాన్ని కోల్‌కతాలో తెరిచింది.

ఇదీ చదవండి: గాంధీ 'సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం'తోనే స్వాతంత్ర్యం

Last Updated : Sep 2, 2021, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.